పొంచిఉన్న ప్రమాదం
- ఏడాది గడచినా అమలుకు నోచని హామీ
- భయాందోళనలో ప్రజలు
వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట– శ్రీనివాస్‌నగర్ రైల్వే స్టేషన్‌లో మరో ప్రమాదం ముంచుకురానుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం ఈ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు లేకపోవడంతో ఓప్రైవేటు స్కూల్ బస్సును రైలు ఢీకొనగా 16 మంది చిన్నారులు బలయ్యారు. ఈ దుర్ఘటన యావత్ భారతాన్ని కలచి వేసింది. దీంతో రైల్వే శాఖ అధికారులు కళ్లు తెరచి గేట్లు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే రైల్వే స్టేషన్‌లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని గ్రామస్తులు కోరారు. స్పందించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఏడాది క్రితం రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 4కోట్ల ప్రతిపాదనలు చేశామని, రైల్వే శాఖ అ«ధికారుల సమావేశంలో ప్రతిపాదనల లేఖను అందజేశామన్నారు. దీంతో స్పందించిన వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మ్యాచింగ్ గ్రాంట్‌ను ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని గత ఏడాది ఎంపీ తెలిపారు. టెండర్లు ఆహ్వానించి రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ ఏడాది గడుస్తున్నా జాడ లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతిరోజు వందలాది మంది, ముఖ్యంగా విద్యార్థులు పట్టాల పైనుండి నడుస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. స్టేషన్ దిగువ భాగంలోనే పాఠశాలలు ఉన్నందున విద్యార్థులకు ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందోనని పలువురు ఆందోళనకు గురవుతున్నారు. రైల్వే శాఖ అధికారులు స్పందించి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.