సాక్షి, కడప : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జిల్లాలోని ఎనిమిది డిపోల్లో తొలి రోజు బుధవారం బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీ కులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా 956 బస్సులు ఉండగా, అందులో 880కి పైగా బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు మిగిలిన అరకొర బస్సులను నడిపినా అవి ప్రయాణికులందరికి ఏ మాత్రం సరిపోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణీకులు దొరికిన వాహనాన్ని పట్టుకుని అతి కష్టంగా గమ్యస్థానాలు చేరుకున్నారు.
మరికొందరు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రైవేటు వాహన యాజమాన్యాలు దోపిడీకి తెర తీశాయి. చాలా రూట్లలో రెండింతలు చార్జీలు వసూలు చేశారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల ప్రాంతంలో మరీ ఎక్కువ చార్జీలు వసూలు చేశారు. కొన్ని వాహనాల్లో కడప నుంచి పులివెందులకు రూ.100 వసూలు చేశారు. మధ్యలో ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా ఇదే చార్జీ దండుకున్నారు.
రవాణా శాఖ అధికారులు, పోలీసులు చోద్యం చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న తమకు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని వారు తేల్చి చెబుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ గ్యారేజీలకే పరిమితమయ్యాయి. లక్షలాది మంది ప్రయాణీకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.
సమ్మెలో 4558 మంది కార్మికులు
జిల్లాలో ఆర్టీసీ ఎంప్లాయిస్, నేషనల్ మజ్దూర్‌తోపాటు మిగతా యూనియన్లకు సంబంధించి 4558 మంది కార్మికులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఆగిపోయాయి. బుధవారం ఉదయం కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కార్మికుల సమ్మెతో ఒక్క రోజే రూ.90 లక్షల నష్టం వాటిల్లింది. కాగా, కడప నుంచి హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల నుంచి ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు చార్జీలు పెంచి వసూలు చేస్తున్నాయి. రైళ్లు కి క్కిరిశాయి. బోగీల్లో ప్రయాణికులు నిలుచుని ప్రయాణించారు.
ఎక్కడి బస్సులక్కడే
Published Thu, May 7 2015 3:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement