
నష్టాల నుంచి లాభాల బాట
- త్వరలో 40 కొత్త బస్సుల రాక
- నెలలో ఒకరోజు సిబ్బంది స్వచ్ఛంద సేవలు
- ఆర్టీసీ ఆర్‌ఎం సుధీష్‌బాబు
సాక్షి, విశాఖపట్నం : ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు ఏళ్ల తరబడి నష్టాలే తప్ప లాభం తెలియదు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు కానరాలేదు. ఏటేటా నష్టాలు పెరుగుతూ వచ్చాయి. అలా ఆ నష్టాలు ఏడాది క్రితం వరకు రూ.12.31 కోట్లకు చేరుకున్నాయి. అయితే పరిస్థితిలో ఇప్పుడు మార్పు వచ్చింది. ఏడాది కాలంగా నష్టాలను అధిగమిస్తూ వస్తోంది. దీంతో జూన్ నాటికి రూ.4.55 లక్షల లాభాన్ని ఆర్జించగలిగింది. ఇదే ఇప్పుడు విశాఖ రీజియన్‌లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మిక వర్గాల్లో ఆనందం నింపుతోంది. ప్రయాణికులతో మరింత సఖ్యతగా మెలగడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెంచడం, ఒకదాని వెనక ఒకటిగా బస్సులు వెళ్లకుండా చూడడం, బస్సులు సమయపాలన పాటించడం తదితర అంశాలు రీజియన్ లాభాల బాట పట్టడానికి దోహదపడ్డాయి.
ఉదాహరణకు మే నెలలో 64 నుంచి 66కు పెరిగిన ఓఆర్, జూన్‌లో 72 నుంచి 76కు పెరిగింది. అంతే కాదు సంస్థ ఆదాయం పెంపునకు సిబ్బంది, కార్మికులు కూడా ‘పరిరక్షణ’ పేరిట తమ వంతు పాటుపడుతున్నారు. కొన్నాళ్ల నుంచి సిబ్బంది తమ సెలవు రోజుల్లోనూ నెలలో ఒకసారి ముఖ్యమైన బస్టాపులు, స్టేజిల్లో ఆటోలు, జీపులు, ఇతర ప్రయివేటు వాహనాల్లో ప్రయాణికులు వెళ్లకుండా నిలువరిస్తూ స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం నాలుగు గంటల చొప్పున వీరు అక్కడ ఈ బాధ్యతలు చేపడుతున్నారు. ఇలా జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 150 నుంచి 200 మంది వరకు ఇందులో పాలు పంచుకుంటున్నారు.
దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడం ద్వారా సంస్థ ఆదాయమూ పెరగడానికి దోహద పడుతున్నారు. పుష్కరాల సందర్భంగా ‘పరిరక్షణ’కు కాస్త విరామం ఇచ్చారు. వచ్చే వారం నుంచి మళ్లీ యధావిధిగా కార్మికులు స్వచ్ఛంద సేవలు కొనసాగిస్తారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.సుధీష్‌బాబు ‘సాక్షి’కి తెలిపారు. విశాఖ రీజియన్ లాభాల బాట పట్టడంలో కార్మికులు, సిబ్బంది కృషి ఉందన్నారు. పుష్కరాల సందర్భంగా రీజియన్‌కు రూ.11.44 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. జులై నెల పుష్కరాల ఆదాయంతో లాభం మరింత పెరుగుతుందన్నారు.
కొత్తగా 40 బస్సులు
విశాఖ రీజియన్‌కు త్వరలో 40 కొత్త బస్సులు రానున్నాయని ఆర్‌ఎం తెలిపారు. ఇందులో 30 మెట్రో బస్సులు, మరో 10 సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయన్నారు. వీటిని ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్లలో నడుపుతామన్నారు. గత ఏప్రిల్ నుంచి రాజమండ్రికి 4, కాకినాడకు 4, శ్రీకాకుళానికి 4, విజయనగరానికి 5 చొప్పున 15 మెట్రో ఏసీ బస్సులను తిప్పుతున్నామని చెప్పారు. వీటిలో కాకినాడ మినహా మిగిలిన సర్వీసుల ఆదాయం ఆశాజనకంగా ఉందని తెలిపారు.
విభజన తర్వాత సర్వీసులు విస్తృతం
రాష్ట్ర విభజన తర్వాత విశాఖ నుంచి రాష్ట్రంలోని వివిధ దూరప్రాంతాలకు బస్సు సర్వీసులను పెంచామని ఆర్‌ఎం తెలిపారు. కర్నూలుకు 2, కడపకు 2, ప్రొద్దుటూరు 2 సర్వీసుల చొప్పున సూపర్ లగ్జరీ సర్వీసులను నడుపుతున్నామన్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను నిలువరించి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చర్యలు చేపడ్తున్నట్టు రీజనల్ మేనేజర్ సుధీష్‌బాబు వివరించారు.