ముక్కు మూసుకోవాల్సిందే..! | Rural sanitation problem facing | Sakshi
Sakshi News home page

ముక్కు మూసుకోవాల్సిందే..!

Published Fri, Dec 13 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

ముక్కు మూసుకోవాల్సిందే..!

ముక్కు మూసుకోవాల్సిందే..!

సాక్షి, కడప: జిల్లాలోని అధిక శాతం పంచాయతీలు పారిశుధ్యలోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుధ్య సమస్య పంచాయతీలను పట్టిపీడిస్తోంది. కాదు... కాదు... ఈ సమస్యను పెంచిపోషిస్తున్నారు పంచాయతీ అధికారులు, పాలకులు. చాలా గ్రామాల్లో మురికి కాలువలు లేవు... ఉన్నవాటిలో పూడిక తీయకపోవడంతో అవి అస్తవ్యస్తంగా మారాయి. ఆ దారులలో నడవాలంటే ముక్కులు మూసుకోవాల్సిందే. పారిశుధ్యలోపంతో జ్వరాలు, అంటువ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. రెండేళ్లకు పైగా పంచాయతీలలో సర్పంచ్‌లు లేక ప్రత్యేకాధికారులు పాలన కొనసాగింది. ఈ కాలంలో పంచాయతీలో ఉన్న సమస్యలు చెప్పేందుకు కూడా బాధ్యులు లేరు.

 ప్రత్యేకాధికారులు ఏదైనా సమావేశం ఉన్నప్పుడు మినహా గ్రామాల్లో సందర్శించడం, పంచాయతీ సమస్యలను పరిష్కరించడం లాంటి చర్యలకు ఏనాడూ  ఉపక్రమించలేదు. దీంతో పంచాయతీలు మురికికూపాలుగా మారాయి. ఆస్తిపన్ను వసూలు చేయడంలో నిర్లక్ష్యం చూపని అధికారులు సమస్యలను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధచూప లేదు. ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కొత్త సర్పంచ్‌లు కొలువుదీరారు. అయితే వారు లక్షల రూపాయలు ఖర్చు చేసి సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. పంచాయతీ నిధులు వస్తే... తమ ఖర్చును పూడ్చుకోవాలని చూస్తున్నారే తప్ప పంచాయతీని బాగుచేద్దామని ఆలోచన చాలామందిలో కన్పించడం లేదు.
 
 పంచాయతీలకు రూ.15.05కోట్లు:
 ఈ ఏడాది పంచాయతీలకు రూ. 15.05 కోట్లు  మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ మొత్తం ట్రెజరీలో ఉంది. త్వరలోనే పంచాయతీల అకౌంట్‌కు చేరుతుంది. ప్రస్తుతం చెక్‌పవర్ అధికారం తిరిగి కట్టబెట్టడంతో వీటి ఖర్చు బాధ్యత పూర్తిగా సర్పంచ్‌లకే ఉంటుంది. సగటున  ప్రతి పంచాయతీకి దాదాపు 1.90 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మరి ఈ నిధులతో పల్లెల్లో పారిశుధ్యంతో పాటు ఇతర సమస్యలను ఏ మేరకు పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే!
 
 సమస్యలపై నిర్లక్ష్యం... ఆదాయంపై మక్కువ:
 పల్లెల్లో సమస్యలతో గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే పంచాయతీ అధికారులు మాత్రం సమస్యలు తీర్చకుండా ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఏడాది ఏప్రిల్ నుంచి ఆస్తిపన్నును 2శాతం అదనంగా వసూలు చేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఇతర చర్యల ద్వారా దాదాపు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 70కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని అర్జించే మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అద్దెకు ఇవ్వడం, లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించడం లాంటి చర్యలతో ఖజాను నింపుకోనున్నారు. ఇదే శ్రద్ధ పల్లెల్లో పారిశుధ్యంపై చూపాలని,  ప్రభుత్వ నిధులతో పాటు కొత్తగా చేకూరే ఆదాయాన్ని పల్లెల్లో ఖర్చు చేస్తే బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు.
 
 ఫొటోలో కన్పిస్తున్న దృశ్యం ఎర్రగుంట్ల మండలం టి.సుంకేసుల గ్రామంలోనిది. గ్రామంలో మురికి కాలువలతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి మురికినీటిని రోడ్డుపైకి వదులుతుంటారు. దీంతో ఈ రోడ్డు నిత్యం మురికినీటి కూపంగా ఉంటుంది. పైగా మంచినీటిపైపులు పగిలిపోయాయి.
 
 ఈ ఫొటోలో కన్పిస్తున్న  దృశ్యం రాజుపాళెం మండలం గాదెగూడురులోనిది. రోడ్డుపై కనిపిస్తున్న  మురికి నీరు రెండేళ్లుగా గ్రామాన్ని పట్టిపీడిస్తోంది. ఎప్పుడో తీసిన మురికికాలువలు పూర్తిగా పూడిపోయాయి. గ్రామస్తులు ఇళ్లలోని నీటిని రోడ్డుపైనే పారబోస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement