సమ్మెసెగ | RTC workers protest Rally extreme Tension Lead | Sakshi
Sakshi News home page

సమ్మెసెగ

Published Sun, May 10 2015 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

RTC workers protest Rally extreme Tension Lead

- బస్టాండ్‌లో ఉద్రిక్తత
- బస్సు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తులు
- ఆర్టీసీ కార్మికుల పనేనని పోలీసుల జులుం
- గౌతంరెడ్డి సహా పలువురు నేతల అరెస్టు, విడుదల
- పలు ప్రాంతాల్లో పోలీసుల ఫైర్

నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, నినాదాలు, అరెస్టులతో నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ శనివారం రణరంగాన్ని తలపించింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసన ప్రదర్శనలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఎక్స్‌ప్రెస్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో రెచ్చిపోయిన పోలీసులు ఆందోళనకారులపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేసి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు తిప్పారు. 56మందిపై కేసులు నమోదుచేసి సాయంత్రం విడుదల చేశారు.
 

బస్‌స్టేషన్ : ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా నాల్గోరోజు శనివారం నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ డిపో నుంచి మెయిన్ గేటు వరకు నిరసన ర్యాలీ జరి పారు.  ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలు మెయిన్ గేట్ ముందు బైఠాయించారు. దీనికి వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మద్దతు తెలిపి కార్మికులతో పాటే బైఠాయించారు. ఇదిలావుంటే.. బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంపై ఉన్న గుంటూరు-రాజమండ్రి బస్సు అద్దాలను రాధాకృష్ణ, రమేష్, రాజు, సుబ్బారావు అనే వ్యక్తులు  ధ్వంసం చేశారు. దీనిపై బస్సు యజమాని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బస్టాండ్ ప్రధాన గేటు వద్ద నిరసన జరుపుతున్న కార్మికులకు సంబంధం లేని వ్యక్తులు అద్దాలు పగలకొట్టడంతో పోలీసులు నిరసనకారులపై జులం ప్రదర్శించారు. ఆర్టీసీ కార్మికులు, వారికి మద్దతు ప్రకటించడానికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనాల్లో పడేశారు.

అరెస్ట్, విడుదల
బస్టాండ్‌లో నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తొలుత నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మాచవరం, సత్యనారాయణపురం, ఉయ్యూరు, పమిడిముక్కల పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 56 మందిపై 151 సీఆర్‌సీ కేసు నమోదు చేశారు. అనంతరం సాయంత్రం ఆరు గంటల సమయంలో విడుదల చేశారు. స్టేషన్ల నుంచి వచ్చిన వారంతా పాత బస్టాండ్‌లో కార్మికులతో సమావేశమయ్యారు.

పోలీసుల తీరు దారుణం : గౌతంరెడ్డి
కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటంలో పోలీసులు చూపిన తీరు దారుణమని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు. నగరంలో ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని ఆయనను కలుస్తారని, ఆందోళన చేస్తారని స్టేషన్లకు తరలించారని చెప్పారు. అరెస్టులతో భయపెట్టి ఉద్యమాన్ని ఆపలేరన్నారు. అంతకుముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి కార్మికుల వల్లే నష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేకపోవడం మంచిదికాదన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను, ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం త్వరగా స్పందించాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ గతంలో జరిపిన చర్చల్లో కార్మికులను మోసం చేసిన యాజమాన్యం, ఇకపై మోసగించేందుకు అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు విశ్వనాథ రవి, సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్, సీఐటీయూ నాయకులు ముజఫర్ అహ్మద్, ఆర్టీసీ యూనియన్ నేతలు ఎన్‌హెచ్‌ఎన్ చక్రవర్తి, యార్లగడ్డ రమేష్, టీవీ భవాని, నారాయణ, మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement