నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్: ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని, లేకుంటే రెండు రోజుల్లో సమ్మె చేపడతామని ఏపీఎస్ ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్స్, కండక్టర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డి.సంజీవ్ హెచ్చరించారు. మంగళవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలోని న్యూ అంబేద్కర్ ప్రాంగణంలో కాంట్రాక్ట్ డ్రైవర్, కండక్టర్‌ల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సంజీవ్ హాజరై మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను క్రమబద్దీకరించే జీఓను వెంటనే విడుదల చేయకుంటే, 9వ తేదీ నుంచి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించుకుందన్నారు. గతేడాది జూలై 14న ఒప్పందం చేసుకొని, ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు. ఈ నెల 8 సాయంత్రంలోగా రెగ్యూలర్ చేయకుంటే 9వ తేదీ ఉదయం నుంచి ఆర్టీసీ కార్మికులు అందరు సమ్మెబాట పడతారని హెచ్చరించారు. రెగ్యులర్ కార్మికులకు మార్చి 2013తో వేతనసవరణ ముగిసిందని, ఇంతవరకు మధ్యంతర భృతి అమలు చేయలేదన్నారు. అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమస్యలు పరిష్కరించేదాక పోరాడుతామన్నారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు కాశీరాం, యూసుఫ్, శంకర్, శివ, అనిల్, శ్రీనివాస్, గోపాల్, సంతోష్, దయానంద్, రవి, మల్కవ్వ, రాములు, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులను రెగ్యులర్ చేయకుంటే సమ్మె!
Published Wed, Jan 8 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement