Transportation officials
-
242 హెల్మెట్ కేసులు నమోదు
మర్రిపాలెం(విశాఖ) : హెల్మెట్ ధరించని 242 మంది వాహనదారులపై రవాణా అధికారులు కేసులు నమోదు చేశారు. ఆదివారం నుంచి హెల్మెట్ ధారణ నిబంధన అమలులోకి రావడంతో రవాణా అధికారులు తనిఖీలు ప్రారంభించారు. సిరిపురం జంక్షన్లో డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్టీవో ఎ.హెచ్.ఖాన్ స్వయంగా తనిఖీలలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారికి అపరాధ రుసుం విధించారు. మరోసారి పట్టుబడటంతో వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. తొలిసారి పట్టుబడ్డ కేసు వివరాలు అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొందరు హెల్మెట్లను తనిఖీ చేశారు. ఐఎస్ఐ మార్కు కలిగిన వారిని విడిచిపెట్టారు. నాసిరకం హెల్మెట్ ధరించి పట్టుబడ్డవారికి జాగ్రత్తలు సూచించారు. ధృడమైన, నాణ్యత గల హెల్మెట్ ధరించడంతో రక్షణ ఉంటుందని అలా కాని వాటిని ధరించినా ప్రయోజనం లేదని అవగాహన కల్పించారు. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో దాడులు ఆశించిన స్థాయిలో జరగలేదు. సోమవారం నుంచి దాడులు మరింత విస్తృతం చేయనున్నట్టు డీటీసీ తెలిపారు. -
ఇంకాస్త టైముంది
♦ హెల్మెట్‌పై మొదటి రోజు స్పందన శూన్యం ♦ ఈనెల 4 తరువాత వాహనంతోపాటు హెల్మెట్ కొనాల్సిందే ♦ అంతకుముందు కొన్న వాహనాలకు సడలింపు సాక్షి, సిటీబ్యూరో : ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన మొదటి రోజే తుస్సుమంది. నగరంలోనే ఏ ఆర్టీఏ కార్యాలయంలోనూ ఈ నిబంధన అమలు కాలేదు. హెల్మెట్ లేకపోయినప్పటికీ రవాణా అధికారులు వాహనాలను రిజిస్ట్రేషన్లు చేశారు. నిబంధన అమల్లోకి వచ్చిన రోజు కంటే ముందే వాహనాలు కొనుగోలు చేసి ఉండడంతో అధికారులు సడలింపునిచ్చారు. మరోవైపు హెల్మెట్‌పై వాహనదారుల్లో మొదట విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, ఆ తరువాత క్రమంగా తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. నిబంధన అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 4 నుంచి కొనుగోలు చేసే వాహనాలకు తప్పనిసరిగా వాహనాల ఇన్వాయిస్తో పాటు హెల్మెట్ బిల్లు కూడా ఉండాల్సిందేనన్నారు. గ్రేటర్‌లోని ఖైరతాబాద్, మెహదీపట్నం, బహదూర్‌పురా, సికింద్రాబాద్, మలక్‌పేట్, ఉప్పల్, అత్తాపూర్,మేడ్చెల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి,తదితర కార్యాలయాల్లో ప్రతి రోజూ వెయ్యికి పైగా ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. కొనుగోలు చేసిన తరువాత నెల లోపు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకొనే వెసులుబాటు ఉండడంతో వాహనదారులు కొనుగోలు చేసిన రోజునే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ వద్దకు వెళ్లరు. చాలా మంది వాహనాలు కొనుగోలు చేసిన 15 రోజుల నుంచి 30 రోజుల మధ్య మంచి ముహూర్తం చూసుకొని రిజిస్ట్రేషన్ కోసం వస్తారు. అలా హెల్మెట్ నిబంధన అమల్లోకి వచ్చిన తేదీ కంటే ముందే కొనుగోలు చేసిన వాహనాలు కావడంతో ఆర్టీఏ అధికారులు హెల్మెట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. విస్తృత ప్రచారం మరోవైపు హెల్మెట్ అమలుపై మొదటి దశలో విస్తృతమైన ప్రచారం చేపట్టేందుకు హైదరాబాద్ ఆర్టీఏ సన్నాహాలు చేపట్టింది. నగరంలోని అన్ని షోరూమ్‌లలో బ్యానర్లు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు జేటీసీ రఘునాథ్ చెప్పారు. నగరంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. -
ఇక ఇళ్ల వద్దే..
విశాఖపట్నం (మర్రిపాలెం ) : ఆయా పన్నులు చెల్లించని వాహనదారులపై కొరడా రుళిపించడానికి రవాణా అధికారులు సిద్ధమయ్యారు. గతంలో రోడ్లపై తనిఖీల సమయంలో పట్టుబడినప్పుడు వాహనాలు సీజ్ చేసేవారు. ఇప్పుడు నేరుగా ఇళ్లకు వెళ్లి వాహనాలు అదుపులోకి తీసుకుంటున్నారు. దీనివల్ల రవాణా శాఖకు ఆదాయం సమకూరగా, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రవాణా వాహనాలుగా లారీలు, జీపులు, మ్యాక్సీ క్యాబ్‌లు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు ప్రతీ మూడు నెలలకు త్రైమాసిక పన్నులు చెల్లించాలి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేల వాహనాలు పన్నులు చెల్లించడం లేదని రవాణా అధికారులు గ్రహించారు. ఇక నుంచి ప్రతీ 2, 3 మండలాలకు ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేయడానికి డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు నిర్ణయించారు. టీమ్‌లు వాహన యజమాని చిరునామా ఆధారంగా వెళ్లి వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ బకాయిల చెల్లింపులు పూర్తి అయ్యేవరకూ కొనసాగిస్తారు. ఆయా వాహనాల బకాయిల వివరాలు రవాణా శాఖ కార్యాలయాలు, మీ-సేవల్లో తెలుసుకోవచ్చని డీటీసీ సూచించారు. యజమానులు స్వయంగా పన్నులు చెల్లిస్తే ఎటువంటి అపరాధ రుసుం ఉండదని, తనిఖీలలో పట్టుబడితే ప్రతీ రూ.100లకు రూ. 200 ఫెనాల్టీ కట్టాలని స్పష్టం చేశారు. ఒకవేళ వాహనం వినియోగించని పక్షంలో కార్యాలయంలో దరఖాస్తు అందచేయాలన్నారు. కాలం చెల్లిన, పాత వాహనాలు తుక్కు విలువకు అమ్మితే వాహన రికార్డులు కార్యాలయంలో సమర్పించడంతో రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుందని తెలి పారు. అలా చేయని పక్షంలో ఆయా పన్నులు యజమాని చెల్లించాలన్నా రు. ట్రాక్టర్ తొట్టికి పన్ను చెల్లించి సహకరించాలని కోరారు. ఇంకా తని ఖీల్లో ఫిట్నెస్ లేదా పర్మిట్ లేకుంటే రూ.5 వేలు, పొల్యూషన్, డ్రైవింగ్ లెసైన్స్ లేకున్నచో రూ.2 వేలు వసూలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు గురువారం జరిపిన దాడుల్లో 74 వాహనాలు సీజ్ చేశారు. -
ఎక్కడి బస్సులక్కడే
సాక్షి, కడప : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జిల్లాలోని ఎనిమిది డిపోల్లో తొలి రోజు బుధవారం బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీ కులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా 956 బస్సులు ఉండగా, అందులో 880కి పైగా బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు మిగిలిన అరకొర బస్సులను నడిపినా అవి ప్రయాణికులందరికి ఏ మాత్రం సరిపోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణీకులు దొరికిన వాహనాన్ని పట్టుకుని అతి కష్టంగా గమ్యస్థానాలు చేరుకున్నారు. మరికొందరు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రైవేటు వాహన యాజమాన్యాలు దోపిడీకి తెర తీశాయి. చాలా రూట్లలో రెండింతలు చార్జీలు వసూలు చేశారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల ప్రాంతంలో మరీ ఎక్కువ చార్జీలు వసూలు చేశారు. కొన్ని వాహనాల్లో కడప నుంచి పులివెందులకు రూ.100 వసూలు చేశారు. మధ్యలో ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా ఇదే చార్జీ దండుకున్నారు. రవాణా శాఖ అధికారులు, పోలీసులు చోద్యం చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న తమకు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని వారు తేల్చి చెబుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ గ్యారేజీలకే పరిమితమయ్యాయి. లక్షలాది మంది ప్రయాణీకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. సమ్మెలో 4558 మంది కార్మికులు జిల్లాలో ఆర్టీసీ ఎంప్లాయిస్, నేషనల్ మజ్దూర్తోపాటు మిగతా యూనియన్లకు సంబంధించి 4558 మంది కార్మికులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఆగిపోయాయి. బుధవారం ఉదయం కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కార్మికుల సమ్మెతో ఒక్క రోజే రూ.90 లక్షల నష్టం వాటిల్లింది. కాగా, కడప నుంచి హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల నుంచి ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు చార్జీలు పెంచి వసూలు చేస్తున్నాయి. రైళ్లు కి క్కిరిశాయి. బోగీల్లో ప్రయాణికులు నిలుచుని ప్రయాణించారు.