ఓటేరు చెరువు భూ కుంభకోణంలో అక్రమార్కులకు క్లీన్‌చిట్
17.18 ఎకరాలు ఓటేరు చెరువు శిఖం కాదని తేల్చిన విచారణాధికారి
రెవెన్యూ రికార్డులు తప్పులతడకేనని చెప్పకనే చెప్పిన వైనం
కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు నివేదిక సమర్పించిన డీఆర్వో శేషయ్య
నేడోరేపో తుది నిర్ణయం జారీ
ఓటేరు చెరువు భూకుంభకోణం మరో మలుపు తిరిగింది. ఆ కుంభకోణంపై విచారణ చేస్తున్న డీఆర్వో శేషయ్య అక్రమార్కులకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలోని సర్వే నెంబరు 377లో 17.18 ఎకరాల భూమి ఓటేరు చెరువు శిఖం కాదని తేల్చారు. ఈ మేరకు అక్రమాలకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ సర్వే నెంబరు పరిధిలోని భూమి చెరువు శిఖం అని పేర్కొన్న రెవెన్యూ రికార్డులన్నీ తప్పుడువని చెప్పకనే చెప్పారు. ఈ నివేదికపై నేడో రేపో కలెక్టర్ నిర్ణయం తీసుకోనున్నారని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.
తిరుపతి : రెవెన్యూ చట్టంలో లొసుగులను అస్త్రంగా చేసుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పరిధిలో సర్వే నెంబరు 377లో 17.18 ఎకరాల ఓటేరు చెరువు శిఖం భూమిని కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. ఎప్పటికప్పుడు పార్టీలు మార్చే ఆ మాజీ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఆయన పంచన చేరి ఆ భూమికి పట్టాదారు పాసుస్తకాలు ఇచ్చేలా రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్.మీనాతో ఉత్తర్వులు జారీచేయించుకున్నారు. ఎన్నికలకు ముందు సైకిలెక్కి చంద్రబాబుతో జతకట్టి కిరణ్ సర్కారు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయించుకున్నారు. రెవెన్యూ అధికారులకు నోట్ల కట్టలు వెదజల్లి.. సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి రూ.350 కోట్ల విలువైన 17.18 ఎకరాల చెరువు శిఖం భూమిని బినామీల ద్వారా ఆ మాజీ ఎమ్మెల్యే సొంతం చేసుకోవడంపై జూలై 16న ఁభూదోపిడీ*.. జూలై 17న ఁఆంతర్యమేమిటి రామచంద్రా..?* అంటూ వరుస కథనాల ద్వారా ఁసాక్షి* వెలికితీసింది. ఈ కుంభకోణంపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన కలెక్టర్.. ఓటేరు చెరువు భూకుంభకోణంపై డీఆర్వో శేషయ్యను విచారణకు ఆదేశించారు.
తిమ్మిని బమ్మిని చేసి..
రెవెన్యూశాఖకు ఏ-రిజిష్టరే ప్రామాణికం. బ్రిటీషు ప్రభుత్వం హయాంలో 1886లో తొలిసారి భూములను సర్వే చేసి ఏ-రిజిష్టర్ రూపొందించారు. 1886 ఏ-రిజిష్టర్ ప్రకారం తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పరిధిలోని 377 సర్వే నెంబరులో 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం. బ్రిటీషు ప్రభుత్వం 1916లో మరోసారి భూములను సర్వే చేసింది. ఆ సర్వే చేసినప్పుడు ఆ భూమిని ప్రభుత్వ బంజరుగా తప్పుగా పేర్కొనడాన్ని పసిగట్టిన అప్పటి చంద్రగిరి సబ్ కలెక్టర్ రీ-సర్వే చేసి 1925లో చెరువు శిఖంగానే తేల్చి ఏ-రిజిష్టర్‌లో పొందుపరిచారు. ఇందుకు సంబధించిన రికార్డులు ఇప్పటికీ తిరుపతి రూరల్ తహశీల్దార్, తిరుపతి ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో పదిలంగా ఉన్నాయి. ఈ చెరువు భూ వివాదంపై పలు కోర్టుల్లో రెవెన్యూ అధికారులు అఫిడవిట్‌లు దాఖలు చేసేటప్పుడు ఆ భూమిని చెరువు శిఖంగానే పేర్కొన్నారు. ఇదే భూవివాదంపై ఫిబ్రవరి 12న అప్పటి కలెక్టర్ రాంగోపాల్ పంపిన నివేదికపై రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా స్పందిస్తూ.. ఁభూమి రికార్డులకు తక్కిన రికార్డులకన్నా ఏ-రిజిష్టరే ప్రామాణికం. ఏ-రిజిష్టర్‌లో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేయండి* అని ఆదేశిస్తూ మే 22న ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. మే 22 బీఆర్.మీనా జారీచేసిన ఉత్తర్వులను రెవెన్యూ అధికారులు వక్రీకరించారు. 1886, 1925 ఏ-రికార్డులను ప్రామాణికంగా తీసుకోని రెవెన్యూ అధికారులు.. 1916 రికార్డులనే ప్రామాణికంగా తీసుకుని సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం కాదని తేల్చారు. ఆ భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలకు కట్టబెట్టారు.
ఇదేంటి శేషయ్యా..?
ఓటేరు భూకుంభకోణంపై కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టు డీఆర్వో శేషయ్య విచారణ చేశారు. విచారణలో 1886, 1925 ఏ-రికార్డులను శేషయ్య ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కన్పించలేదు. కేవలం 1916 రికార్డులనే పరిగణనలోకి తీసుకున్న శేషయ్య.. సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం కాదని.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బినామీలకే చెందుతుందని తేల్చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులకు ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను జారీచేయడంలో కూడా తప్పులేదని తేల్చారు. ఆ మేరకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు నివేదిక కూడా ఇచ్చేశారు. శేషయ్య ఆ మేరకు నివేదిక ఇవ్వడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. సీఎంవో కార్యాలయం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తెప్పించి.. శేషయ్యతో తప్పుడు నివేదికను కలెక్టర్‌కు ఇప్పించారనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. శేషయ్య నివేదికపై కలెక్టర్ ఆమోదముద్ర వేయడమే తరవాయి.. రూ.350 కోట్ల విలువైన భూమి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సొంతమవుతుందన్న మాట.
కలెక్టర్‌కు నివేదిక ఇచ్చా : డీఆర్వో శేషయ్య
తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలోని సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం కాదు. ఆ భూమి డి.వెంకట్రామనాయుడు తదితరులకు చెందినదే. ఆ మేరకు వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు* అని డీఆర్వో శేషయ్య ఁసాక్షి*కి చెప్పారు. 1886, 1925 సర్వేల మేరకు ఏ-రికార్డుల్లో అది చెరువు శిఖం భూమి అని స్పష్టంగా పేర్కొన్నారు కదా అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. నివేదికను కలెక్టర్‌కు ఇచ్చానని.. తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనేని సెలవిచ్చారు.
రూ.350 కోట్ల భూమి.. అక్రమార్కుల పరం!
Published Wed, Aug 13 2014 1:45 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement