కుంగిపోయిన కొత్త రోడ్డు!
► ‘ సాక్షి’ ముందే హెచ్చరించినా మేలుకోని అధికారులు
► రోడ్డు పనులు పూర్తికాక ముందే ఈ పరిస్థితి
► ఆర్ అండ్ బీ ఆదేశాలు బేఖాతర్
► గతంలో ఇరిగేషన్ పనుల వల్లే దెబ్బతిన్న నాగాయలంక రోడ్డు
అవనిగడ్డ : కొద్దిరోజుల క్రితం వేసిన నాగాయలంక రోడ్డు వేకనూరు వద్ద కుంగిపోయింది. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదకర పరిస్థితిలో ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించినా అధికారుల్లో చలనం లేదు. దీంతో రూ.1.67 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త రోడ్డు పది రోజులకే కుంగిపోయింది.
అధికారులు స్పందించి ఉంటే..
ఆధునికీకరణ పనుల్లో భాగంగా గతంలో అవనిగడ్డ–కోడూరు, అవనిగడ్డ–నాగాయలంక మధ్య చేపట్టిన రిటైనింగ్ వాల్ పనుల వల్ల రెండు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులు పలుచోట్ల కుంగిపోయాయి. అధికారులు పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని గతంలో ‘సాక్షి’లో పలు ప్రత్యేక కథనాలు వచ్చిన విషయం విదితమే. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదు.
వేకనూరు–గుడివాకవారిపాలెం మధ్య ఇటీవల చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల వల్ల ప్రధాన రహదారికి పొంచిఉన్న ప్రమాదంపై ఈ నెల 4వ తేదీ ‘సాక్షి’లో ‘అదే నిర్లక్ష్యం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో రహదారి కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినా అధికారులు స్పందించక పోవడంతో పది రోజుల క్రితం రూ.1.97 కోట్లతో వేసిన తారురోడ్డు పెచ్చులుపెచ్చులుగా కుంగిపోయింది. ఈ రహదారి పనులు ఇంకా పూర్తికాక ముందే రోడ్డు కుంగిపోవడం కొసమెరుపు.
ఎస్‌ఈ ఆదేశాలు బేఖాతర్
గతంలో ఈ ప్రాంతంలో చేపట్టిన ఆధునికీకరణ పనుల వల్ల కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రధాన రహదారులు దెబ్బతిన్న విషయం ఇటీవలే రోడ్డు పనులను పరిశీలించడానికి వచ్చిన ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శేషుకుమార్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. దీంతో స్పందించిన ఎస్‌ఈ రోడ్డు పక్కన పనులు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అయినా సంబంధిత అ«ధికారులు స్పందించకపోవడం వల్లే ఈ రహదారి కుంగిపోయింది.
పనులు పూర్తయినా..
ఆధునికీకరణ పనుల్లో భాగంగా అవనిగడ్డ – నాగాయలంక మధ్య చేపట్టిన రిటైనింగ్ వాల్ పనులు పూర్తయినా ఖాళీలో ఇసుక నింపకపోవడం వల్ల రహదారి దెబ్బతింటోంది. ఏడాది క్రితం నిర్మించిన రిటైనింగ్ వాల్ పనులకు ఇసుకను తోలకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నా ఉన్నతాధికారులు చోద్యం చూడటం పట్ల ఈ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి దెబ్బతినకుండా ఆధునికీకరణ పనులను పర్యవేక్షణ చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.