Minister Ravindra
-
మంత్రివర్యా.. ఇదేం పనయ్యా..
♦ సమస్యలు చెప్పేందుకు వెళితే టీడీపీ కండువాలు కప్పారు ♦ మరుసటి రోజు టీడీపీలో చేరినట్లు దుష్పప్రచారం ♦ మంత్రి రవీంద్రవి దిగజారుడు రాజకీయాలు ♦ వైఎస్సార్ సీపీని వీడలేదని ♦ ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామ నాయకులు వెల్లడి మచిలీపట్నం సబర్బన్ : సమస్యలు చెప్పేందుకు వెళితే తమను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించి ప్రచారం చేయడం మంత్రి కొల్లు రవీంద్ర దిగజారుడుతనానికి నిదర్శనమని ఎస్ఎస్ గొల్లపాలెం గ్రామ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి చర్యలను వారు ఖండించారు. ఈ నెల 2వ తేదీ ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర సీతారామపురం గ్రామంలో పర్యటించారని, ఆ సమయంలో గ్రామంలోని టీడీపీ నాయకుడు మట్టా బాలశ్రీనివాసరావు ఇంటి వద్ద మంత్రి కాసేపు ఆగారని తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు వెళితే మాపై టీడీపీ కండువాలు కప్పి మరుసటి రోజు మేమంతా పార్టీ మారినట్లు ప్రకటించారని వాపోయారు. మానసిక వికలాంగురాలైన తన భార్య వైద్యం ఖర్చులకు ప్రభుత్వం నుంచి సాయమందించాలని కోరేందుకు వెళితే సమస్య వినకుండానే టీడీపీ కండువా వేశారని వైఎస్సార్ సీపీ కార్యకర్త కనపర్తి వీరాంజనేయులు తెలిపారు. కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరైనా బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని, ఈ సమస్య పరిష్కారం కోరుతూ వెళితే మా చేతికి టీడీపీ జెండాలు ఇచ్చి నిలబెట్టారని గణేషన శ్రీనివాసరావు, కనపర్తి నారాయణ, కనపర్తి లీలాకృష్ణ తెలిపారు. కాలువలకు నీరు సమృద్ధిగా విడుదల చేసి భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకోవాలని విన్నవించేందుకు వెళితే తమపైనా టీడీపీ కండువాలు కప్పారని తిరుమలశెట్టి శేషగిరిరావు వాపోయారు. ఇదిలా ఉంటే రోడ్డుపై మంత్రి కారు నిలపడంతో తన ట్రాక్టర్ వెళ్లే దారి లేదని, ఈ నేపథ్యంలో ట్రాక్టర్ ఆపి రోడ్డుపై నిలబడిన తమపై టీడీపీ కండువాలు కప్పారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు మానేపల్లి రామాంజనేయులు, మట్టా సుబ్బారావు, మట్టా వెంకటరంగప్రసాద్, కొండయ్య, రామమోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా వీధి కుళాయి ఏర్పాటు చేయాలని వచ్చిన ఏడుగురు మహిళలపైనా టీడీపీ కండువాలు వేసి వాళ్లంతా పార్టీ మారినట్లు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మట్టా మోహననాంచారయ్య, మాజీ సర్పంచ్ చోరగూడి రామచంద్రరావు, వైఎస్సార్ సీపీ నాయకులు గణేషన వెంకటేశ్వరరావు, గణేషన రమేష్, బోలెం అర్జునరావు పాల్గొన్నారు. -
భక్తులకు అసౌకర్యం కలగకూడదు
మచిలీపట్నం (చిలకలపూడి) : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత ఏడాది 1.5 లక్షల మంది భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారని చెప్పారు. ఈ ఏడాది రెండు లక్షల మందికి పైగా భక్తులు సముద్రస్నానాలు చేసే అవకాశం ఉందన్నారు. కార్తీకపౌర్ణమి విశిష్టత తెలిపేలా మంగినపూడి బీచ్‌లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులతో పోలీసులు మర్యాదతో మెలగాలని సూచించారు. మహిళా పోలీసులను బందోబస్తులో వినియోగించాలని చెప్పారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజు సాగరహారతి, అమృత పాసుపతాస్త్రం, అనంతరం శివలింగాభిషేకం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు సాగర హారతితో పాటు బాణసంచా కాల్చటం ఉంటుందని వివరించారు. సమావేశంలో ఆర్డీవో పి.సాయిబాబు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఎంపీడీవో సూర్యనారాయణ, తహసీల్దార్ నారదముని తదితరులు పాల్గొన్నారు. -
పోర్టు భూసమీకరణకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
మచిలీపట్నం(చిలకలపూడి) : బందరు పోర్టు భూసమీకరణకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఎంఏడీఏ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ బందరు పోర్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. పోర్టుతో పాటు పారిశ్రామిక కారిడార్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. భూసమీకరణ ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. భూ యజమానులతో పాటు రైతు కూలీలకు కూడా పింఛన్లు అందిస్తామని మంత్రి వివరించారు. అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో బందరు ఆర్డీవో సాయిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), మునిసిపల్ వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, డెప్యూటీ కలెక్టర్లు సుజాత, సమజ, పద్మావతి, నరేంద్రప్రసాద్, బందరు తహసీల్దార్ బి.నారదముని పాల్గొన్నారు. -
