
విజయనగరం టౌన్: ఇటీవల గంట్యాడ పోలీసులకు గంజాయి రవా ణాలో పట్టుబడ్డ వారంతా కొత్తవారేనని, వారి నుంచి రూ.15లక్షల విలువైన 21 బ్యాగులతో 792.865కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జి.పాలరాజు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. గంట్యాడ పోలీసులకు అందిన కీలకమైన సమాచారంతో రంగంలోకి దిగిన గంట్యాడ ఎస్‌ఐ నారాయణరావు సిబ్బందితో కలసి ఈ నెల 5న కొటారుబిల్లి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బొడ్డవర వైపు నుంచి నాలుగు వాహనాలు వచ్చినట్టు చెప్పారు. పోలీసులను చూసి వాహనాలు వేరే దారిలో వెళ్లేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని తహసీల్దార్ సమక్షంలో తనిఖీలు చేసినట్టు తెలిపారు. నాలుగు వాహనాల నుంచి మొత్తంగా 792.865 కిలోల గంజాయి లభ్యమైనట్టు చెప్పారు. దీంతో నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
అరెస్టు చేసింది వీరినే...
నాలుగు వాహనాల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డ వారిలో అంతా కొత్తవారేనని ఎస్పీ పాలరాజు చెప్పారు. ఇప్పటి వరకు వీరిపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారిలో... వైద్రం శర్మ (రాజస్తాన్) ఎ1గా, ఆజాద్(ఉత్తరప్రదేశ్) ఎ2గా, వీరేంద్రసింగ్ (హర్యానా) ఎ3గా, సత్యమెహర్ (ఒడిశా) ఎ4గా, శాంతన్‌కార్ శాస్త్రి (ఒడిశా) ఎ5గా, ఈశ్వర్ బదనాయక్ (కోరాపుట్ జిల్లా, ఒడిశా) ఎ6గా, పొడుగు బాలాజీ(కోరాపుట్) ఎ7గా, ప్రదీప్‌కుమార్ కాముడు (కోరాపుట్) ఎ8గా, సుదర్శన్ ప్రాణిగ్రాహీ(కోరాపుట్) ఎ9గా ఉన్నారు. వీరితో పాటూ ఎ10గా నిరికి త్రినాథ్, ఎ11గా సేసా దినేష్‌లు (కోరాపుట్ జిల్లా) ఎ12గా, రాఘవ లియాస్ సుబేష్‌సింగ్ (హర్యానా) పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.
ఒడిశా నుంచి ఢిల్లీకి...
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయిని తరలించే క్రమంలో గంట్యాడ పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రవాణాదారులంతా రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వారే. కోరాపుట్‌కి చెందిన (ఎ10, 11) నిర్కిల్ త్రినాథ్, శేషా దినేష్‌లు ప్రధాన నిందితులైన వైద్రంశర్మ, అజాద్, వీరేంద్రసింగ్, రాఘవ(ఎ1, 2, 3, 12)ల నుంచి రూ.5.5 లక్షలు తీసుకుని గంజాయిని లమటాపూర్ బ్లాక్ కోరాపుట్ జిల్లా నుంచి సరఫరా చేసినట్లు గుర్తించారు.
వైద్రంశర్మ, రాఘవ (ఎ1, 12)లు ప్రధాన కొనుగోలుదారులు, అజాద్, వీరేందర్‌తో (ఎ2, 3)లతో కలిసి ఢిల్లీ నుంచి విశాఖ వరకూ విమానంలో వచ్చి, టాటా ఐచ్చర్ వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. వీరంతా ఆ వాహనంలో కోరాపుట్ వెళ్లి నిర్కిల్ త్రినాథ్, శేషా దినేష్‌లను కలిసి గంజాయిని స్థానికుల నుంచి సేకరించి, వాహనంలోకి లోడ్ చేశారని, ఒడిశా నుంచి ఇచ్ఛాపురం వరకూ వెళ్లేందుకు రక్షణగా మనుషులను సమకూర్చుకున్నట్టు తెలిపారు. వీరు ప్రయాణించేందుకు మరో మూడు వాహనాలను అద్దెకు తీసుకున్నారని, వీరంతా బొడ్డవర వైపు నుంచి వస్తూ గంట్యాడ మండలం కొటారుబిల్లి వద్ద పోలీసులకు పట్టుబడినట్టు చెప్పారు.
పోలీసులకు రివార్డులు
కేసులో కీలక సమాచారం సేకరించి, ముద్దాయిలను, గంజాయి వాహనాలను స్వాధీన పరుచుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన గంట్యాడ ఎస్‌ఐ పి.నారాయణరావు, హెచ్‌సీలు టివి.రమణ, రామకృష్ణ, కానిస్టేబుళ్లు సత్తిబాబు, శ్రీనివాసరావు, పి.రమణ, కె.శ్రీనివాసరావు, ఎమ్.ఈశ్వరరావులకు ఎస్పీ అభినందించి, క్యాష్ రివార్డులను అందజేశారు. ఆయన వెంట జిల్లా అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, డీఎస్పీ ఎవి.రమణ, రూరస్ సీఐ దాసరి లక్ష్మణరావు పాల్గొన్నారు.