మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవల బస్సు దగ్ధమైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సులపై కొరడ ఝుళిపిస్తున్నారు. అందులోభాగంగా నగరంలోని ఎల్బీనగర్లో ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 11 బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారి ప్రసాద్ వెల్లడించారు. పర్మిట్, ఫిట్నెస్లు లేకుండా ఆ బస్సులు నడుపుతున్నారని ఆయన తెలిపారు. కల్యాణి, ఎస్వీఆర్, కావేరి, అజంత, మేఘన, అంజన, కాలేశ్వరి, మూన్‌లైట్, శ్రీ ట్రావెల్స్ సీజ్ చేసిన ట్రావెల్స్లో ఉన్నాయని ఆయన వివరించారు.
అలాగే శంషాబాద్ సమీపంలోని షాపూర్ వద్ద 8 బస్సులను కూడా అధికారులు సీజ్ చేశారు. గత గురువారం నుంచి రాష్ట్రంలో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు 376 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో ఈ రోజు నిర్వహించిన ఆర్టీఏ దాడుల్లో ఆరు బస్సులను సీజ్ చేశారు. గత ఐదురోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 33 బస్సులను సీజ్ చేసినట్లు జిల్లా రవాణాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
గత బుధవారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ఆ ఘటనతో మొద్దు నిద్రలో ఉన్న రవాణ శాఖ ఒక్కసారిగా ఉలికిపాటికి గురైంది. దాంతో రాష్ట్రంలోని ప్రైవేట్ ట్రావెల్స్పై కొరడా ఝుళిపించింది.