బెజవాడ ఎండల్లో తిరిగా.. | sakshi 'Miss America' Nina davuluri interview | Sakshi
Sakshi News home page

బెజవాడ ఎండల్లో తిరిగా..

Published Thu, Jan 1 2015 10:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

బెజవాడ ఎండల్లో తిరిగా..

బెజవాడ ఎండల్లో తిరిగా..

  • భారతీయ అలవాట్లు, సంస్కృతే గెలిపించాయి       
  •  జాత్యహంకార వ్యాఖ్యలకు జంకలేదు
  •  మహిళా సాధికారతకు ప్రణాళికలున్నాయి            
  •  సినిమాలు చూసే తీరిక లేదు..
  •  సాక్షితో ‘మిస్ అమెరికా’ నీనా దావులూరి
  • అందాల పోటీలంటే ఇష్టంలేని విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చిన ఆమెను అనూహ్యంగా ‘మిస్ అమెరికా’ కిరీటం వరించింది. ఓ భారతీయ యువతి.. అందులోనూ తెలుగమ్మాయి ఈ స్థాయి విజయాన్ని అందుకోవడంతో దేశం యావత్తూ సంబరాల్లో మునిగింది. దీన్ని జీర్ణించుకోలేని జాత్యహంకారులు ఎక్కుపెట్టిన విమర్శలకు ఆమె జంకలేదు. అన్ని వైపుల నుంచి వెల్లువెత్తిన అభినందనలతో ఆ వ్యాఖ్యలను తేలిగ్గాతీసుకున్నారు అందాలరాణి నీనా దావులూరి. మిస్ అమెరికాగా ఎంపికైన తర్వాత తొలిసారిగా స్వస్థలం విజయవాడ వచ్చిన ఆమె  ‘సాక్షి’తో ముచ్చటించారు.
     
    సాక్షి : భారతీయ మూలాలున్న మీరు మిస్ అమెరికాగా ఎంపికవడం ఎలా సాధ్యమైంది?
    నీనా: నాకు చిన్నప్పటి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ వంటబట్టాయి. సాధించాలనే పట్టుదలతో కష్టపడ్డా. మిస్ అమెరికాకు ముందు మిస్ న్యూయార్క్‌గా ఎంపికయ్యా. 2014లో 94వ మిస్ అమెరికాగా ఎంపికయ్యా. ఆ బాధ్యతలను ఆనందంగా నిర్వర్తించా. కొద్ది రోజుల్లో నా బాధ్యత పూర్తవుతుంది. నా పనిని సక్రమంగా నిర్వర్తించడం సంతృప్తినిచ్చింది.
     
    సాక్షి : మీకు ఆదర్శం ఎవరు?
    నీనా: నా కుటుంబమే నాకు బలం, ఆదర్శం. మా కుటుంబంలో ఎంతో మంది గొప్పవాళ్లున్నారు. మా అమ్మమ్మ కోటేశ్వరమ్మ మాంటిస్సోరి విద్యా సంస్థలు నడుపుతూ ఇప్పటికీ మా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమెతోపాటు మా అమ్మ, అక్క, ఇతర కుటుంబ సభ్యులంతా నన్ను ఎంతో ప్రోత్సహించారు.
     
    సాక్షి : విద్యావేత్త అయిన మీ అమ్మమ్మ అందాల పోటీలకు వ్యతిరేకమని గతంలో చెప్పారు. మరి మీరు మిస్ అమెరికా పోటీల్లో ఎలా పాల్గొన్నారు?
    నీనా: మిస్ అమెరికా అంటే మోడల్ కాదు. చాలా మంది మిస్ అమెరికా అంటే గ్లామర్, లైఫ్ స్టైల్ అనుకుంటారు. అసలు విషయం ఏమిటంటే ఇది సేవకు సంబంధించిన సంస్థ. అందులో అందానిది చాలా తక్కువ  పాత్ర. ఈ పోటీ ప్రధానంగా స్పీకింగ్, కమ్యూనికేషన్, విద్యా సేవకు సంబంధించినది. మిగిలిన అందాల పోటీలకు, మిస్ అమెరికాకు చాలా తేడా ఉంది. దీని తర్వాత మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలకు వెళ్లే అవకాశం ఉండదు. దీనికి ఎంపికైన తర్వాత అనేక సంస్థలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
     
    సాక్షి : ఒక భారతీయురాలు మిస్ అమెరికాగా ఎంపికవడాన్ని అమెరికన్లు ఎలా స్వీకరించారు? అప్పట్లో మీపై కొందరు జాత్యహంకార వ్యాఖ్యలు కూడా చేశారు కదా?
    నీనా: అలాంటి వ్యాఖ్యలతో కొంత బాధపడ్డా. వాటికంటే నన్ను అభినందించిన వారే చాలా ఎక్కువ మంది. పలు రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలతోపాటు అన్ని వైపుల నుంచి నాకు మద్దతు లభించడంతో ఆ వ్యాఖ్యలను పట్టించుకోలేదు. అభినందించిన వారి మద్దతుతో ముందుకెళ్లి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నా. నా బాధ్యతలను నెరవేర్చా.
     
    సాక్షి : సినిమాలు చూస్తారా?
    నీనా: నాకు సినిమాలు చూసేంత సమయం లేదు.
     
    సాక్షి : మోడలింగ్ సినీ రంగానికి తొలి మెట్టు అంటారు. సినిమాల్లో నటించాలనే ఆలోచన ఉందా?
    నీనా: లేదు. నాకు సినిమాలపై అస్సలు ఆసక్తి లేదు
     
    సాక్షి : గతంలో భారత్‌కు ఎప్పుడొచ్చారు? విజయవాడ ఎలా ఉంది?
    నీనా: ఐదేళ్ల క్రితం వచ్చా. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. నేను చిన్నప్పుడు పెరిగిన నా ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి రోడ్లపైనే ఎండల్లో తిరిగా. గతంలో ప్రతి వేసవికి ఇక్కడికే వచ్చేదాన్ని. కూచిపూడి నృత్యం నేర్చుకున్నా. మన దేశ సంస్కృతి అంటే ఇష్టం. ఈ అలవాట్లు, సంస్కృతే మిస్ అమెరికాగా ఎంపికవడానికి దోహదపడింది. నాకు దక్కిన ఖ్యాతితో భారత్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా.
     
    సాక్షి : మీ లక్ష్యం ఏమిటి?
    నీనా: ఎంబీఏ పూర్తి చేస్తా. అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి స్పెషలైజేషన్ చేయాలి. భారత్, అమెరికాలో సేవా రంగంపై దృష్టి పెడతా. మహిళా సాధికారతకు సంబంధించి కొంత ప్రణాళిక  నా వద్ద ఉంది.
     
    సాక్షి : భారత్‌లో ఇటీవల మహిళలపై వేధింపులు, లైంగికదాడులు పెరగడంపై మీరెలా స్పందిస్తారు?
    నీనా: మహిళలకు పూర్తి భద్రత కావాలి. దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement