మంత్రివర్యా.. ఇదేం పనయ్యా..
♦ సమస్యలు చెప్పేందుకు వెళితే టీడీపీ కండువాలు కప్పారు
♦ మరుసటి రోజు టీడీపీలో చేరినట్లు దుష్పప్రచారం
♦ మంత్రి రవీంద్రవి దిగజారుడు రాజకీయాలు
♦ వైఎస్సార్ సీపీని వీడలేదని
♦ ఎస్‌ఎన్ గొల్లపాలెం గ్రామ నాయకులు వెల్లడి
మచిలీపట్నం సబర్బన్ : సమస్యలు చెప్పేందుకు వెళితే తమను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించి ప్రచారం చేయడం మంత్రి కొల్లు రవీంద్ర దిగజారుడుతనానికి నిదర్శనమని ఎస్‌ఎస్ గొల్లపాలెం గ్రామ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి చర్యలను వారు ఖండించారు. ఈ నెల 2వ తేదీ ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర సీతారామపురం గ్రామంలో పర్యటించారని, ఆ సమయంలో గ్రామంలోని టీడీపీ నాయకుడు మట్టా బాలశ్రీనివాసరావు ఇంటి వద్ద మంత్రి కాసేపు ఆగారని తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు వెళితే మాపై టీడీపీ కండువాలు కప్పి మరుసటి రోజు మేమంతా పార్టీ మారినట్లు ప్రకటించారని వాపోయారు.
మానసిక వికలాంగురాలైన తన భార్య వైద్యం ఖర్చులకు ప్రభుత్వం నుంచి సాయమందించాలని కోరేందుకు వెళితే సమస్య వినకుండానే టీడీపీ కండువా వేశారని వైఎస్సార్ సీపీ కార్యకర్త కనపర్తి వీరాంజనేయులు తెలిపారు. కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరైనా బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని, ఈ సమస్య పరిష్కారం కోరుతూ వెళితే మా చేతికి టీడీపీ జెండాలు ఇచ్చి నిలబెట్టారని గణేషన శ్రీనివాసరావు, కనపర్తి నారాయణ, కనపర్తి లీలాకృష్ణ తెలిపారు. కాలువలకు నీరు సమృద్ధిగా విడుదల చేసి భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకోవాలని విన్నవించేందుకు వెళితే తమపైనా టీడీపీ కండువాలు కప్పారని తిరుమలశెట్టి శేషగిరిరావు వాపోయారు.
ఇదిలా ఉంటే రోడ్డుపై మంత్రి కారు నిలపడంతో తన ట్రాక్టర్ వెళ్లే దారి లేదని, ఈ నేపథ్యంలో ట్రాక్టర్ ఆపి రోడ్డుపై నిలబడిన తమపై టీడీపీ కండువాలు కప్పారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మానేపల్లి రామాంజనేయులు, మట్టా సుబ్బారావు, మట్టా వెంకటరంగప్రసాద్, కొండయ్య, రామమోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా వీధి కుళాయి ఏర్పాటు చేయాలని వచ్చిన ఏడుగురు మహిళలపైనా టీడీపీ కండువాలు వేసి వాళ్లంతా పార్టీ మారినట్లు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మట్టా మోహననాంచారయ్య, మాజీ సర్పంచ్ చోరగూడి రామచంద్రరావు, వైఎస్సార్ సీపీ నాయకులు గణేషన వెంకటేశ్వరరావు, గణేషన రమేష్, బోలెం అర్జునరావు పాల్గొన్నారు.