జూడాల సమ్మెబాట | Ruia Hospital Junior Doctors Committed Strike | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మెబాట

Published Tue, Feb 12 2019 12:15 PM | Last Updated on Tue, Feb 12 2019 12:15 PM

Ruia Hospital Junior Doctors Committed Strike - Sakshi

రుయా సీఎస్‌ఆర్‌ఎంఓకు సమ్మె నోటీసు ఇస్తున్న జూనియర్‌ డాక్టర్లు

రుయా ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లకు సహనం నశించింది. గత ఐదు నెలలుగా స్టైఫండ్‌ మంజూరు కాలేదని పలుమార్లు ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్, రుయా సూపరింటెండెంట్‌లకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. తమ సమస్యలు అర్థం చేసుకుని లోపాలను సరిచేయాల్సిన ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విధిలేక సమ్మె బాటపట్టారు.

చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రుయా ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. సోమవారం సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్‌ ఆర్‌ఆర్‌ రెడ్డిని కలసి సమ్మె నోటీసు ఇచ్చారు. మంగళవారం సాధారణ సేవలకు కూడా వారు హాజరుకారు. 24 గంటల్లో అధికారులు స్పందించకుంటే బుధవారం అత్యవసర సేవలను కూడాబహిష్కరించనున్నారు. ఎస్వీ మెడికల్‌ కళాశాల పరిధిలో 200 మంది జూనియర్‌ డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరు నిత్యం  ఓపీ మొదలుకుని క్యాజువాలిటీ, ఇతర విభాగాల్లో సేవలందిస్తున్నారు. రుయా ఆస్పత్రికి నిత్యం 1500 మందికి పైగా ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. ఇన్‌ పేషెంట్లు 850 మందికి పైగా సేవలు పొందుతున్నారు. వీరందరికీ అవసరమైన వైద్య సేవలు అందిండచంలో జూనియర్‌ డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

రూ.1.58 కోట్ల బకాయి
ఎస్వీ మెడికల్‌ కళాశాలకు చెందిన జూనియర్‌ డాక్టర్లు 200 మంది రుయాలో సేవలు అందిస్తున్నారు. వీరికి నెలకు రూ.18,500 స్టైఫండ్‌ చొప్పున ఇవ్వాలి. హౌస్‌ సర్జన్లు ఆస్పత్రికి అందిస్తున్న సేవలకు ప్రభుత్వం స్టైఫండ్‌ను మంజూరు చేయడం ఆనవాయితీ. గత ఏడాది అక్టోబర్‌ నుంచి వీరికి స్టైఫండ్‌ మంజూరు కాలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.1.58 కోట్ల బకాయి పడింది.

పట్టించుకోని అధికారులు
జూనియర్‌ డాక్టర్లకు ఐదు నెలలుగా స్టైఫండ్‌ అందకపోయినా కనీసం అధికారులు పట్టించుకోలేదు. జూడాల సమ్యలను అర్థం చేసుకుని లోపాలను సరిచేసి స్టైఫండ్‌ అందిచాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా జూడాల స్టైఫండ్‌ ప్రతి ఏటా నిలిచిపోవడం సమ్మెకు దిగడం సర్వసాధారణంగా మారింది. సమ్మె నోటీసులు ఇచ్చిన వారిలో జూడాల నాయకులు ఉమేష్, క్రాంతి, చైతన్య, స్వరూప్, లిఖిత తదితరులు ఉన్నారు.

ఐదు నెలలుగా భరించాం
రుయా ఆస్పత్రికి వచ్చే పేద రోగులు ఇబ్బందులు పడకూడదని భావించాం. ఐదు నెలలుగా స్టైఫిండ్‌ అందకపోయినా భరించాం. కనీసం అధికారుల నుంచి స్పందన లేదు. ఇక విధిలేక సమ్మె నోటీసు ఇచ్చాం.
 ప్రతి నెలా 6వ తేదీ లోపు స్టైఫండ్‌ను మంజూరు చేయాలి. అత్యవసర విభాగాన్ని పటిష్టం చేయాలి. క్యాజువాలిటీలో అత్యవసర మందులు, గ్లూకోజ్‌ స్ట్రిప్స్, బ్లడ్‌ ట్రాన్స్‌ప్యూజన్‌ సెట్, వాష్‌ రూం, ఎక్స్‌రే, సిటీ స్కాన్, వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి.– డాక్టర్‌ వెంకటరమణ, అధ్యక్షుడు, ఏపీ జూడాల సంఘం, ఎస్వీ మెడికల్‌ కళాశాల శాఖ, తిరుపతి .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement