బీసీలకు రూ.190 కోట్ల రుణాలు
కర్నూలు(అర్బన్) : రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 70వేల మంది బీసీలకు రూ.190 కోట్ల రుణాలను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాలు’ బీసీ కార్పొరేషన్ ఎండీ కె.మల్లికార్జున అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో 23వేల మంది బీసీ లబ్ధిదారులకు రూ.126 కోట్లను రుణాలుగా అందించామన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష వరకు లబ్ధిదారులకు సబ్సిడీని పెంచామన్నారు.
బ్యాంకుల ద్వారా రుణాలను అందించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు చేపడతారన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ ఆచరణలో వున్న విధంగానే బీసీ కాలనీల్లో మౌలిక వసతులను కల్పించేందుకు, బీసీ కులాలకు ఆర్థిక చేయూతనందించేందుకు రూ.6,640 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో బ్యాంకు కోచింగ్ స్థాయి నుంచి గ్రూప్స్‌కు కూడా నిరుద్యోగ యువతకు శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నందున బ్యాంకులకు డ్వాక్రా సంఘాలపై పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను బీసీ వర్గాల సంక్షేమానికి విడుదల చేస్తున్నా, బ్యాంకులు సహకరించకపోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగిన చేనేత కళాకారుల ముఖాముఖి కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యేలు బీసీ జనార్ధన్‌రెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ డెరైక్టర్ కృష్ణమోహన్, గొర్రెల సహకార సంఘం చైర్మన్ వై.నాగేశ్వరరావు.. ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ కమిటీ సభ్యుడు ఆకెపోగు ప్రభాకర్, టీడీపీ డోన్ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్, బీసీ కార్పొరేషన్ ఈడీ పీవీ రమణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.సంజీవరాజు పాల్గొన్నారు.
పాత ఇస్త్రీ పెట్టెలు, ఆటోలు
చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాల్లో భాగంగా జిల్లాకు వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర కళ్లకు అధికారులు గంతలు కట్టారు. సునయన ఆడిటోరియం పక్కన ఏర్పాటు చేసిన యూనిట్ల స్టాల్స్‌లో గత రెండు, మూడు సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న పాత ఇస్త్రీ పెట్టెలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇప్పించడం గమనార్హం. స్టాల్‌లో రెండు కొత్త ఇస్త్రీ పెట్టెలు పెట్టి, మిగిలిన ఐదు పాత ఇస్త్రీ పెట్టెలను ఉంచడం పట్ల పలువురు విస్తుపోయారు. అలాగే పాత ఆటోలను కూడా మంత్రి రవీంద్రకు చూపించడం విడ్డూరం. కాగా గతంలో మంజూరైన యూనిట్లనే ఇప్పుడు ప్రదర్శనకు ఉంచామని అధికారులు చెప్పడం కొసమెరుపు.