బీసీలకు రూ.190 కోట్ల రుణాలు
కర్నూలు(అర్బన్) : రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 70వేల మంది బీసీలకు రూ.190 కోట్ల రుణాలను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాలు’ బీసీ కార్పొరేషన్ ఎండీ కె.మల్లికార్జున అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో 23వేల మంది బీసీ లబ్ధిదారులకు రూ.126 కోట్లను రుణాలుగా అందించామన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష వరకు లబ్ధిదారులకు సబ్సిడీని పెంచామన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలను అందించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు చేపడతారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఆచరణలో వున్న విధంగానే బీసీ కాలనీల్లో మౌలిక వసతులను కల్పించేందుకు, బీసీ కులాలకు ఆర్థిక చేయూతనందించేందుకు రూ.6,640 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో బ్యాంకు కోచింగ్ స్థాయి నుంచి గ్రూప్స్‌కు కూడా నిరుద్యోగ యువతకు శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నందున బ్యాంకులకు డ్వాక్రా సంఘాలపై పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను బీసీ వర్గాల సంక్షేమానికి విడుదల చేస్తున్నా, బ్యాంకులు సహకరించకపోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగిన చేనేత కళాకారుల ముఖాముఖి కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యేలు బీసీ జనార్ధన్‌రెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ డెరైక్టర్ కృష్ణమోహన్, గొర్రెల సహకార సంఘం చైర్మన్ వై.నాగేశ్వరరావు.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కమిటీ సభ్యుడు ఆకెపోగు ప్రభాకర్, టీడీపీ డోన్ ఇన్చార్జి కేఈ ప్రతాప్, బీసీ కార్పొరేషన్ ఈడీ పీవీ రమణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.సంజీవరాజు పాల్గొన్నారు. పాత ఇస్త్రీ పెట్టెలు, ఆటోలు చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాల్లో భాగంగా జిల్లాకు వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర కళ్లకు అధికారులు గంతలు కట్టారు. సునయన ఆడిటోరియం పక్కన ఏర్పాటు చేసిన యూనిట్ల స్టాల్స్‌లో గత రెండు, మూడు సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న పాత ఇస్త్రీ పెట్టెలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇప్పించడం గమనార్హం. స్టాల్లో రెండు కొత్త ఇస్త్రీ పెట్టెలు పెట్టి, మిగిలిన ఐదు పాత ఇస్త్రీ పెట్టెలను ఉంచడం పట్ల పలువురు విస్తుపోయారు. అలాగే పాత ఆటోలను కూడా మంత్రి రవీంద్రకు చూపించడం విడ్డూరం. కాగా గతంలో మంజూరైన యూనిట్లనే ఇప్పుడు ప్రదర్శనకు ఉంచామని అధికారులు చెప్పడం కొసమెరుపు. -
రైతులపై దౌర్జన్యం
- పోర్టు భూసేకరణపై తమ గోడు చెప్పేందుకు వచ్చిన రైతులు - వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు - సిగ్గుందా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి రవీంద్ర మచిలీపట్నం : స్థానిక టౌన్‌హాలులో బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ అంశంపై టీడీపీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు శని వారం నిర్వహించిన సమావేశం తోపులాటకు దారితీసింది. బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల సేకరణకు జారీచేసిన నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన కొందరు రైతులు మాట్లాడుతూ తమ సొంత భూములను సేకరించి రోడ్డున పడేస్తారా అంటూ మంత్రి, ఎంపీని నిలదీశారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రైతులపై దౌర్జన్యానికి దిగారు. రైతులు, కార్యకర్తల మధ్యతోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహంతో ‘మీకు సిగ్గులేదా? బందరు పోర్టును అడ్డుకుంటున్నారు. పేర్ని నాని రెచ్చగొడితేనే మీరు ఇక్కడకు వచ్చారు. ఏదేమైనా పోర్టు నిర్మించి తీరుతాం’ అంటూ ఊగిపోయారు. ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ రైతుల ఇష్టం లేనిదే భూములు సేకరించమని, ఈ కార్యక్రమంలో రాద్ధాంతం చేయవద్దని కోరారు. టీడీపీ కార్యకర్తలుగా ఉన్న కొందరు రైతులు తమ అభిప్రాయం చెప్పేందుకు ముందుకు వచ్చినా అవకాశం ఇవ్వలేదు. రైతులకు భూసేకరణపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిగతంగా వచ్చి చెబితే వాటిని పరిష్కరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించి పోర్టు నిర్మాణం చేస్తామని ప్రకటన చేయిస్తామని మంత్రి చెప్పారు.