చంద్రబాబు మోసం చేశాడు: రాంభూపాల్ చౌదరి
సాక్షి, కర్నూలు: రానున్న శాసనసభ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట తప్పి మోసం చేశాడని మాజీ మంత్రి, కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రాంభూపాల్ చౌదరి విమర్శించారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ను పార్టీలో చేర్చుకుని కర్నూలు శాసనసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన ఆదివారం తన అనుచరులతో సమావేశమై చర్చించారు. కర్నూలు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా కట్టేందుకు కూడా కార్యకర్తలు లేని పరిస్థితుల్లో తాను పార్టీలో చేరానని చెప్పారు.
నాలుగున్నర సంవత్సరాలపాటు వయస్సును కూడా లెక్క చేయకుండా ఇంటింటికి తెలుగుదేశం పేరుతో నగరమంతా పర్యటించి పార్టీకి పునాదులు ఏర్పాటు చేశానన్నారు. అలాంటి తనను కనీసం సంప్రదించకుండా టీజీని పార్టీలో చేర్చుకున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంపై ఏమి చేయాలనే విషయంపై అనుచరులు, అభిమానులు, కార్యకర్తల సలహాలు తీసుకున్నారు. జిల్లా పార్టీ ఇన్‌చార్జి, రాజ్యసభ స భ్యుడు సీఎం రమేష్ జోక్యం పార్టీకి మరింత నష్టం చేకూర్చే విధంగా ఉందని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌదరికి మరో రూపంలో న్యాయం చేయకపోతే తమ సత్తా ఏమిటో చాటుతామంటూ కార్యకర్తలు హెచ్చరించారు.