మన బస్సుల భద్రత ఎంత
కల్వర్టులపై ధ్వంసమైన రెయిలింగ్
అధ్వానంగా కరకట్టలపై రోడ్లు
70 రూట్లలో 500 పల్లె వెలుగు బస్సుల రాకపోకలు
విద్యార్థులంతా ఆ సర్వీసుల్లోనే..
‘అనంత’ ఘటనతో ఆందోళనలో జిల్లా వాసులు
విజయవాడ : డొక్కు బస్సులు.. కల్వర్టులపై ధ్వంసమైన రెయిలింగ్.. కరకట్టలపై గోతులమయమైన రోడ్లు జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో 16 మంది మరణించ డంతో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటువంటి బస్సుల్లోనే నిత్యం రాకపోకలు సాగిస్తున్న తమ పరిస్థితి ఏమిటని జిల్లా అంతటా చర్చసాగుతోంది. జిల్లాలో 500 వరకు పల్లెవెలుగు బస్సులున్నాయి. ఈ బస్సులు ప్రధానంగా 70 రూట్లలో రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ-మచిలీపట్నం, జగ్గయ్యపేట, గుడివాడ, అవనిగడ్డ, నందిగామ, మైలవరం, నూజివీడు తదితర రూట్లలో నిత్యం 60కి పైగా పల్లెవెలుగు సర్వీసలు నడుస్తున్నాయి. అయితే ప్రతి బస్సు రోజూ సగటున 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నగరశివారు ప్రాంతాలైన కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, మైలవరం, ఇబ్రహీంపట్నం వంటి ప్రధాన రూట్లలో ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి.
నాన్‌స్టాప్ బస్సుల్లో పాసులు అంగీకరించకపోవడంతో విద్యార్థులు పల్లెవెలుగు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాలో గడచిన నాలుగేళ్ల కాలంలో పల్లెవెలుగు బస్సు ప్రమాదాలు జరిగిన దాఖాలాలు లేవు. అయితే తరచూ రోడ్లపై మొరాయిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పల్లెవెలుగు బస్సులను ఆర్టీసీ అధికారులు సక్రమంగా తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. నిత్యం బస్సు కండిషన్‌ను పరిశీలించడంతోపాటు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తప్పనిసరిగా బస్సులను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ను పరీక్షించాల్సి ఉంది. జిల్లాలో ఇటువంటి చర్యలేమీ తీసుకోవడం లేదు.
గుడివాడ మార్గంలో జరభద్రం
జిల్లాలో ప్రధానంగా గుడివాడ-విజయవాడ మార్గం ప్రమాదభరితంగా ఉంది. కోమటిగుంటలాకులు నుంచి గుడివాడ వరకు రోడ్డుకు ఒకవైపు కాలువ ఉండడం అది కూడా ప్రమాద భరితంగా ఉండడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మార్గంలో వెంట్రప్రగడ నుంచి రోడ్డుకు ఇరువైపులా కాలువలు ఉండటం, కరకట్ట రోడ్డు కావడంతో గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట తదితర ప్రాంతాలకు జాతీయ రహదారి నుంచి వెళ్లేక్రాస్ రోడ్లలో తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటుచేయాల్సి ఉంది. గుంటూరు జిల్లాలోని వడ్లమూడి-తెనాలి మార్గంలో రోడ్డుకి రెండు వైపులా కాలువలు ఉండటంతో అత్యతం ప్రమాద భరింతంగా ఉంటుంది. ఈమార్గంలో ఏడాదికి సగటున 10 వరకు ప్రమాలు జరుగుతున్నాయి.
కరకట్టలపై రైలింగ్ అవసరం
జిల్లాలోని కరకట్ట ప్రాంతాలకు రైలింగ్ ఏర్పాటుచేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వై.వి.రావు తెలిపారు. ముఖ్యంగా కాలువకట్ట, లోయ, కొండమార్గాల్లో రోడ్డు నిర్మించే కాంట్రాక్టర్లే విధిగా రైలింగ్, బారికేడ్లు ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అప్రమత్తత అవసరం : ఆర్టీసీ ఈడీ నాగరాజు
ఆర్టీసీ డ్రైవర్లు విధిగా అన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలను ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా నడపాలని ఆర్టీసీ ఈడీ నాగరాజు సూచించారు. తరచూ తాము బస్సులను తనిఖీ చేస్తున్నామని చెప్పారు. రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.