సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) చార్జీలను గత నాలుగేళ్లుగా పెంచలేదని, ఏడాదికి 7.5 శాతం చొప్పున మొత్తం 30 శాతం మేర చార్జీలు పెంచేందుకు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు పంపిస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ఎన్వీ సురేంద్రబాబు చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడ ఆర్టీసీ హౌజ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తక్షణ అవసరం కింద రూ.3,717.95 కోట్లను ప్రభుత్వం 2019–20 బడ్జెట్‌లో చేర్చి, సాయమందిస్తే తప్ప ఆర్టీసీ అప్పులు, నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏడాదికి రూ.650 కోట్ల నష్టాన్ని ఆర్టీసీ భరించాల్సి వస్తోందన్నారు. 2015–16లో సంస్థకు రూ.735 కోట్లు నష్టం రాగా, 2016–17లో ఈ నష్టం రూ.789 కోట్లకు చేరిందన్నారు. 2017–18లో రూ.1,209 కోట్ల మేర ఆర్టీసీ నష్టపోయిందని వివరించారు.
ప్రతి కిలోమీటర్‌కు రూ.6.53 నష్టం
ఆర్టీసీకి బ్యాంకు అప్పులు, ఇతరత్రా బకాయిలన్నీ కలిపి రూ.6,445 కోట్ల మేర ఉన్నాయని సురేంద్రబాబు వెల్లడించారు. పల్లెవెలుగు బస్సుల వల్ల రూ.1,409 కోట్ల నష్టం వస్తోందన్నారు. కాలం చెల్లిన బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నడపబోమని, 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నింటినీ మార్చాలంటే మొత్తం 1,666 కొత్త బస్సులు అవసరమవుతాయని తెలిపారు. ఇందుకు రూ.666 కోట్లు కావాలన్నారు. బస్సును నడిపితే కిలోమీటర్‌కు రూ.6.53 చొప్పున నష్టం వస్తోందని అన్నారు. మోటార్ వెహికల్(ఎంవీ) ట్యాక్స్‌ల రూపంలో ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,409 కోట్లు చెల్లిస్తోందని వివరించారు.
పొదుపు చర్యలతో ఆదాయం పెంచాం..
2018–19లో ఆర్టీసీ 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) సాధించిందని సురేంద్రబాబు గుర్తుచేశారు. అంతర్గత పొదుపు చర్యల ద్వారా సంస్థ ఆదాయం పెంచామని చెప్పారు. 2018–19లో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ.554 కోట్ల సాయం అందిందని పేర్కొన్నారు. ఎంవీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, పల్లెవెలుగు బస్సుల వల్ల వచ్చే నష్టాలను ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆర్టీసీలో ఉద్యోగులను తొలగించడం లేదని, పదవీ విరమణ తర్వాత ఖాళీలను భర్తీ చేయకుండా.. ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులపై ప్రతిరోజూ వారితో చర్చలు జరుపుతామని అన్నారు. రాజకీయ పార్టీల్లాగా ఓటర్లు తమకు ఓటేయరేమోనన్న ఆలోచనలతో కార్మిక సంఘాలతో ప్రతి అంశాన్ని తాము చర్చించలేమని సురేంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం కోరిన మేరకే బస్సులు కేటాయిస్తున్నామని, ఇందుకు గాను ఆర్టీసీకి డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగినా కచ్చితంగా చెల్లిస్తారని చెప్పారు.
ఆర్టీసీ చార్జీలు 30 శాతం పెంచాల్సిందే..
Published Sat, May 11 2019 4:02 AM | Last Updated on Sat, May 11 2019 4:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment