రూ. 15 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
గుట్టురట్టుచేసిన మూడు రాష్ట్రాల పోలీసులు
రాజధాని శివార్లలో కేంద్రాలు
పోలీసుల అదుపులో 15 మంది నిందితులు
ఎపిడ్రిన్‌గా అనుమానం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలో నడుస్తున్న డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. బెంగళూరులో దొరికిన తీగెను లాగితే దాని డొంక రాజధాని శివార్లలోని హయత్‌నగర్‌లో కదిలింది. కేరళ, కర్నాటక, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు కలిసి ఈ రాకెట్ కేంద్రాలపై దాడులు జరిపారు. ఇందులో రూ.15 కోట్ల విలువైన ఏడు టన్నుల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి సరఫరాకు బాధ్యులైన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌లోని గండిచెరువు, సూర్‌మైగూడ, లష్కర్‌గూడతో పాటు నల్లగొండలోని చౌటుప్పల్‌లో ఈ దాడులు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన దాడులు సోమవారం అర్ధరాత్రి వరకూ సాగాయి. సంబంధిత గోడవున్లలో అనధికారికంగా కొన్ని రకాల రసాయనాలు తయారు చేస్తున్నట్లు కూడా వెల్లడైంది. వాటిని, మత్తుపదార్థాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. పట్టుబడినవి ఎపిడ్రిన్ అని భావిస్తున్నారు.
ఈ వ్యవహారంపై తొలుత కేరళ పోలీసులకు ఉప్పందింది. వారు వారం కిందట ముగ్గురు అనుమానితులను ప్రశ్నించగా హైదరాబాద్‌లో మూలాలు ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేరళ, బెంగళూరుకు చెందిన యాంటి నార్కొటిక్ వింగ్ అధికారులు, పోలీసులు నిందితులను వెంట తీసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి విషయాన్ని చెప్పారు. ఆ మేరకు ఎస్‌ఓటీ పోలీసుల సహకారంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు హయత్‌నగర్ మండలంలోని గండిచెరువులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేతకు చెందిన గోడవున్‌పై దాడి చేశారు. అక్కడి సిబ్బందిలో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి సమీపంలోని లష్కర్‌గూడలో డ్రగ్ మాఫియా తలదాచుకుంటున్న గదిని కూడా సీజ్‌చేశారు. కొద్ది దూరంలో ఉన్న సాయిప్రియ కెమికల్స్ కంపెనీపై కూడా దాడి చేశారు. ఆయా ప్రాంతాలకు మీడియాను అనుమతించ లేదు. దాడుల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.