అర్ధరాత్రి నుంచి పెరిగిన ఆర్టీసీ చార్జీలు | RTC charges increased from midnight | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నుంచి పెరిగిన ఆర్టీసీ చార్జీలు

Published Sat, Oct 24 2015 1:33 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM

అర్ధరాత్రి నుంచి పెరిగిన ఆర్టీసీ చార్జీలు - Sakshi

అర్ధరాత్రి నుంచి పెరిగిన ఆర్టీసీ చార్జీలు

అనుకున్నట్టే జరిగింది...ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు గత నెల మూడో వారం లో గుంటూరు సందర్శన  సందర్భంగా చేసిన వ్యాఖ్యలో దొర్లిన సంకేతాలు నిజమయ్యాయి. ఆర్టీసీ చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. చార్జీలను 10 శాతం పెంచుతూ వచ్చిన ఉత్తర్వులతో రాష్ట్ర ప్రజలపై రూ.500 కోట్ల భారం పడనుంది. ఆర్టీసీ ప్రస్తుతం రూ.600 కోట్ల నష్టాల్లో ఉందని, గత మే నెలలో కొంత ఆదాయం వచ్చినా, ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంటుతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు గత నెలలో వెల్లడించారు. 

ఆటోలకు కి.మీకు రూ.10-11 చెల్లిస్తున్నారని, ఆర్టీసీ బస్సులకు కేవలం 59 పైసలే వసూలు చేస్తున్నామని కూడా అన్నారు.  ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని రాజధాని శంకుస్థాపన అయిన మరుసటిరోజే ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. పల్లెవెలుగు బస్సులకు కిలోమీటరుకు 3 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు 8 పైసలు, సూపర్ లగ్జరీ, గరుడ, వెన్నెల బస్సులకు 9 పైసలు చొప్పున పెంచుతూ ఉత్తర్వులు జారీఅయ్యాయి.

పెరిగిన ధరల ప్రకారం ఇకపై గుంటూరు -తెనాలికి పల్లెవెలుగు బస్సుకు రూపాయి చొప్పున పెరగనుంది. అంటే రూ.17 ఛార్జీ ఇకపై రూ.18 కానుంది. నాన్‌స్టాప్‌కు రూ.23 ఉంటే ఇకపై రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. విజయవాడ-తెనాలి మధ్య పల్లెవెలుగుకు రూ.27 నుంచి రూ.28, నాన్‌స్టాప్‌కు కి.మీ రూ.2 చొప్పున రూ.32 నుంచి రూ.34 వసూలు చేస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డీలక్స్ బస్సుకు రూ.240 నుంచి రూ.264, సూపర్ లగ్జరీకి రూ.283 నుంచి రూ.303 వరకు ఛార్జీలు పెరిగాయి. వాస్తవానికి శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చినా, సాంకేతిక కారణాలతో రాత్రి 10 గంటల వరకు దీనిపై కచ్చితమైన ధరల నిర్ణయం చేయలేదని చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement