ఆ సొమ్మునూ వాయిదాల్లో చెల్లించమ్మన్నాడు
సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ వ్యవహారం ఇది
14 రోజుల రిమాండ్ విధించిన ప్రత్యేక కోర్టు
చంచల్ గూడ జైలుకు తరలించిన అధికారులు
హైదరాబాద్: ఓ కేసులో బాధితుడికి–నిందితుడికి మధ్య రాజీ చేశాడు... అప్పటికే నమోదైన కేసుకు ముగింపు పలకడానికి నిందితుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు... అంగీకరించిన మొత్తం వాయిదాల్లో చెల్లించే అవకాశమూ ఇచ్చాడు... ఐదో విడత చెల్లింపు ఆలస్యం కావడంతో వేధింపులు మొదలెట్టాడు... ఫిర్యాదుదారుడిగా మారిన నిందితుడు అవినీతి నిరోధక శాఖను (ఏసీబీ) ఆశ్రయించడంతో చిక్కాడు... నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పార్కింగ్‌లో రూ.3 లక్షలు లంచం తీసుకుని, ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టి మరీ చిక్కిన ఇన్‌స్పెక్టర్ చామకూరి సుధాకర్ వ్యవహారమిది. గురువారం అరెస్టు చేసిన ఇతడిని ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
నగరానికి చెందిన సత్యప్రసాద్ అనే వ్యక్తికి యాప్రాల్‌లో ఓ విల్లా ఉంది. దీన్ని రంగస్వామి ద్వారా అమెరికాలో ఉంటున్న ఎన్నారై హేమసుందర్‌రెడ్డికి రూ.1.5 కోట్లకు విక్రయించారు. దీని నిమిత్తం సదరు ఎన్నారైకి నగరంలోని ఓ బ్యాంక్‌లో లోన్ కూడా ఇప్పించారు. ఇలా వచి్చన మొత్తం నుంచి రూ.50 లక్షలతో అప్పటికే ఆ ఇంటిపై ఉన్న గృహరుణాన్ని క్లియర్ చేశాడు. మిగిలిన రూ.కోటి వెచి్చంచి స్థలం కొందామని, దాన్ని అభివృద్ధి చేసి లాభాలు పొందుదామంటూ రంగస్వామి ఇచ్చిన సలహా సత్య ప్రసాద్‌కు నచి్చంది. దీంతో అతడితో ఒప్పందం చేసుకున్న సత్య ప్రసాద్ ఆ మొత్తం అందించాడు. దీన్ని వెచి్చంచిన రంగస్వామి నాచారం ప్రాంతంలో 1600 స్థలం ఖరీదు చేశాడు.
అయితే అనివార్య కారణాల నేపథ్యంలో దాన్ని అభివృద్ధి చేయడం, విక్రయించడం సాధ్యపడలేదు. దీంతో సత్య ప్రసాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి రంగస్వామి తనను రూ.కోటి మేర మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి నమోదైన కేసును సీసీఎస్‌లోని ఎకనమికల్ ఆఫెన్సెస్ వింగ్ టీమ్–7 ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సీహెచ్ సుధాకర్ దర్యాప్తు చేశారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై అరెస్టు చేయడమో, నోటీసులు ఇవ్వడమో చేయాలి. దీనికి భిన్నంగా వ్యవహరించిన సుధాకర్ ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్య ప్రసాద్, రంగస్వామి మధ్య రాజీ చేశాడు. రూ.కోటి వాయిదాల పద్దతిలో చెల్లించే ఒప్పందం చేసి ఈ మేరకు ఎంఓయూ కూడా రాయించాడు.
చట్ట ప్రకారం ఇలా రాజీపడిన కేసుల్లో ఇరు పక్షాలకు కోర్టులో హాజరుపరిచి, లోక్ అదాలత్ ద్వారా క్లోజ్ చేయాలి. అయితే ఈ కేసులో కాసులు ఏరుకోవాలని భావించిన సుధాకర్ కేసు క్లోజ్ చేయడానికి రూ.15 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఈ మొత్తం నిందితుడిగా ఉన్న రంగస్వామి చెల్లించేలా ఆదేశించాడు. ఒకేసారి అంత మొత్తం ఇచ్చుకోలేనంటూ రంగస్వామి వేడుకోగా... వాయిదాలో చెల్లించే అవకాశమూ ఇచ్చాడు. ఇప్పటికే రూ.50 వేలు, రూ.50 వేలు, రూ.2 లక్షలు, రూ.2 లక్షలు చొప్పున నాలుగు వాయిదాల్లో రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆఖరి వాయిదా ముట్టి 20 రోజులు గడిచిన తర్వాత మరో రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. దీంతో రంగస్వామి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
వారి సూచనల మేరకు సుధాకర్‌తో బేరసారాలు మొదలెట్టారు. ప్రస్తుతానికి తాను రూ.5 లక్షలు ఇచ్చుకోలేనని, తన వద్ద కేవలం రూ.2.5 లక్షలే ఉన్నాయంటూ చెప్పిన రంగస్వామి ఆ మొత్తం తీసుకుని రెండు రోజుల క్రితం సీసీఎస్ వద్దకు వెళ్లారు. అయితే తాను కూడా పై అధికారులకు ఇవ్వాల్సి వస్తుందంటూ పేర్కొన్న సుధాకర్ ఆ మొత్తం తీసుకోవడానికి నిరాకరించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టాడు. దీంతో ఆ రోజు ఏసీబీ ట్రాప్‌లో పడకుండా తప్పించుకున్నాడు. ఆపై మరోసారి బేరసారాల తర్వాత గురువారం రూ.3 లక్షలు తీసుకోవడానికి అంగీకరించి, తీసుకుని ఏసీబీ అధికారులకు చిక్కి జైలుకు వెళ్లాడు. గురువారం రాత్రి ఏసీబీ అధికారులు సుధాకర్‌ను పర్యవేక్షించే అధికారుల వాంగ్మూలాలు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment