
సబ్బం చెప్పినవన్నీ అబద్ధాలే: ఆదిరెడ్డి అప్పారావు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయమై ఎంపీ సబ్బం హరి చెప్పినవన్నీ అబద్ధాలేనని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్పష్టం చేశారు. సబ్బం హరి చేసిన విమర్శలను గురువారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ దిగజారుడు డ్రామాలో మరో అంకమనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో ఆయన పావుగా ఉపయోగపడుతున్నారనే విషయూన్ని చెప్పకనే చెప్పాడన్నారు.
ఏఐసీసీ నుంచి ఆహ్వానం అందలేదంటూనే, అదే ఏఐసీసీ డ్రామాలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు నానా పాట్లూ పడ్డారని ఎద్దేవాచేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న కాంగ్రెస్‌లోనే కొనసాగడమే కాకుండా.. ఆ పార్టీ ఆడిస్తున్న వీధినాటకాల్లో తానెంతటి నీచపాత్రనరుునా పోషిస్తానని హైకమాండ్‌కు సంకేతాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాలోని ఒక తోకపత్రిక తన ఆత్మానందం కోసం పుట్టించుకున్న ఓ సర్వే అనే బిడ్డను సబ్బం తన భుజాలకు ఎత్తుకుని మోశారని విమర్శించారు.
కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీ తెలుగుదేశం, సబ్బం హరి చేరాలనుకుంటున్న సీఎం పార్టీల సత్తా ఏమిటో, ఆయనకు జనంలో ఉన్న ఇమేజీ ఏమిటో మరో నాలుగు నెలల్లో తేలిపోతుందని అన్నారు. రామోజీ పత్రికను మత గ్రంథాలతో పోల్చడం ద్వారా రామోజీరావే తనకు దేవుడని సబ్బం చెప్పకనే చెప్పుకున్నారని విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నినాదం కాదని.. విధానమని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలకు అసంతృప్తి ఉండే అవకాశం లేనేలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రేలాపనలు కట్టిపెట్టాలని సబ్బం హరిని అప్పారావు హెచ్చరించారు.