భక్తులకు అసౌకర్యం కలగకూడదు
మచిలీపట్నం (చిలకలపూడి) : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత ఏడాది 1.5 లక్షల మంది భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారని చెప్పారు. ఈ ఏడాది రెండు లక్షల మందికి పైగా భక్తులు సముద్రస్నానాలు చేసే అవకాశం ఉందన్నారు. కార్తీకపౌర్ణమి విశిష్టత తెలిపేలా మంగినపూడి బీచ్‌లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులతో పోలీసులు మర్యాదతో మెలగాలని సూచించారు. మహిళా పోలీసులను బందోబస్తులో వినియోగించాలని చెప్పారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజు సాగరహారతి, అమృత పాసుపతాస్త్రం, అనంతరం శివలింగాభిషేకం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు సాగర హారతితో పాటు బాణసంచా కాల్చటం ఉంటుందని వివరించారు. సమావేశంలో ఆర్డీవో పి.సాయిబాబు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఎంపీడీవో సూర్యనారాయణ, తహసీల్దార్ నారదముని తదితరులు పాల్గొన్నారు.