
వీరికి కష్టం.. వారికి నష్టం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖవంతం.. అన్న నినాదం ప్రచారానికే పరిమితమవుతోంది. కాలం చెల్లిన బస్సులు.. అరకొర సర్వీసులతో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. కండీషన్‌లో లేని బస్సుల వల్ల ప్రాణాలకు భద్రత లేకుండాపోతోంది. బస్టాండ్లు, కాంప్లెక్సుల్లో వసతుల కొరత, సమయానికి రాని బస్సులు, పలు రూట్లలో అందుబాటులో లేని సర్వీసులతో ప్రైవేట్ వాహనాలపై ఆధారపడక తప్పని పరిస్థితిని ఆర్టీసీయే కల్పిస్తోంది. జిల్లాలో శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, పాలకొండ, టెక్కలి, పలాస డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 462 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతిరోజూ సుమారు లక్షన్నర మంది ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కాగా సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో వారి సమస్యలు, ఆర్టీసీ పనితీరును తెలుసుకునేందుకు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ సమస్యలను ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ప్రయాణికులు, సిబ్బంది, అధికారులతో మాట్లాడి పలు సమస్యలు తెలుసుకున్నారు. వసతులను పరిశీలించారు. వివిధ వర్గాలతో ఆయన జరిపిన సంభాషణ యథాతథంగా..
స్టేషన్ మాస్టర్‌తో..
సత్యనారాయణ(డీసీటీఎం) : ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సరైన సౌకర్యాలు కల్పించారా?
బీఎల్‌పీరావు(స్టేషన్‌మాస్టర్): ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. కాంప్లెక్స్ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చేస్తున్నాం. కాంప్లెక్స్‌లోని దుకాణాల్లో వస్తువులు ఎంఆర్‌పీ రేట్లకే అమ్మేలా చర్యలు చేపడుతున్నాం.
డీసీటీఎం: కాంప్లెక్స్‌లో బిచ్చగాళ్ళు ఎక్కువయ్యారని, పందులు, పశువులు సంచరిస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?
స్టేషన్ మాస్టర్: బిచ్చగాళ్ళు లేకుండా చూస్తున్నాం. పందులు, పశువుల సంచారానికి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డీసీటీఎం: పచ్చదనంపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు?
స్టేషన్ మాస్టర్: ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పోర్టికోకు ఇరువైపులా మొక్కలు పెట్టాం. కాంప్లెక్స్ వెనుక మొక్కలు నాటాం. ఇటీవల తుపానుకు చాలా చెట్లు విరిగిపోయాయి. వీటి స్థానంలో కొత్త మొక్కలు నాటాం.
ప్రయాణికులతో..
డీసీటీఎం: ఆర్టీసీ బస్సులు సకాలంలో నడుస్తున్నాయా?
జి.చైతన్య(విద్యార్థి): కళాశాలకు వెళ్లేందుకు నేను ప్రతిరోజూ రణస్థలం నుంచి శ్రీకాకుళం వస్తుంటాను. సకాలంలో బస్సులు రావు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపితే బాగుంటుంది.
డీసీటీఎం: కాంప్లెక్స్‌లో మరుగుదొడ్ల పరిస్థితి ఏవిధంగా ఉంది?
టి.డి.రాజు(ప్రయాణికుడు): మరుగుదొడ్ల వసతి బాగానే ఉంది.
డీసీటీఎం: బస్సులు సకాలంలో నడుస్తున్నాయా? కండక్టర్, డ్రైవ ర్ల ప్రవర్తన ఎలా ఉంటోంది?
పలువురు ప్రయాణికులు: చాలా వరకు సకాలంలో నడుస్తున్నా. కొన్ని సందర్భాల్లో రెండు మూడు బస్సులు ఒకేసారి వస్తున్నాయి. తర్వాత చాలా సేపటి వరకు అసలు ఉండటం లేదు. కొందరు కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటోంది. చిల్లర విషయంలో, బస్సులు నిలిపే విషయంలో వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనిపై అధికారులు దృష్టి సారించాలి.
డీసీటీఎం: ఆర్టీసీ బస్సులు సౌకర్యవంతంగా ఉన్నాయా?
మరికొందరు ప్రయాణికులు: ప్రైవేటు వాహనాల కంటే కొంత నయం. అయితే ఆర్టీసీ బస్సు డిపోల నుంచి వచ్చేటపుడే బ్రేకులు, లైట్లు, టైర్లు వంటివి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
డీసీటీఎం: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. లాభాల బాట పట్టాలంటే ఏం చేయాలి?
ఈశ్వరరావు(ప్రయాణికుడు): లోపాలు ఎక్కడ ఉన్నాయో ముందు గుర్తించాలి. బస్సులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఆదాయం అధికంగా వచ్చే రూట్లను గుర్తించాలి. ఆయా రూట్లలో బస్సులు సకాలంలో నడిపితే ఫలితం బాగుంటుంది.
