సాక్షి ప్రతినిధి, కర్నూలు: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు సరికొత్త ఎత్తుగడ వేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట విలువైన స్థలాల ఆక్రమణకు టెండర్ పెట్టారు. ఇరిగేషన్ భూములకు నాయకుల ఒత్తిళ్లతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిరభ్యంతర పత్రాలు ఇచ్చేస్తున్నారు. తాజాగా కర్నూలు మండలం మామిదలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని రూ.3 కోట్ల విలువ చేసే కేసీ కెనాల్ పొరంబోకు భూమిపై వీరి కన్ను పడింది.
జిల్లాలో ఓ మంత్రికి ముఖ్య అనుచరుడిగా చెలామణి అవుతూ.. ఓ ఎమ్మెల్యే తనకు మిత్రుడని నమ్మబలుకుతూ ఓ మాజీ ఎంపీటీసీ తనకు అనుకులంగా ఉన్న వారి పేర్లతో 2011 మార్చి చివరి వారంలో ఓ జాబితా తయారు చేశారు. ఇందులో కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఓ వీఆర్వో, రేషన్ డీలర్ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారు. ఈ వ్యవహారాన్ని ఓ ఎమ్మెల్యేను తెర ముందుండి నడిపించినట్లు సమాచారం. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారికి అనుకుని కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ఉంది.
కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 128/5బి3ఏ కేసీ కెనాల్ పోరంబోకు స్థలం 1.40 ఎకరాలను అధికారికంగా కబ్జా చేసేందుకు నాయకులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అధికారుల సహకారంతో పావులు కదిపారు. ఆ భూమి తమకు నిరుపయోగమని ఇరిగేషన్ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేయించారు. అనంతరం ఆ స్థలాన్ని దక్చించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు పక్కా ప్రణాళిక రూపొందించారు. మామిదలపాడుకి చెందిన 10 నుంచి 20 కుటుంబాలు కేసీ కెనాల్‌కు ఇరువైపుల గుడిసెలు వేసుకున్నారని.. వారికి ఇళ్ల పట్టాల పంపిణీని చేయిస్తామని ఆ భూమిని తెరపైకి తెచ్చారు.
అనర్హులు.. అనుకూలురైన వారి పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఓ మాజీ ఎంపీటీసి తన భార్య, అమ్మ, బంధువులు, మండలంలోని పంచాయతీ వీఆర్వో, రియల్టర్లు, డీలర్ల పేర్లను అందులో చేర్చారు. 59 మందికి 2 సెంట్ల చొప్పున పట్టాలు సిద్ధం చేసి పంపిణీ చేశారు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ భూమిని అనర్హులకు కట్టబెట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా నిబంధనలను తుంగలో తొక్కారు. జాబితాలో కొన్ని బోగస్ పేర్లను కూడా చేర్చి ఆ పట్టాలను అధిక మొత్తంలో విక్రయించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అక్రమార్కులు ఇప్పటికే కర్నూలు నగర శివారులో తుంగభద్ర దిగువ కాలువకు చెందిన సర్వే నెంబర్ 291/1లో ఉన్న రూ.3కోట్ల విలువైన 72 సెంట్లు, ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలోని ఎల్‌ఎల్‌సీ కాలువ భూమి కబ్జా చేశారు. దీంతో పాటు కర్నూలు మండలం పూడురు గ్రామ సమీపంలో కేసీ కెనాల్ పొరంబోకు భూములు 40 ఎకరాలు బీనామీ పేర్లతో స్వాహ చేశారు.
రియల్ ఎత్తు కాంగ్రెస్ నేతల భూమాయ
Published Wed, Jan 8 2014 4:36 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement