
ఢిల్లీలో బొత్స ప్రెస్‌మీట్ రసాభాస
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. విజయనగరంలో విద్యార్థులపై బొత్స అనుచరులు దౌర్జన్యం చేయడంపై సమైక్యాంధ్ర మద్దతుదారులు నిలదీశారు. ఈ దాడిని ఖండించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదానికి మద్దతుగా పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని కోరారు. దీంతో షాక్ తిన్న ఆయన తర్వాత తేరుకున్నారు. విజయనగరంలో విద్యార్థులపై దాడి గురించి తనకు తెలియదని చెప్పారు. విద్యార్థులపై దాడికి పాల్పడింది తన అనుచరులు కాదని చెప్పి సమైక్యవాదులను శాంతింపజేశారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ను చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కతో పోల్చడాన్ని బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. చంద్రబాబు భాష మార్చుకోవాలని సూచించారు. చంద్రబాబును గుంటనక్కతో పోల్చారు. మామను వెన్నుపోటు పొడిచిన బాబుకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదని అన్నారు. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.