కబ్జాదారుకే కట్టబెడుతున్నారు | Rs. 1,000 crore valuable land to the CM Relative | Sakshi
Sakshi News home page

కబ్జాదారుకే కట్టబెడుతున్నారు

Published Sat, Jun 10 2017 7:52 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

కబ్జాదారుకే కట్టబెడుతున్నారు

కబ్జాదారుకే కట్టబెడుతున్నారు

సీఎం బామ్మర్ది బంధువు ఎంవీవీఎస్‌ మూర్తికి 55.24 ఎకరాల భూమి కారు చౌకగా కట్టబెట్టేందుకు కేబినెట్‌ రెడీ
 
ప్రభుత్వ ముఖ్య నేతకు దగ్గరి బంధువు కావడంతో చట్టమూ చుట్టమైపోయింది.. అడిగిందే తడవుగా అంతా అనుకూలంగా చేసి పెట్టండని కనుసైగ చేశారు.. తప్పు తప్పన్న అధికారులే ఒప్పు అంటున్నారు.. నిబంధనలు నీరుగారిపోయాయి.. కబ్జా చేయడం ఇంత సులువా అన్నట్లు వ్యవహారం సాగిపోయింది.. తుదకు కంచే చేనును మేసింది.. జనమేమనుకుంటారనే ఇంగిత జ్ఞానం లేకుండా విలువల వలువలూడదీశారు.. దండుకోవడమే పరమావధిగా నీతి, నియమాలకు పాతరేశారు.. రాచరిక పాలనే లక్ష రెట్లు నయం అనిపిస్తున్నారు.
 
సాక్షి, అమరావతి: అది నూటికి నూరు శాతం ప్రభుత్వ భూమి. ‘గీత’O దాటి దర్జాగా ఆక్రమించాడు. అధికారులు సర్వే నిర్వహించి కబ్జాకు గురైందని సర్కారుకు నివేదించారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు మిన్నకుండిపోయారు. దీంతో తన అవసరాలకు ఆ భూములు కేటాయించాలని కబ్జాదారుడు దరఖాస్తు చేశారు. మరోమాటకు తావు లేకుండా ఆ భూములు అతనికే ఇచ్చేయాలంటూ ఫైలు సిద్ధమై పోవడం విస్తుగొలుపుతోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ, గీతం కాలేజీ చైర్మన్‌ ఎంవీవీఎస్‌ మూర్తి ప్రభుత్వ ముఖ్య నేతకు దగ్గరి బంధువు. విశాఖపట్నం జిల్లా యండాడ, రుషికొండ గ్రామాల్లోని సర్వే నెంబర్లు 15పి, 16పి, 19పి, 20పి, 55పి, 61పి, 34, 35, 37, 38ల్లోని 55.24 ఎకరాలను 2013లో ఆక్రమించుకున్నారు.

ఈ భూమి విలువ సుమారు రూ.1,000 కోట్లకు పైగానే పలుకుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆక్రమించుకున్న ఈ భూములను గీతం కాలేజీకి కేటాయించాలంటూ 2014లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై అప్పటి ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా అధికారులు లొంగలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖపట్నంలోని ఎంతో విలువైన ఈ భూమి ప్రభుత్వ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, మూర్తికి కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

అయినా ఒత్తిడి పెరగడంతో ఏదో విధంగా ఆ భూములను కాపాడాలనే ఉద్దేశంతో 2014లో ఎస్సీ హాస్టల్‌ కాలేజీ నిర్మాణానికి ఐదు ఎకరాలు, పోస్టు మెట్రిక్‌ విద్యార్థులకు రెండు హాస్టళ్ల నిర్మాణాలకు ఆరు ఎకరాలు, బలహీన వర్గాల గృహ నిర్మాణం, శిక్షణ కేంద్రాలకు ఆరు ఎకరాలు, ఆదాయపు పన్ను శాఖ విభాగం కార్యాలయం, ఇళ్ల నిర్మాణాలకు ఆరు ఎకరాలు, ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్‌ యూనివర్సిటీ రీజినల్‌ కేంద్రం భవన నిర్మాణానికి ఐదు ఎకరాలు, పోస్టు మెట్రిక్‌ విద్యార్థినుల రెండు హాస్టళ్ల నిర్మాణాలకు ఏడు ఎకరాలను కేటాయించారు. ఈ 35 ఎకరాల భూమిని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఎ) కేటాయింపులకు అనుగుణంగా ఆయా సంస్థలకు అప్పగించలేదు. దీనిపై విశాఖపట్నానికి చెందిన ఒక పౌరుడు.. ఎంవీవీఎస్‌ మూర్తి 55.24 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా అనుమతి లేకుండా నిర్మాణాలను చేపట్టారని జిల్లా కలెక్టర్, డీజీపీ, పోలీసు కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. దీనిపై విచారణ జరిపి నిర్మాణాలను తొలగించి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.
 
భూ ఆక్రమణ నిజమే..
గీతం కాలేజీ చైర్మన్‌ ఎంవీవీఎస్‌ మూర్తి.. ప్రభుత్వ భూమి 55.24 ఎకరాలను ఆక్రమించిన విషయం వాస్తవమేనని జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో, తహసీల్దార్‌ ధ్రువీకరించారు. సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో సర్వే చేయించి కబ్జాను నిగ్గు తేల్చారు. యండాడ, బుషికొండలో గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను గూగుల్‌ మ్యాప్‌తో సహా ధృవీకరిస్తూ 2015 అక్టోబర్‌ 8వ తేదీన తహసీల్దార్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్‌ గీతం కాలేజీ యాజమాన్యం నుంచి లంచం తీసుకుని కబ్జాను పట్టించుకోవడం లేదని మరో పౌరుడు గత ఏడాది డిసెంబర్‌లో జిల్లా కలెక్టర్‌కు, డీజీపీ, విశాఖపట్టణం సీఐడీ రీజినల్‌ కార్యాలయం అదనపు ఎస్‌పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ అదనపు ఎస్‌పీ స్పందిస్తూ.. నేరుగా తమంతట తాము చర్యలు తీసుకోలేమని చెప్పారు. డీజీపీ, సీఐడీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేయాలని, అప్పుడు దర్యాప్తునకు ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తరుణంలో ఈ భూ ఆక్రమణలపై జాయింట్‌ కలెక్టర్, తహసీల్దారు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలకు సంబంధించి సర్వే ల్యాండ్‌ రికార్డుల అదనపు డైరెక్టర్‌ రూపొందించిన నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ పౌరుడు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. గీతం కాలేజీ ఆక్రమణలను నిర్ధారిస్తూ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల అదనపు డైరెక్టర్‌ సమర్పించిన మ్యాప్‌ను గత ఏడాది డిసెంబర్‌లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం అతనికి అందజేసింది.
 
ఆ భూములిచ్చేయాలంటూ కలెక్టర్‌ సిఫార్సు
కబ్జా జరిగిందని ధ్రువీకరించినా ఆ భూములను వదులు కోవడానికి గీతం వర్సిటీ ససేమిరా అంటూ మళ్లీ చక్రం తిప్పింది. ప్రభుత్వ ముఖ్య నేత సూచన మేరకు గీతం కాలేజీ చైర్మన్‌.. ఆ భూములు తనకే కేటాయించాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక సేవలో భాగంగా కాలేజీని నిర్వహిస్తున్నానని, నామమాత్రపు ధరకు 55.24 ఎకరాలను తనకు ఇవ్వాలని దరఖాస్తులో పేర్కొన్నారు. ఆ దరఖాస్తుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. గీతం కాలేజీ ఆక్రమించుకున్న భూమి ప్రభుత్వానిదేనని జిల్లా అధికార యంత్రాంగం నిర్ధారించినా, అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా.. పట్టించుకోక పోవడం అటుంచి, నామమాత్రం ధరకు వారికే ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ సిఫార్సు చేయడం పట్ల అధికార యంత్రాంగం నివ్వెరపోతోంది. జిల్లా కలెక్టర్‌ సిఫార్సు ఆధారంగా ఆగమేఘాలపై రూ.1,000 కోట్ల విలువైన భూమిని ఎంవీఎస్‌ మూర్తికి చౌక ధరకు కట్టబెట్టేందుకు ఫైలు సిద్ధమైపోయింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలపాలని నిర్ణయించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement