సమ్మె విరమించిన కార్మికులు
► రాత్రి నుంచి పూర్తిస్థాయిలో కదలిన బస్సులు
► 43శాతం ఫిట్‌మెంట్‌పై సంబరాలు
► ఎనిమిది రోజులకు రూ.6 కోట్ల నష్టం
నెల్లూరు (రవాణా) : ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రొడ్డెక్కాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలంటూ ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. బుధవారం రాష్ట్ర మంత్రుల సబ్‌కమిటీ, యూనియన్లు నేతలు చేపట్టిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి.
43 శాతం ఫిట్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో కార్మిక సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఫిట్‌మెంట్‌తో పాటు అరియర్స్‌ను రెండు విడతల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సమ్మె విరమించి తక్షణం విధుల్లోకి వెళ్లనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తిరిగిన 410 బస్సులు..
బుధవారం సాయంత్రం వరకు జిల్లాలోని ఆయా డిపోల నుంచి 410 బస్సులు తిరిగాయి. వాటిలో 311 ఆర్టీసీ బస్సులు, 109 అద్దె బస్సులు ఉన్నాయి. బస్సులకు 311 మంది తాత్కాలిక డ్రైవర్లు, 410 మంది కండక్టర్లు విధులు నిర్వహించారు. రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా 850 బస్సులు తిరిగాయి.
ఎనిమిది రోజుల సమ్మె
ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో ఆర్టీసీకి రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. దీంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుతో బస్సులను నడిపారు. గతంలో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.కోటి రెవెన్యూ వచ్చేది. కార్మికులు సమ్మె కాలంలో రోజుకు రూ.25 లక్షలకు మించలేదు.
మిఠాయిల పంపిణీ
ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం 43శాతం ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాన ఆర్టీసీ బస్డాండ్‌లో ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, కార్మికసంఘ్ తదితర యూనియన్ల నాయకులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఫిట్‌మెంట్‌కు అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలిపారు.
సమ్మెకు సంఘీభావం, మద్దతు తెలిపిన వైస్సార్‌సీసీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ తదితర పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అదేవిధంగా సమ్మెకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం కార్మికుల విజయంగా పేర్కొన్నారు.