గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు
రైళ్లు ఫుల్... బస్సులు కిటకిట
ప్రజల వినతి మేరకు అదనపు రైళ్లు వేసిన రైల్వే శాఖ
అదనపు ప్రత్యేక రైళ్లలో బెడ్ రోల్స్ కొరత
వారం రోజుల వరకు బస్సుల్లో నో టికెట్లు
చార్జీలు పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్
సాక్షి, అమరావతి : గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో ప్రజలంతా ప్రయాణాలు కట్టారు. సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతోపాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించింది.
18న నర్సాపూర్– సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్– నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్‌సోల్, కాచిగూడ– తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. వాటన్నింటిలోనూ ఏసీ కోచ్‌లున్నాయి. కానీ, వీటిలో ప్రయాణికులకు ఇచ్చేందుకు బెడ్ రోల్స్ లేవు. దక్షిణ మధ్య రైల్వే రోజూ నిత్యం 210 రెగ్యులర్ రైళ్లను నిర్వహిస్తోంది. ఇక ఏడాదిలో వివిధ సందర్భాలను పరిగణలోకి తీసుకుని 200 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
నిర్ణీత తేదీల్లో వీటిని నడుపుతుంటుంది. రెగ్యులర్, ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు (బెడ్‌రోల్స్) ఇస్తుంది. విజయవాడ, తిరుపతి, గుంతకల్, కాచిగూడల్లో ఉన్న రైల్వే మెకనైజ్డ్ లాండ్రీల్లో వాటిని శుభ్రపరిచి, తిరిగి సరఫరా చేస్తుంటుంది. కానీ ఇప్పుడు అదనంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌ల ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు లేవు. దాంతో ఈ రైళ్లలో బెడ్ రోల్స్ అందించలేమని, ప్రయాణికులు దుప్పట్లను వారే తెచ్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్
ఆర్టీసీ రాష్ట్రంలో రోజుకు 11 వేల బస్సు సర్వీసులు నిర్వహిస్తోంది. వరుస సెలవుల కారణంగా బస్సుల్లో టికెట్లు దొరకడంలేదు. రానున్న వారం రోజులకు సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దాంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆధారపడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేశారు.
విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సు చార్జీ రూ.1,200 ఉండగా ఇప్పుడు రూ.2 వేలకు పెంచేశారు. స్లీపర్ ఏసీ బస్సుల్లో రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఊళ్లకు వెళ్తుండటంతో టోల్ గేట్ల వద్ద రద్దీ భారీగా పెరిగింది. పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నందున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ సెలవులు
15వ తేదీ గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు
16వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఐచ్ఛిక సెలవు
17వ తేదీ శనివారం – సాధారణ సెలవు
18వ తేదీ ఆదివారం – సాధారణ సెలవు
19వ తేదీ సోమవారం – రాఖీ పౌర్ణమి సెలవు
Comments
Please login to add a commentAdd a comment