సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్‌ఫ్రాకు సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది.
రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు.
ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్‌ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది.
టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు.
ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment