అనంతపురం ఎడ్యుకేషన్: నిరక్షరాస్యులకు కనీస చదువు నేర్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్ మిషన్ పథకం కథ సమాప్తమైంది. మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లను తొలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షర భారత్ మిషన్ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో అదే తేదీ నుంచి మండల, గ్రామ కోఆర్డినేటర్లను తొలిగిస్తున్నట్లు సాక్షరభారత్ మిషన్ డైరెక్టర్ అమ్మాజీరావు ఉత్తర్వులు జారీ చేశారు. మండలానికో కోఆర్డినేటర్‌తోపాటు ప్రతి పంచాయతీలో ఒకరిద్దరిని గ్రామ కోఆర్డినేటర్లను నియమించారు. ఈ క్రమంలో జిల్లాలో 60 మంది మండల కోఆర్డినేటర్లు, 1080 మంది గ్రామ కోఆర్డినేటర్లు పని చేస్తున్నారు. ఒక్కో గ్రామ కోఆర్డినేటర్ పరిధిలో ఐదుగురిని వలంటీర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా నిరక్షరాసులకు చదువు నేర్పాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మండల కోఆర్డినేటర్లకు రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు రూ. 2 వేలు వేతనం ఇస్తున్నారు.
వస్తు సామగ్రి పాఠశాలల్లో అప్పగించాలి
గ్రామ కోఆర్డినేటర్లకు ఇదివరకే ఫర్నిచర్, పుస్తకాలు తదితర వస్తువులను ప్రభుత్వం సరఫురా చేసింది. ఇవన్నీ ఆయా గ్రామ కోఆర్డినేటర్లు సమీపంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అప్పగించి అక్నాలడ్జ్‌మెంట్ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా జిల్లాలో 14 మంది సూపర్‌వైజర్లు పని చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వ ఉపాధ్యాయులే. విద్యాశాఖ నుంచి సాక్షరభారత్ మిషన్‌కు బదిలీపై వచ్చారు. పథకం రద్దు కావడంతో వీరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
జీతాల బకాయి పేచీ
మండల, గ్రామ కోఆర్డినేటర్ల జీతాల మంజూరుపై పేచీ నెలకొంది. వాస్తవానికి మార్చి 31 నాటికి గడువు ముగిసినా ఏప్రిల్, మే నెలల్లో కూడా వీరితో పని చేయించారు. ఇప్పుడేమో మార్చి 31 వరకు మాత్రమే జీతాలు (ఆర్నెళ్ల బకాయిలు) చెల్లించాలంటూ డైరెక్టరు ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఏప్రిల్, మే జీతాలపై కోఆర్డినేటర్లు ఆందోళన చెందుతున్నారు. పైగా కొనసాగిస్తామంటూ రెణ్నెళ్ల పాటు పని చేయించుకుని ఇప్పుడేమో తొలిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారంటూ వాపోతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి
మార్చి 31 నాటికే సాక్షరభారత్ మిషన్ పథకం ముగిసింది. మండల, గ్రామ కోఆర్డినేటర్లను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి వారిని అలాగే కొనసాగిస్తూ వచ్చాం. అయితే వారిని తొలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా గ్రామ కోఆర్డినేటర్ల వద్ద ఉన్న వివిధ వస్తువులను సమీప పాఠశాలకు అప్పగించాలి. –ఉమాదేవి డీడీ సాక్షరభారత్
Comments
Please login to add a commentAdd a comment