ఆధునిక పోలీసింగ్‌తో అందరికీ ఆదర్శం అదే తక్షణ కర్తవ్యం
అమరావతి కమిషనరేట్‌పై సీపీ సవాంగ్
విధివిధానాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడి
‘సాక్షి’తో ప్రత్యేక ఇంటర్వ్యూ
విజయవాడ అమరావతి కమిషనరేట్ కొత్త రాష్ట్ర పోలీసులకు రోల్‌మోడల్‌గా ఉంటుందని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధి, విస్తీర్ణం దృష్ట్యానే కాకుండా ఆధునిక పోలీసింగ్‌తో అందరికీ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దటమే తమ తక్షణ కర్తవ్యమని చెప్పారు. కొత్త రాష్ట్ర రాజధాని కమిషనరేట్ కావటంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొదలుకొని అన్ని అంశాల్లో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోలీసులకు సుశిక్షితమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే ఉన్న విజయవాడ కమిషనరేట్‌ను అభివృద్ధి చేసి భవిష్యత్తులో వచ్చే అమరావతి కమిషనరేట్ పరిధిలోకి విజయవాడను కూడా చేర్చి మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. విజయవాడ కమిషనరేట్‌కు కొత్తగా వచ్చే అన్ని వసతులు, సౌకర్యాలు, ప్రత్యేక వింగ్‌లు అమరావతి కమిషనరేట్‌ను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తున్నవేనని వివరించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో వివిధ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...
కమిషనరేట్ విధి విధానాలు సిద్ధం
ఇప్పటికే అమరావతి కమిషనరేట్ ప్రకటన జరిగింది. 8057 చదరపు కిలోమీటర్ల పరిధి మేరకు కమిషనరేట్ ఏర్పాటైంది. వాస్తవ స్థితిలో ప్రస్తుత కమిషనరేట్ పరిధిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్, కృష్ణా జిల్లా పోలీస్, గుంటూరు అర్బన్ జిల్లా, గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ ఉన్నాయి. వీటి స్థానంలో జోన్లు వస్తాయి. రెండు జిల్లాలు కలిపి అమరావతిగా మారిన క్రమంలో ఎన్ని జోన్లు, పోలీస్ సబ్ డివిజన్లు ఏర్పాటు చేయాలి, ర్యూట్ మ్యాప్ ఎలా ఉండాలి, కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ వింగ్‌లతో పాటు స్పెషల్ బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్ సబ్ డివిజన్లు, పోలీస్ కంట్రోల్ రూమ్‌లు, ఏఆర్, స్పెషల్ బెటాలియన్లు, ప్రత్యేక పోలీస్ శిక్షణ కేంద్రాలు, ఇలా అన్ని అంశాలపై కసరత్తు చేసి సిద్ధం చేస్తున్నాం. కమిషనరేట్ ఏర్పాటుకు రాజకీయ అడ్డంకులు ఉన్నాయనేది అవాస్తవం. భారీ కమిషనరేట్ కాబట్టి విధివిధానాల రూపకల్పనకు కొంత సమయం పడుతుంది.
డెప్యుటేషన్‌పై సిబ్బంది...
విజయవాడ కమిషనరేట్, తుళ్లూరు సబ్ డివిజన్‌కు కలిపి 1728 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 674 మంది సిబ్బందితో తుళ్లూరు కొత్త సబ్‌డివిజన్, విజయవాడ కమిషనరేట్‌లో 583 మందితో సిటీ సెక్యూరిటీ వింగ్, 471 అదనపు పోస్టులతో కమిషనరేట్‌ను బలోపేతం చేస్తున్నాం. వాటిలో సీఐ క్యాడర్ నుంచి డీసీపీ పోస్టుల వరకు ఫర్వాలేదు. మిగిలిన పోస్టుల భర్తీ కోసం కానిస్టేబుళ్లను ఇతర రేంజ్‌లు, ఇతర కమిషనరేట్, అర్బన్ జిల్లాల నుంచి డెప్యుటేషన్‌పై తీసుకురావాలని చూస్తున్నాం. కొద్ది నెలల్లో సిబ్బందిని భర్తీ చేస్తాం.
వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ
పోలీసులకు రెగ్యులర్ పోలీసింగ్‌తో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యత కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విజయవాడలో సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఏర్పాటవుతుంది. దీనికంటే ముందు ప్రస్తుతం సైబర్ సెల్ పనిచేస్తుంది. ఈఎస్‌ఎఫ్ ల్యాబ్స్, కేఎల్ యూనివర్సిటీ, ఏపీ పోలీస్ కలిపి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ క్రైం, యాక్ట్, కేసు మిస్టరీ ఛేదించే క్రమంలో అధునాతన పరిజ్ఞానం వినియోగించుకోవాల్సిన తీరు ఇలా అన్ని అంశాలపై శిక్షణ సాగుతుంది. కొత్తగా వచ్చే సిటీ సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్ పోలీసులకు కూడా ప్రత్యేకంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తాం.
నగరంలో 5 సబ్ డివిజన్లు...
విజయవాడ నగరంలో ఇప్పటి వరకు మూడు మాత్రమే సబ్ డివిజన్లు ఉన్నాయి. వాటిని ఐదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉన్న మూడింటి పరిధిని పరిశీలించి వాటి హద్దులో మార్పులు చేర్పులు చేసి ఐదుగా చేస్తాం. సీఎం సహా ఇతర వీవీఐపీల రాకపోకలు సెంట్రల్ సబ్ డివిజన్‌లో ఎక్కువగా ఉంటుంది. దీంతో సెంట్రల్ సబ్ డివిజన్, వెస్ట్ సబ్ డివిజన్ల పరిధిలో మూడోది కొత్తగా వస్తుంది. ఇవి కాకుండా లా అండ్ ఆర్డర్ డీసీపీ ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు దానిని రెండు చేసి వారికి పరిధి నిర్ణయిస్తాం. ట్రాఫిక్ సబ్ డివిజన్లను రెండింటిని నాలుగు చేస్తున్నాం. నగర ట్రాఫిక్‌ను బలోపేతం చేయటానికి కొత్తగా 183 మందిని కేటాయించారు. వారిని త్వరలోనే భర్తీ చేస్తాం.