పాపం పండుతోంది
నెల్లూరు సిటీ : పేదోళ్ల సొంతింటి కల తీర్చే ఉద్దేశంతో చేపట్టిన వైఎస్సార్‌నగర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి వరదలు ప్రారంభించిన వారి పాపం పండబోతోంది. సంబంధిత కాంట్రాక్టర్లు జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. అయితే రూ.కోట్లు కొల్లగట్టిన సబ్‌కాంట్రాక్టర్లు నిశ్చింతగా ఉండగా అసలు కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు శివారులోని కొత్తూరు సమీపంలోని వైఎస్సార్ నగర్ పేరుతో 2007లో భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం 6,468 ఇళ్లను పేదల కోసం నిర్మించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు మంజూరు చేశారు. ప్యాకేజీల వారీగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. అయితే అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. అప్పటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకా అనుచరులు సబ్‌కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఆర్జనే లక్ష్యంగా ఇళ్లను నాసిరకంగా నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యం కూడా తోడవడంతో తాకితే కూలిపోయేలా ఇళ్ల నిర్మాణం జరిగింది. సబ్‌కాంట్రాక్టర్లు ఇచ్చే పర్సంటేజీలకు కక్కుర్తి పడిన ప్రధాన కాంట్రాక్టర్లు వారు చెప్పిన చోటల్లా సంతకాలు చేసి బిల్లుల మంజూరులో సహకరించారు. ఇళ్ల నిర్మాణం నాసిరకంగా జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ శ్రీకాంత్ స్పందించారు. ఆర్‌అండ్‌బీ డీఈ స్థాయి
అధికారులతో తనిఖీలు జరిపించి, నివేదికలు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా 3,273 ఇళ్లకు శ్లాబు పూర్తయినట్లు, 248 ఇళ్లు శ్లాబు స్థాయిలో ఆగినట్లు, 1,806 లెంటిల్ లెవల్ , 738 పునాదుల స్థాయిలో ఉన్నట్లు, 403 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభం కానట్లు గుర్తించారు. వివిధ దశల్లో ఉన్న 1,700 ఇళ్ల నిర్మాణం నాసిరకంగా జరిగిందని, అవి నివాసయోగ్యం కాదని, వాటిని కూల్చి కొత్త ఇళ్లు నిర్మించాలని తేల్చారు. వీటిపై తీవ్రంగా స్పం దించిన కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు బనాయించాలని, రికవరీ చర్యలు చేపట్టాలని హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డిని ఆదేశించారు. అయితే పీడీ వెంకటేశ్వరరెడ్డి నేడో, రేపో బదిలీపై వెళ్లడం ఖాయమవడంతో ఆయన ఆ బాధ్యతలను ఈఈ నాగేశ్వరరావుకు అప్పగించారు. వివిధ బ్లాకులలో అక్రమాలకు కారకులైన 24 మంది కాంట్రాక్టర్ల జాబితాను సిద్ధం చేసిపోలీసులకు ఫిర్యాదు చేశారు. అయి తే అధికారికంగా ప్రధాన కాంట్రాక్టర్లే పను లు చేసి బిల్లులు పొందినట్లు రికార్డుల్లో ఉండడం తో వారిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వారి గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కోట్లు ఆర్జించిన సబ్‌కాంట్రాక్టర్లు మాత్రం నిశ్చింతగా ఉండడం గమనార్హం.
పోలీసుల మల్లగుల్లాలు
హౌసింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 24 మంది కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసేం దుకు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు ఈ కేసు తమ పరిధిలోకి వస్తుందా, వస్తే ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనే అంశాలపై న్యాయనిపుణులతో సంప్రది స్తున్నట్లు తెలిసింది.