
'బడ్జెట్ పూర్... రాజధాని సింగపూర్'
హైదరాబాద్: ఏపీ రాజధాని కోసం జరుగుతున్న భూసేకరణపై ప్రజలు, రైతుల్లో పలు భయాలు నెలకొన్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని పలువురు వక్తలు ఆరోపించారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనచైతన్య వేదిక నిర్వహించిన ఏపీ రాజధాని-భూ సేకరణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి పలు పార్టీల నేతలు, మేధావులు హాజరయ్యారు.
రాజధాని కోసం జరుగుతున్న భూసేకరణ, ప్రభుత్వ వైఖరి గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజధాని వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సొంత వ్యవహారంలా చూస్తోందని విమర్శించారు. రాజధాని కోసం భూమి సేకరిస్తున్నారా లేదా సమీకరిస్తున్నారని ప్రశ్నించారు. 'బడ్జెట్ పూర్... రాజధాని సింగపూర్' అన్న తరహాలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.