దుకాణదారులతో..
డీసీటీఎం: కాంప్లెక్స్‌లోని దుకాణాల్లో వస్తువులను ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి? మీ సమాధానం ఏంటి?
వి.జనార్ధన్(దుకాణదారుడు): వస్తువులను అధిక రేట్లకు విక్రయించడం లేదు. ధరల పట్టికను కూడా పెడుతున్నాం.
డీసీటీఎం: తినుబండారాలు, పళ్లు, రసాలపై ఈగలు, దోమలు వాలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
కుటుంబరావు(దుకాణదారుడు): నెట్‌లు, అద్దాలతో కూడిన అల్మరాల్లో తినబండారాలను పెడుతున్నాం.
సిబ్బందితో..
రిపోర్టర్: విచారణ కేంద్రం వద్ద ప్రయాణికులకు ఏవిధమైన సమాచారం ఇస్తున్నారు?
విష్ణుమూర్తి(విచారణ కేంద్ర ఉద్యోగి): ప్రయాణికులు అడిగే బస్సుల వివరాలు తెలుపుతాం. ఫోన్ ద్వారా కూడా బస్సుల వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. మా కేంద్రం ఫోన్ నెంబరు 08942-223188.
డీసీటీఎం: రూట్‌లో తిరిగేటపుడు ప్రయాణికుడు ఆపమన్నచోట ఆపడం లేదనే విమర్శ ఉంది? దీనిపై ఏం చెబుతారు?
పి.సిమ్మయ్య(డ్రైవర్): అదేం లేదు.. వారు ఆపమన్నచోటే ఆపుతున్నాం.
డీసీటీఎం: వికలాంగులు, వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిస్తున్నారా?
డ్రైవర్: చాలా సందర్భాల్లో ఇతర వ్యక్తులు కూర్చుంటున్నారు. దీనిపై ప్రయాణికుల్లో అవగాహన అవసరం.
డీసీటీఎం: ఏ రూట్‌లో విధులు నిర్వహిస్తున్నారు?
చిన్నబాబు(డ్రైవర్): బందరువానిపేట రూట్‌లో వెళుతున్నాను. ఈ రూట్‌లో సుమారు 15 బస్సుల వరకూ నడుస్తున్నాయి.
డీసీటీఎం: ఎంతకాలం నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు?
ఎం.రావు(డ్రైవర్): 29 ఏళ్లుగా పని చేస్తున్నాను. 18సార్లు బెస్ట్ డ్రైవర్‌గా అవార్డులు అందుకున్నాను. గ్యారేజీ నుంచి బస్సు బయటకు తీసేటపుడు కండిషన్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాం.
డీసీటీఎం: ప్రయాణికులకు రిజర్వేషన్ సౌకర్యం ఉందా?
మోహనరావు(ఓపీఆర్‌ఎస్): ఆర్టీసీలో ప్రయాణించే వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉంది. సుదూర ప్రయాణాలు చేసే వారు ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం.
శ్రీకాకుళం-1 డిపో మేనేజర్‌తో..
డీసీటీఎం: శ్రీకాకుళం ఒకటవ డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి?
ఎం.సన్యాసిరావు(డిపో డీఎం): మా డిపోలో 77 ఆర్టీసీ, 29 అద్దె బస్సులు ఉన్నాయి.
డీసీటీఎం: అత్యధిక ఆదాయం వచ్చే శ్రీకూర్మం రూట్‌లో బస్సులు తక్కువగా ఉన్నాయని ప్రయాణికుల నుంచి విమర్శ ఉంది. దీనిపై మీ సమాధానం ఏమిటి?
డిపో డీఎం: శ్రీకూర్మం రూట్‌లో బస్సులు అధికంగానే ఉన్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఇంకా రద్దీ ఉండి, అధిక ఆదాయం వస్తుందనుకుంటే అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం.
డీసీటీఎం: అనంతపురం దుర్ఘటన నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
డిపో డీఎం: ఆర్టీసీలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం.
ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేసేటపుడు
తీసుకోవలసిన జాగ్రత్త గురించి చెబు
తున్నాం.
డీసీటీఎం: మీ డిపో పరిధిలో ప్రమాదకర రూట్లు ఏమైనా ఉన్నాయా?
డిపో డీఎం: మా డిపో పరిధిలో కేదారిపురం రూట్ ఒక్కటే కొద్దిగా ప్రమాదకరం. ఈ రూట్‌లో ప్రస్తుతం రెండు బస్సులు తిరుగుతున్నాయి. అవగాహన, అనుభవం ఉన్న డ్రైవర్లను పంపుతున్నాం.