అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, భద్రంపల్లి, కొట్టాలపల్లి, పాత చెదుళ్ల, కొత్త చెదుళ్ల తదితర 40 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి నియోజకవర్గం కళ్యాణదుర్గంలోని విట్లంపల్లి, హులికల్లు, కుర్లగుండ, నరసాపురం ప్రాంతాలకు దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అమాత్యుల నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా వందలాది గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. దీంతో వీరంతా సురక్షిత ప్రయాణానికి దూరమయ్యారు.
జిల్లాలోని 63 మండలాల్లో 3447 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 700 గామాలకు ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. అనంతపురానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామాలకు సైతం బస్సులు నడపడం లేదు. దీంతో ప్రజలు కాలినడకన లేకపోతే డీజిల్ ఆటోలు, మినీ వ్యాన్‌లలో కిక్కిరిసి వెళుతున్నారు.
ఆర్టీసీ అధికారులేమో రోడ్డు సౌకర్యం లేని, కలెక్షన్ రాని గ్రామాలకు తిప్పడం లేదని, అది కూడా 150 గ్రామాలేనని చెబుతున్నారు. కానీ ఆ సంఖ్య నాలుగు రెట్లకు పైగానే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అనంతపురం రీజియన్‌లో 953 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇందులో 130 సూపర్ డీలక్స్, 330 ఎక్స్‌ప్రెస్, 20 డీలక్స్, 473 పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నా.. కలెక్షన్ తగ్గిందనే సాకుతే అర్ధంతరంగా ఆపేస్తున్నారు.
డీజిల్ ఆటోలు, జీపులే దిక్కు... విద్యార్థులు, గ్రామస్తులు పట్టణ, మండల, జిల్లా కేంద్రానికి రావాలంటే డీజిల్ ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రైవేట్ వాహనాలు బాధ్యతారాహిత్యంగా తిప్పుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు.
ఆదాయాన్ని బట్టే తిప్పాల్సి వస్తోంది
జిల్లాలో కొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేని విషయం వాస్తవమే. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకునే బస్సులను తిప్పుతాం. దాదాపుగా 150 గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. అన్ని మండలాలకూ బస్సులు కవర్ చేస్తున్నాం.
- మధుసూదన్, డిప్యూటీ సీటీఎం ఆర్టీసీ, అనంతపురం
సురక్షిత ప్రయాణం సుదూరం
Published Mon, Dec 30 2013 3:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement