పదిరోజులైనా.. పట్టించుకోరా..?
పదిరోజులైనా.. పట్టించుకోరా..?
Published Wed, Aug 10 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
మోర్తాడ్ : ఇటీవల కురిసిన వర్షాలకు మొండివాగు ఉధృతంగా ప్రవహించడంతో రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో మొండివాగుపై నిర్మించిన వంతెన కూలిపోయింది.. వంతెన కూలి పది రోజులు కావస్తున్నా రైల్వే అధికారులు చర్యలు చేపట్ట లేదు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.. వంతెన నిర్మాణంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో చిన్నపాటి వాగు ప్రవాహానికే కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. వంతెన నిర్మించే సమయంలో పిల్లర్లు వేసి స్లాబ్ వేయకుండా రింగులను ఏర్పాటు చేసి వాటిపై సిమెంట్ బిల్లలు మాత్రమే వేశారు. మొండి వాగు ఉధృతికి వంతెనపై ఏర్పాటు చేసిన సిమెంట్ బిల్లలు కుప్పకూలాయి. వంతెన పూర్తిగా కూలడంతో రైల్వే స్టేషన్‌కు వెళ్లేదారి మూతపడింది. రైల్వే స్టేషన్, లైన్ ప్రారంభించకపోవడంతో ఈ ప్రాంతంలో అంతగా రద్దీ ఉండదు. అయితే రైల్వేస్టేషన్ పరిసరాల్లో పంటపొలాలు ఉండడంతో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాలంటే ఈ వంతెన మీదుగానే వెళ్లాలి. అంతేకాక రైల్వే స్టేషన్‌లో చిన్న చిన్న పనులు కొనసాగుతున్నాయి. అధికారులు, కూలీలు, కాంట్రాక్టర్‌లు కూడా వెళ్లడానికి దారిలేకుండా పోయింది. పంట పొలాలకు వెళ్లడానికి వేరే మార్గం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయించాలని పలువురు కోరుతున్నారు.
Advertisement