రోడ్డెక్కిన యానిమేటర్లు
కల్లూరు: హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా సమ్మె చేస్తున్న యానిమేటర్లు ఆందోళన తీవ్రతరం చేశారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లకు 15 నెలలుగా వేతనాలు అందకపోవడంతో వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారన్నారు.
అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో 31వ రోజులుగా సమ్మె చేస్తున్న సర్కార్ స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడి వెంటనే చర్చలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ నెల రోజులుగా విధులు బహిష్కరించడం వల్ల పొదుపు సంఘాల్లో పురోభివృద్ధి సన్నగిల్లుతుందన్నారు.
బ్యాంకింగ్‌లో రుణాల చెల్లింపులు నిలిచిపోయి కొత్త రుణాలు తీసుకోవాల్సిన పొదుపు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యానిమేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ ఐకేపీ ప్రాజెక్టు సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తించాలని, నెల నెల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాలను మేము అంగీకరించమని మంత్రి వర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. రాజకీయ వేధింపులు మానుకోవాలని, గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని కోరారు.
ఎలాంటి అవాంఛీనయ సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యూనిమేటర్లు, నాయకుల ప్రసంగాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రసంగిస్తున్న నాయకులను పోలీసులు తమ బలగాలతో వ్యాన్‌లలోకి బలవంతంగా ఎక్కించారు. మహిళా సిబ్బందిని మహిళా పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసి జీపుల్లోకి ఎక్కించి నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో రెండు గంటలపాటు ఉంచుకుని 125 మందిపై కేసులు నమోదు చేసి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సాయిబాబా, పుల్లారెడ్డి, రాముడు, గోపాల్, సుధాకరప్ప, నాగరాజు, ఆయా మండలాల యానిమేటర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.