► ఆర్టీసీలో సమ్మె షురూ
► ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాల ఆందోళన
► ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుతో కార్మికుల హర్షం
► ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బస్సులు నడిపిన అధికారులు
► సమ్మెతో ఆర్టీసీకి రూ.90 లక్షలు నష్టం
కర్నూలు(రాజ్‌విహార్) : రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగింది. సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టడంతో బస్సులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన మొదటి సర్వీసు నుంచే కదలనీయలేదు.
డ్రైవర్లు, కండక్టర్లతోపాటు గ్యారేజీ, డీఎం కార్యాలయ సిబ్బంది, రీజినల్ మేనేజరు ఆఫీస్, పర్సనల్, అకౌంట్స్, మెకానికల్, ట్రైనింగ్ కళాశాల తదితర అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో వెళ్లారు. 11 డిపోల్లో 4,800 ఉద్యోగులు ఉండగా వీరిలో ఆఫీసర్ స్థాయి అధికారులు 48 మంది ఉన్నారు. వీరు తప్ప 4,752 మంది విధులకు దూరంగా ఉన్నారు.
నిలిచిపోయిన 970బస్సులు : జిల్లాలోని 11డిపోల్లో 970 బస్సులున్నాయి. ఇవి 371 రూట్లలో 4లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తున్నాయి. దీంతో సంస్థకు రోజుకు రూ.1.10కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. సమ్మె కారణంగా 970 బస్సులు నిలిచిపోయాయి. అయితే, అధికారులు చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలతో పలు బస్సులు తిప్పారు.
ఆర్టీఓ అధికారుల సహకారంతో హెవీ లెసైన్స్ కాలపరిమితి ఉన్న వ్యక్తులను డ్రైవర్లుగా, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని కండక్టర్లుగా తాత్కాలికంగా ఎంపిక చేసి 84 బస్సులను వివిధ రూట్లలో నడిపారు. వీటితోపాటు అద్దెప్రతిపాదికన ఉన్న మరో 64 బస్సులను సైతం తిప్పారు. సమ్మె కారణంగా సంస్థకు రూ.90 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టీవీ రామం పేర్కొన్నారు.
జనంపై ‘సమ్మె’ట: రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) తలపెట్టిన సమ్మెకు నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) పూర్తిగా మద్దతు ప్రకటించింది. వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించడంతో బస్సులు నిలిచిపోయాయి.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమ్మె కారణంగా బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయించారు. ప్రయాణికుల అవసరాలను ఆసరా చేసుకున్న వాహనదారులు వారి నుంచి ఎక్కువ మొత్తం చార్జీ వసూలు చేశారు. సమ్మె ఇలాగే కొనసాగితే త్వరలో పోటీ పరీక్షలు, ఎంసెట్, పాలిసెట్ తదితర పరీక్షలు సైతం ఉండడంతో విద్యార్థులకు సైతం కష్టాలు తప్పవు.
జగన్ మద్దతుపై హర్షం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు ఏవీ రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, జోనల్ అధ్యక్షుడు నబి రసూల్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, ఎన్‌ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ కుమార్, ఎంబీఎన్ శాస్త్రి, నాగయ్య, ప్రభుదాస్, నాగన్న, మనోహర్ మాణిక్యం, మునెప్ప జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అభినందించారు. తొలుత ర్యాలీ నిర్వహించారు.
ఎక్కడి బస్సులు అక్కడే
Published Thu, May 7 2015 3:08 AM | Last Updated on Tue, May 29 2018 3:48 PM
Advertisement
Advertisement