పంతానికి పసికూనల బలి
ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తానూ తనువు చాలించిన తండ్రి
పిల్లల కోసం భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు
వేర్వేరుగా వుంటున్న దంపతులు
ఫలించని పోలీసులు.. గ్రామస్తుల కౌన్సెలింగ్
స్పర్థల చిచ్చు ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. భర్తతోపాటు ముగ్గురు ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలను తీసేసింది. పరస్పర పంతం నలుగురి ప్రాణాలను అంతం చేసిందిన్నాయి.
కొయ్యూరు: మఠం బీమవరం పంచాయతీ చీడికోటలో అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న పాలగెడ్డ దేవకుమారీ, పక్కనన్న తూర్పుగోదావరి జిల్లా నుంచి వలసవచ్చి ఎం బీమవరంలో నివశిస్తున్న తూము గౌరీశంకర్‌లు(40)తో సహజీవనం చేస్తున్నారు. వారికి దుర్గప్రసాద్(7) సాయి(5)కుమారులున్నారు. మూడేళ్ల కూతురు ఉంది. కొన్ని నెలల కిందట ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలు తల్లివద్దే ఉండేవారు. కానీ వారు తనతో ఉండాలని శంకర్ పట్టుబట్టేవాడు. కొద్ది రోజులు అతని వద్దనే ఉంచుకున్నాడు. అయితే భార్య దేవకుమారి కొద్దిరోజుల తర్వాత పిల్లలను తన వద్దకు తీసుకుపోయింది. పిల్లలను తీసుకుపోయేందుకు భర్త వస్తే ఆమె మంప పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు వారికి కౌన్సెలింగ్ చేశారు. ఇద్దరూ కలిసి ఉండి పిల్లలను బాగా చూసుకోవాలని సూచించారు. రాజీ కుదరకుంటే తల్లి వద్దనే తగిన వయసు వచ్చేవరకూ ఉండాలని చెప్పారు. పెద్దకొడుకును తండ్రి వద్ద మిగిలిన ఇద్దరినీ తల్లి దగ్గర ఉంచాలని గ్రామస్తులు,పెద్దలు సూచించారు. దానికి ఇద్దరు అంగీకరించలేదు. దీంతో పిల్లలు దేవకుమారి వద్దే ఉన్నారు.
ఈనేపథ్యంలో తరచూ దేవకుమారి కొయ్యూరు వెళ్తూ పిల్లలను పట్టించుకోవడం లేదని శంకర్ వాపోయేవాడు. కొన్నాళ్ల తర్వాత వెళ్లి పిల్లలను తన వద్దకు తెచ్చుకున్నాడు. దీనిపై కోపగించిన దేవకుమారి వెళ్లి పిల్లలను తన ఇంటికి తీసుకొచ్చేసింది. దీంతో అతను రెండు నెలల పాటు పిల్లలు లేకుండానే ఒంటరిగా గడిపాడు. ఒక దశలో ఆమెతో రాజీకి వద్దామని విఫలయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బిడ్డలు దూరమవుతున్నారని మనస్థాపానికి గురయ్యాడు. భార్యలేని సమయం కోసం ఎదురు చూశాడు. సోమవారం భార్య కొయ్యూరు వెళ్లిందని తెలుసుకున్నాడు. శంకర్ మంగళవారం ఉదయం భార్య ఇంటికి చేరుకున్నాడు. ఇరుగుపొరుగు వారికి చెప్పి పిల్లలను తనతో తీసుకుపోయాడు. రాత్రి అతని వద్దనే ఉంచుకుని తెల్లవారుజామున పిల్లలకు విషమిచ్చి అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం భార్య వవచ్చేసరికి పిల్లలు లేరు. దీంతో ఇరుగుపొరుగు ద్వారా విషయం తెలుసుకుని భర్త ఇంటికి వచ్చి చూసేసరికి భర్తతో సహా పిల్లలు విగతజీవులై కనిపించారు..మృతదేహాల కోసం ఎం బీమవరానికి వై రామవరం అంబులెన్స్‌ను పంపామని పోలీసులు తెలిపారు. అడ్డతీగల ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.