సమ్మెట దెబ్బ
- నిలిచిపోయిన బస్సులతో ప్రయాణికుల పాట్లు
- అధిక ధరలు దండుకున్న ప్రైవేట్ ఆపరేటర్లు
- 120 సర్వీసులు నడిపిన ఆర్టీసీ అధికారులు
- తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ
విజయవాడ : జిల్లాలో ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ఆగిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు బుధవారం ఉదయం నుంచి సమ్మెబాట పట్టారు. వందల సంఖ్యలో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మరోవైపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు మాత్రం యథావిధిగా వెళ్లిపోయాయి.
అధికార తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన టీఎన్‌టీయూసీ మినహా అన్ని సంఘాలు పాల్గొనడంతో మొదటి రోజు సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతమైంది. టీఎన్‌టీయూసీ కార్మికులు విధులకు హాజరయ్యేందుకు యత్నించగా ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు సంఘాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మరోవైపు సమ్మె ప్రభావం ఆర్టీసీ ఆదాయంపై కూడా పడింది. బుధవారం ఒక్కరోజే రూ.1.42 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
10 నెలలుగా విన్నపాలు...
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు గత పది నెలలుగా అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించాయి. ప్రధానంగా 2013 ఏప్రిల్ నుంచి పేస్కేల్ వేతన సవరణ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు 43 శాతం ఫిట్‌మెంట్, అంతకుముందు రావాల్సిన 19 శాతం ఫిట్‌మెంట్ కలిపి ప్రకటించాలని, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్న 60 రోజులను స్పెషల్ లీవ్‌గా పరిగణించాలని తదితర డిమాండ్లను ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. దీనిపై మంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీతో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యం.
ఈ క్రమంలో బుధవారం ఉదయం నాలుగు గంటల నుంచి సమ్మె మొదలుపెట్టారు. దీంతో జిల్లాలోని 14 డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా విజయవాడ బస్టాండ్‌లో బస్సులు పూర్తిస్థాయిలో డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నాగరాజు విజయవాడ జోన్‌లోని మూడు జిల్లాల్లో ఉన్న అద్దె బస్సుల్ని ప్రైవేట్ డ్రైవర్లతో నిర్వహించాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లాలో 120 బస్సు సర్వీసులు రాకపోకలు సాగించాయి. దీంతో 8 లక్షల మేర ఆదాయం వచ్చింది. జిల్లాలోని దగ్గర ప్రాంతాలకు మాత్రమే బస్సుల రాకపోకలు సాగాయి. మరోవైపు సమ్మె నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ యూనియన్‌కు నేషనల్ మజ్దూర్ యూనియన్‌తో పాటు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి.
బస్సుల్ని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు...
మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి రోజువారీ వేతనంపై డ్రైవర్లను, కండక్టర్లను నియమించింది. డ్రైవర్‌గా పనిచేయటానికి 170 మంది, కండక్టర్‌గా పనిచేయటానికి 300 మంది వరకు విజయవాడ బస్టాండ్‌లో దరఖాస్తులు అందజేశారు. ఈ క్రమంలో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను కార్మిక సంఘాలు అడ్డుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
ఈ క్రమంలో 120 మంది డ్రైవర్లు, 120 మంది కండక్టర్లను రోజువారీ వేతనం కింద నియమించుకొని 120 సర్వీసుల్ని నడిపారు. రోజువారీ వేతనంపై నియమితులైన కార్మికులు డిపోల నుంచి బస్సులను తీస్తున్న క్రమంలోనూ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బస్సుల్ని అడ్డుకొని నిరసన తెలిపాయి. దీంతో పోలీసుల పహారా నడుమ బస్సులను బయటికి తీసుకెళ్లారు. గురు, శుక్రవారాల్లో సగటున 500 బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
యథేచ్ఛగా ప్రైవేటు దోపిడీ...
ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ బస్సుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. హైదరాబాద్‌కు టిక్కెట్ ధర కంటే సగటున రూ.100 నుంచి రూ.300 వరకు అధికంగా వసూలు చేశారు. విజయవాడ నుంచి 100 ప్రత్యేక సర్వీసుల్ని నడిపారు. బెంగళూరు, చైన్నైకి రూ.300 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేశారు. ఆర్టీసీ బస్సులు లేకపోవటంతో ప్రెవేట్ బస్సులు నూరుశాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగించాయి.