The risk
-
పొంచిఉన్న ప్రమాదం
ఏడాది గడచినా అమలుకు నోచని హామీ భయాందోళనలో ప్రజలు వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట– శ్రీనివాస్‌నగర్ రైల్వే స్టేషన్లో మరో ప్రమాదం ముంచుకురానుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం ఈ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు లేకపోవడంతో ఓప్రైవేటు స్కూల్ బస్సును రైలు ఢీకొనగా 16 మంది చిన్నారులు బలయ్యారు. ఈ దుర్ఘటన యావత్ భారతాన్ని కలచి వేసింది. దీంతో రైల్వే శాఖ అధికారులు కళ్లు తెరచి గేట్లు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే రైల్వే స్టేషన్లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని గ్రామస్తులు కోరారు. స్పందించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఏడాది క్రితం రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 4కోట్ల ప్రతిపాదనలు చేశామని, రైల్వే శాఖ అ«ధికారుల సమావేశంలో ప్రతిపాదనల లేఖను అందజేశామన్నారు. దీంతో స్పందించిన వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మ్యాచింగ్ గ్రాంట్‌ను ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని గత ఏడాది ఎంపీ తెలిపారు. టెండర్లు ఆహ్వానించి రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ ఏడాది గడుస్తున్నా జాడ లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతిరోజు వందలాది మంది, ముఖ్యంగా విద్యార్థులు పట్టాల పైనుండి నడుస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. స్టేషన్ దిగువ భాగంలోనే పాఠశాలలు ఉన్నందున విద్యార్థులకు ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందోనని పలువురు ఆందోళనకు గురవుతున్నారు. రైల్వే శాఖ అధికారులు స్పందించి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
లారీ కిందపడిన బైక్.. ఒకరి మృతి
వేగంగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి లారీ వెనక చక్రాల కింద పడటంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్ జిల్లా మామ్నూరులోని టీఎస్ఎస్పీ 4వ బెటాలియన్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెరికేడు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఎడ్లపల్లి బోసు(40), వెంకటేశ్వర్రావు(50), మరంశెట్టి సత్యనారాయణ(36) వరంగల్ మార్కెట్లో పత్తి అమ్మి తమ ద్విచక్రవాహనాలపై వరంగల్-ఖమ్మం రహదారిలో ఇంటికి బయలు దేరారు. టీఎస్ఎస్పీ 4వ బెటాలియన్ సమీపంలో పక్క నుంచి వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో ఎదురుగా మరో వాహనం వస్తుండటంతో అదుపుతప్పి లారీ వెనక చక్రాల కింద పడ్డారు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మన బస్సుల భద్రత ఎంత
కల్వర్టులపై ధ్వంసమైన రెయిలింగ్ అధ్వానంగా కరకట్టలపై రోడ్లు 70 రూట్లలో 500 పల్లె వెలుగు బస్సుల రాకపోకలు విద్యార్థులంతా ఆ సర్వీసుల్లోనే.. ‘అనంత’ ఘటనతో ఆందోళనలో జిల్లా వాసులు విజయవాడ : డొక్కు బస్సులు.. కల్వర్టులపై ధ్వంసమైన రెయిలింగ్.. కరకట్టలపై గోతులమయమైన రోడ్లు జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో 16 మంది మరణించ డంతో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటువంటి బస్సుల్లోనే నిత్యం రాకపోకలు సాగిస్తున్న తమ పరిస్థితి ఏమిటని జిల్లా అంతటా చర్చసాగుతోంది. జిల్లాలో 500 వరకు పల్లెవెలుగు బస్సులున్నాయి. ఈ బస్సులు ప్రధానంగా 70 రూట్లలో రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ-మచిలీపట్నం, జగ్గయ్యపేట, గుడివాడ, అవనిగడ్డ, నందిగామ, మైలవరం, నూజివీడు తదితర రూట్లలో నిత్యం 60కి పైగా పల్లెవెలుగు సర్వీసలు నడుస్తున్నాయి. అయితే ప్రతి బస్సు రోజూ సగటున 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నగరశివారు ప్రాంతాలైన కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, మైలవరం, ఇబ్రహీంపట్నం వంటి ప్రధాన రూట్లలో ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. నాన్‌స్టాప్ బస్సుల్లో పాసులు అంగీకరించకపోవడంతో విద్యార్థులు పల్లెవెలుగు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాలో గడచిన నాలుగేళ్ల కాలంలో పల్లెవెలుగు బస్సు ప్రమాదాలు జరిగిన దాఖాలాలు లేవు. అయితే తరచూ రోడ్లపై మొరాయిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పల్లెవెలుగు బస్సులను ఆర్టీసీ అధికారులు సక్రమంగా తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. నిత్యం బస్సు కండిషన్‌ను పరిశీలించడంతోపాటు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తప్పనిసరిగా బస్సులను పూర్తి స్థాయిలో ఫిట్నెస్ను పరీక్షించాల్సి ఉంది. జిల్లాలో ఇటువంటి చర్యలేమీ తీసుకోవడం లేదు. గుడివాడ మార్గంలో జరభద్రం జిల్లాలో ప్రధానంగా గుడివాడ-విజయవాడ మార్గం ప్రమాదభరితంగా ఉంది. కోమటిగుంటలాకులు నుంచి గుడివాడ వరకు రోడ్డుకు ఒకవైపు కాలువ ఉండడం అది కూడా ప్రమాద భరితంగా ఉండడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మార్గంలో వెంట్రప్రగడ నుంచి రోడ్డుకు ఇరువైపులా కాలువలు ఉండటం, కరకట్ట రోడ్డు కావడంతో గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట తదితర ప్రాంతాలకు జాతీయ రహదారి నుంచి వెళ్లేక్రాస్ రోడ్లలో తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటుచేయాల్సి ఉంది. గుంటూరు జిల్లాలోని వడ్లమూడి-తెనాలి మార్గంలో రోడ్డుకి రెండు వైపులా కాలువలు ఉండటంతో అత్యతం ప్రమాద భరింతంగా ఉంటుంది. ఈమార్గంలో ఏడాదికి సగటున 10 వరకు ప్రమాలు జరుగుతున్నాయి. కరకట్టలపై రైలింగ్ అవసరం జిల్లాలోని కరకట్ట ప్రాంతాలకు రైలింగ్ ఏర్పాటుచేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వై.వి.రావు తెలిపారు. ముఖ్యంగా కాలువకట్ట, లోయ, కొండమార్గాల్లో రోడ్డు నిర్మించే కాంట్రాక్టర్లే విధిగా రైలింగ్, బారికేడ్లు ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అప్రమత్తత అవసరం : ఆర్టీసీ ఈడీ నాగరాజు ఆర్టీసీ డ్రైవర్లు విధిగా అన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలను ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా నడపాలని ఆర్టీసీ ఈడీ నాగరాజు సూచించారు. తరచూ తాము బస్సులను తనిఖీ చేస్తున్నామని చెప్పారు. రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. -
రియల్ హీరో!
ఫొటో స్టోరీ ఎవరైనా ప్రమాదంలో చిక్కుకోగానే హీరో వచ్చి కాపాడేస్తుంటాడు సినిమాల్లో. నిజ జీవితంలో అలా జరుగుతుందా అని ఆశ్చర్యపోతుంటాం మనం. కానీ కొన్నిసార్లు అలాంటివి నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. అందుకు ఉదాహరణే ఈ చిత్రం. 1997లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వరదలు సంభవించాయి. శాంటా రోసా నగరం నీట మునిగింది. ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద పెద్ద భవంతులు సైతం కుప్ప కూలాయి. ఉధృతంగా వచ్చి ముంచేసిన వరద నీటిలో చాలామంది చిక్కుకుపోయారు. ఈ ఫొటోలో చూపిస్తున్న అమ్మాయి పరిస్థితి కూడా అదే. సుడులు తిరిగే వరద నీటిలో ఓ చెట్టు ఆధారంగా దొరికింది ఆ అమ్మాయికి. దాన్ని పట్టుకుని, ఎలాగైనా ప్రాణాలు నిలుపుకోవాలని ఆరాటపడిందామె. కానీ ఆమె వల్ల కాలేదు. ఇక మునిగిపోతుంది అనుకున్న సమయంలో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఓ అధికారి అక్కడకు వచ్చాడు. వరద నీటికి ఎదురీదుతూ పోయి, ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని కాపాడాడు. హెలికాప్టర్లో పయనిస్తూ వరద బీభత్సాన్ని తన లెన్సులో బంధిస్తోన్న ఫొటోగ్రాఫర్ ఆనీ వెల్స్ ఆ దృశ్యాన్ని ఒడిసిపట్టింది. బ్రేకింగ్ న్యూస్ ఫొటోగ్రఫీ క్యాటగిరీలో ఆ యేడు పులిట్జర్ పురాస్కారాన్ని అందుకుంది! -
ఫస్ట్ ఎయిడ్ బాక్స్.. నిర్వహణ తుస్
శ్రీకాకుళం అర్బన్: ప్రయాణికుల క్షేమమే ఆర్టీసీ లక్ష్యం ఇదే తమ నినాదమంటూ గొప్పలు చెప్పుకొనే ఆర్టీసీ యాజమాన్యం ఫస్ట్ ఎయిడ్ బాక్సుల నిర్వహణపై మాత్రం శ్రద్ధ వహించడంలేదు. రోడ్డు ప్రమాదంలో క్షత గాత్రులకు ప్రథమచికిత్స ఎంతో అవసరం. గాయపడిన వ్యక్తికి రక్తస్రావాన్ని నియంత్రించగలిగితే ఆ వ్యక్తి బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి 15 నిమిషాలు ఎంతో విలువైనవి. క్షతగాత్రులను ప్రాణాలతో రక్షించాలంటే ఆ సమయంలో చేసే చికిత్సే కీలకం. దీని నిమిత్తం అన్ని వాహనాల్లోనూ ప్రథమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం అవి ఎక్కడా కనిపించట్లేదు. ఒక వేళ అడపాదడపా ఉన్నా వాటిలో ప్రథమ చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్లు ఉండడంలేదు. ఫస్ట్‌ఎయిడ్ బాక్సుల నిర్వహించడం కష్టం కాకపోరుునా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం వీటిపై శ్రద్ధ చూపడం లేదు. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో 482 బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సులు మెడికల్ కిట్లు ఎక్కడా కనిపించడంలేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌లు, 108 వాహనాల కోసం ఎదురుచూడడం తప్ప మరో దారి లేదు. అమలు కాని చట్టం.. ప్రయాణీకులు వాహనాల్లో విధిగా ప్రథమ చికిత్స బాక్సులు ఏర్పాటు చేయాలని రవాణా వాహనాల చట్టం 1939 చెబుతోంది. దీనిని పటిష్టం చేస్తూ 1988లో మరిన్ని సవరణలు చేశారు. నిబంధనల ప్రకారం ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఇతర వస్తువులను ప్రథమ చికిత్స బాక్సుల్లో ఉంచాలి. కనీసం కాటన్, స్పిరిట్, బ్యాండేజ్, డెటాల్, పెయిన్‌కిల్లర్ మాత్రలు ఉండా లి. వాటి నిర్వహణపై సంబంధిత యాజమాన్యం నిరంతరం పర్యవేక్షణ చేయూలి. ఆర్టీసీ బస్సులో మాత్రం ఈ చట్టం అమలుకు నోచుకోవడం లేదు. బస్సుల్లో బాక్సులు ఉన్నా మందులు ఉండడంలేదు. అవసరమైతే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించే వరకు క్షతగాత్రులకు నరకయాతన తప్పపడంలేదు. అధికారుల నిర్లక్ష్యం.. అనుమతుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అలంకార ప్రాయంగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ఆ తరువాత మళ్లీ కనిపించవు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిస్పెన్షరీ ఉంది. ప్రథమ చికిత్స బాక్సుల్లో మందులు పెట్టాల్సి వస్తే ఇక్కడ ఇండెంట్ పెట్టి తీసుకోవాలి. యాజమాన్యమే వీటిని డిస్పెన్షరీల ద్వారా సరఫరా చేస్తోంది. అయితే నిర్వహణ భారంగా మారిందని ఆర్టీసీ యాజమాన్యం వీటిని గాలికి వదిలేసింది. దాతల కోసం చూస్తున్నాం ప్రథమ చికిత్స బాక్సులు లేకపోవడం వలన ప్రయాణీకులకు ప్రమాద సమయాల్లో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేసేందుకు దాతలు, స్వచ్చంద సంస్థల కోసం ఎదురుచూస్తున్నాం. ఎవరూ స్పందించి ముందుకు రావడం లేదు. - ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం జి.సత్యనారాయణ