బాలయ్య 'బస్సులు' ఫ్లాప్
అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ప్రయాణికుల బాధలు వర్ణాణాతీతం. శనివారం ఏపీ 28 జెడ్ 5181 నంబరు గల పల్లె వెలుగు బస్సు లేపాక్షి సమీపంలోని నవోదయ విద్యాలయం వద్ద ఆగిపోయింది. చెక్పోస్టు నుంచి హిందూపురానికి వస్తున్న ఈ బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో ఆ బస్సు విద్యార్థులు లేపాక్షి దాకా తోసుకువచ్చారు.
అక్కడ నుంచి కదిలేందుకు ఆ బస్సు మొరాయించింది. దీంతో విద్యార్థులు మరో బస్సు వచ్చేదాకా వేచి ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా 15 రోజుల కిందట కల్లూరు గ్రామంలో దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు జెడ్పీ ఛైర్మన్ చమన్ విచ్చేశారు. రాత్రి 10 గంటల సమయంలో హిందూపురం నుంచి కొండూరుకు వేళ్లే ఆర్టీసీ సర్వీసు దర్గా వద్ద ఆగిపోయింది. జెడ్పీ ఛైర్మన్ అంతకుముందే పూజలు నిర్వహించి వెళ్లారు. చమన్ వెళ్లే సమయంలోనే బస్సు ఆగిపోయి ఉంటే ప్రజలు రాత్రివేళ బస్సును తోస్తూ పడే బాధలను ఆయన ప్రత్యక్షంగా చూసేవారని స్థానికులు తెలిపారు. రెండు రోజుల కిందట కూడా నాయనిపల్లి క్రాస్ హిందూపురం నుంచి కొడికొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆర్టీసీ వారు కాలం చెల్లిన బస్సులు నడపడం వల్లే ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హిందూపురం ఆర్టీసీ డిపోకు కొత్త పల్లె వెలుగు సర్వీసులు, సూపర్ లగ్జరీ బస్సులు అదనంగా వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులు కలరింగ్ ఇచ్చారు. వాస్తవంగా పల్లె వెలుగు సర్వీసులన్నీ కాలం చెల్లినవే. వాటికే రంగులు వేయించి కొత్తవంటూ బీరాలు పోతున్న విషయాన్ని ఏం మాయచేశారో అనే శీర్షికతో ఇటీవల సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. అయినా ఆర్టీసీ అధికారులు మాత్రం ఇంకా మార్పు రాలేదు. బాలయ్య ఈ నెల 14న తన నియోజకవర్గమైన హిందూపురంలో 14 కొత్త ఆర్టీసు బస్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.