ఫస్ట్ ఎయిడ్ బాక్స్.. నిర్వహణ తుస్ | RTC management not care on first aid boxes | Sakshi
Sakshi News home page

ఫస్ట్ ఎయిడ్ బాక్స్.. నిర్వహణ తుస్

Published Thu, Aug 7 2014 2:44 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

RTC management not care on first aid boxes

శ్రీకాకుళం అర్బన్:  ప్రయాణికుల క్షేమమే ఆర్టీసీ లక్ష్యం ఇదే తమ నినాదమంటూ గొప్పలు చెప్పుకొనే ఆర్టీసీ యాజమాన్యం ఫస్ట్ ఎయిడ్ బాక్సుల నిర్వహణపై మాత్రం శ్రద్ధ వహించడంలేదు. రోడ్డు ప్రమాదంలో క్షత గాత్రులకు ప్రథమచికిత్స ఎంతో అవసరం. గాయపడిన వ్యక్తికి రక్తస్రావాన్ని నియంత్రించగలిగితే ఆ వ్యక్తి బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి 15 నిమిషాలు ఎంతో విలువైనవి. క్షతగాత్రులను ప్రాణాలతో రక్షించాలంటే ఆ సమయంలో చేసే చికిత్సే కీలకం.

 దీని నిమిత్తం అన్ని వాహనాల్లోనూ ప్రథమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం అవి ఎక్కడా కనిపించట్లేదు. ఒక వేళ అడపాదడపా ఉన్నా వాటిలో ప్రథమ చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్‌లు ఉండడంలేదు. ఫస్ట్‌ఎయిడ్ బాక్సుల నిర్వహించడం కష్టం కాకపోరుునా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం వీటిపై శ్రద్ధ చూపడం లేదు. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో 482 బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సులు మెడికల్ కిట్‌లు ఎక్కడా కనిపించడంలేదు.  ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌లు, 108 వాహనాల కోసం ఎదురుచూడడం తప్ప మరో దారి లేదు.

  అమలు కాని చట్టం..
 ప్రయాణీకులు వాహనాల్లో విధిగా ప్రథమ చికిత్స బాక్సులు ఏర్పాటు చేయాలని రవాణా వాహనాల చట్టం 1939 చెబుతోంది. దీనిని పటిష్టం చేస్తూ 1988లో మరిన్ని సవరణలు చేశారు. నిబంధనల ప్రకారం ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఇతర వస్తువులను ప్రథమ చికిత్స బాక్సుల్లో ఉంచాలి. కనీసం కాటన్, స్పిరిట్, బ్యాండేజ్, డెటాల్, పెయిన్‌కిల్లర్ మాత్రలు ఉండా లి. వాటి నిర్వహణపై సంబంధిత యాజమాన్యం నిరంతరం పర్యవేక్షణ చేయూలి. ఆర్టీసీ బస్సులో మాత్రం ఈ చట్టం అమలుకు నోచుకోవడం లేదు. బస్సుల్లో బాక్సులు ఉన్నా మందులు ఉండడంలేదు. అవసరమైతే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించే వరకు క్షతగాత్రులకు నరకయాతన తప్పపడంలేదు.

  అధికారుల నిర్లక్ష్యం..
 అనుమతుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అలంకార ప్రాయంగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ఆ తరువాత మళ్లీ కనిపించవు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిస్పెన్షరీ ఉంది. ప్రథమ చికిత్స బాక్సుల్లో మందులు పెట్టాల్సి వస్తే ఇక్కడ ఇండెంట్ పెట్టి తీసుకోవాలి. యాజమాన్యమే వీటిని డిస్పెన్షరీల ద్వారా సరఫరా చేస్తోంది. అయితే నిర్వహణ భారంగా మారిందని ఆర్టీసీ యాజమాన్యం వీటిని గాలికి వదిలేసింది.

 దాతల కోసం చూస్తున్నాం
  ప్రథమ చికిత్స బాక్సులు లేకపోవడం వలన ప్రయాణీకులకు ప్రమాద సమయాల్లో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేసేందుకు దాతలు, స్వచ్చంద సంస్థల కోసం ఎదురుచూస్తున్నాం. ఎవరూ స్పందించి ముందుకు రావడం లేదు.  - ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం జి.సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement