Nina Davuluri
-
బెజవాడ ఎండల్లో తిరిగా..
భారతీయ అలవాట్లు, సంస్కృతే గెలిపించాయి జాత్యహంకార వ్యాఖ్యలకు జంకలేదు మహిళా సాధికారతకు ప్రణాళికలున్నాయి సినిమాలు చూసే తీరిక లేదు.. సాక్షితో ‘మిస్ అమెరికా’ నీనా దావులూరి అందాల పోటీలంటే ఇష్టంలేని విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చిన ఆమెను అనూహ్యంగా ‘మిస్ అమెరికా’ కిరీటం వరించింది. ఓ భారతీయ యువతి.. అందులోనూ తెలుగమ్మాయి ఈ స్థాయి విజయాన్ని అందుకోవడంతో దేశం యావత్తూ సంబరాల్లో మునిగింది. దీన్ని జీర్ణించుకోలేని జాత్యహంకారులు ఎక్కుపెట్టిన విమర్శలకు ఆమె జంకలేదు. అన్ని వైపుల నుంచి వెల్లువెత్తిన అభినందనలతో ఆ వ్యాఖ్యలను తేలిగ్గాతీసుకున్నారు అందాలరాణి నీనా దావులూరి. మిస్ అమెరికాగా ఎంపికైన తర్వాత తొలిసారిగా స్వస్థలం విజయవాడ వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. సాక్షి : భారతీయ మూలాలున్న మీరు మిస్ అమెరికాగా ఎంపికవడం ఎలా సాధ్యమైంది? నీనా: నాకు చిన్నప్పటి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ వంటబట్టాయి. సాధించాలనే పట్టుదలతో కష్టపడ్డా. మిస్ అమెరికాకు ముందు మిస్ న్యూయార్క్‌గా ఎంపికయ్యా. 2014లో 94వ మిస్ అమెరికాగా ఎంపికయ్యా. ఆ బాధ్యతలను ఆనందంగా నిర్వర్తించా. కొద్ది రోజుల్లో నా బాధ్యత పూర్తవుతుంది. నా పనిని సక్రమంగా నిర్వర్తించడం సంతృప్తినిచ్చింది. సాక్షి : మీకు ఆదర్శం ఎవరు? నీనా: నా కుటుంబమే నాకు బలం, ఆదర్శం. మా కుటుంబంలో ఎంతో మంది గొప్పవాళ్లున్నారు. మా అమ్మమ్మ కోటేశ్వరమ్మ మాంటిస్సోరి విద్యా సంస్థలు నడుపుతూ ఇప్పటికీ మా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమెతోపాటు మా అమ్మ, అక్క, ఇతర కుటుంబ సభ్యులంతా నన్ను ఎంతో ప్రోత్సహించారు. సాక్షి : విద్యావేత్త అయిన మీ అమ్మమ్మ అందాల పోటీలకు వ్యతిరేకమని గతంలో చెప్పారు. మరి మీరు మిస్ అమెరికా పోటీల్లో ఎలా పాల్గొన్నారు? నీనా: మిస్ అమెరికా అంటే మోడల్ కాదు. చాలా మంది మిస్ అమెరికా అంటే గ్లామర్, లైఫ్ స్టైల్ అనుకుంటారు. అసలు విషయం ఏమిటంటే ఇది సేవకు సంబంధించిన సంస్థ. అందులో అందానిది చాలా తక్కువ పాత్ర. ఈ పోటీ ప్రధానంగా స్పీకింగ్, కమ్యూనికేషన్, విద్యా సేవకు సంబంధించినది. మిగిలిన అందాల పోటీలకు, మిస్ అమెరికాకు చాలా తేడా ఉంది. దీని తర్వాత మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలకు వెళ్లే అవకాశం ఉండదు. దీనికి ఎంపికైన తర్వాత అనేక సంస్థలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. సాక్షి : ఒక భారతీయురాలు మిస్ అమెరికాగా ఎంపికవడాన్ని అమెరికన్లు ఎలా స్వీకరించారు? అప్పట్లో మీపై కొందరు జాత్యహంకార వ్యాఖ్యలు కూడా చేశారు కదా? నీనా: అలాంటి వ్యాఖ్యలతో కొంత బాధపడ్డా. వాటికంటే నన్ను అభినందించిన వారే చాలా ఎక్కువ మంది. పలు రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలతోపాటు అన్ని వైపుల నుంచి నాకు మద్దతు లభించడంతో ఆ వ్యాఖ్యలను పట్టించుకోలేదు. అభినందించిన వారి మద్దతుతో ముందుకెళ్లి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నా. నా బాధ్యతలను నెరవేర్చా. సాక్షి : సినిమాలు చూస్తారా? నీనా: నాకు సినిమాలు చూసేంత సమయం లేదు. సాక్షి : మోడలింగ్ సినీ రంగానికి తొలి మెట్టు అంటారు. సినిమాల్లో నటించాలనే ఆలోచన ఉందా? నీనా: లేదు. నాకు సినిమాలపై అస్సలు ఆసక్తి లేదు సాక్షి : గతంలో భారత్‌కు ఎప్పుడొచ్చారు? విజయవాడ ఎలా ఉంది? నీనా: ఐదేళ్ల క్రితం వచ్చా. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. నేను చిన్నప్పుడు పెరిగిన నా ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి రోడ్లపైనే ఎండల్లో తిరిగా. గతంలో ప్రతి వేసవికి ఇక్కడికే వచ్చేదాన్ని. కూచిపూడి నృత్యం నేర్చుకున్నా. మన దేశ సంస్కృతి అంటే ఇష్టం. ఈ అలవాట్లు, సంస్కృతే మిస్ అమెరికాగా ఎంపికవడానికి దోహదపడింది. నాకు దక్కిన ఖ్యాతితో భారత్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా. సాక్షి : మీ లక్ష్యం ఏమిటి? నీనా: ఎంబీఏ పూర్తి చేస్తా. అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి స్పెషలైజేషన్ చేయాలి. భారత్, అమెరికాలో సేవా రంగంపై దృష్టి పెడతా. మహిళా సాధికారతకు సంబంధించి కొంత ప్రణాళిక నా వద్ద ఉంది. సాక్షి : భారత్‌లో ఇటీవల మహిళలపై వేధింపులు, లైంగికదాడులు పెరగడంపై మీరెలా స్పందిస్తారు? నీనా: మహిళలకు పూర్తి భద్రత కావాలి. దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. -
తెలుగుతేజం నీనా దావులూరి యాంకరింగ్
మోదీ ప్రసంగానికి ముందు మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు భారత సంతతికి చెందిన తెలుగుతేజం, మిస్ అమెరికా-2014 విజేత నీనా దావులూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. భారతీయ అమెరికన్, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీతోపాటు పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను సభకు పరిచయం చేశారు. ఆమెకు భారత సంతతి యాంకర్ హరి శ్రీనివాసన్ సహకారం అందించారు. -
నీనా దావులూరితో హద్దుమీరిన విద్యార్థి
సస్పెండ్ చేసిన స్కూలు యాజమాన్యం న్యూయార్క్: తెలుగు సంతతికి చెందిన అమెరికా అమ్మాయి, మిస్ అమెరికా నీనా దావులూరితో హద్దుమీరి మాట్లాడిన విద్యార్థిని ఆ స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేసింది. పెన్సిల్వేనియాలోని ఒక స్కూల్ సందర్శనకు వెళ్లినపుడు 18 ఏళ్ల ఆ ఆకతాయి పాట్రిక్ ఫర్వెస్ తనతో డేటింగ్ చేయాల్సిందిగా నీనాను కోరాడు. ఆ పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ముఖాముఖి ప్రశ్నావళి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ విద్యార్థి ఒక ప్లాస్టిక్ గులాబీ పువ్వుతో స్టేజిపైకి వచ్చి ఆ ప్రతిపాదన చేశాడు. ఇది విన్న వెంటనే 24 ఏళ్ల నీనా ఆశ్చర్యపోయి.. తర్వాత దరహాసం చేస్తూ ఉండిపోయింది. ఈ ఆకతాయి చేష్టను ఆ పాఠశాల యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఆ విద్యార్థిని మూడురోజుల పాటు సస్పెండ్ చేసింది. ఆ విద్యార్థి తమ మాటను లెక్కచేయకుండా ప్రవర్తించాడని యాజమాన్యం చెప్పింది. ఆ విద్యార్థి మాట్లాడుతూ.. కొంత మంది ఒత్తిడి చేయడం వల్లే తానీపని చేశానని చెప్పాడు. ఆ తర్వాత క్షమాపణ కోరుతూ అధికారులకు లేఖ రాశాడు. -
మిస్ న్యూజెర్సీగా భారత సంతతి యువతి
వాషింగ్టన్: మిస్ న్యూజెర్సీ యూఎస్ 2014 కిరీటాన్ని 18 ఏళ్ల ఇండియన్ అమెరికన్ ఎమిలి షా గెల్చుకుంది. తెలుగు అమ్మాయి నీనా దావులూరి మిస్ అమెరికా ఎంపికయి చరిత్ర సృష్టించి నెల రోజులు పూర్తవగానే మరో ప్రవాస భారత యువతి అగ్రరాజ్య అందాల పోటీలో విజేతగా నిలవడం విశేషం. ఎన్నారైలు అత్యధికంగా నివాసముంటున్న ఎడిసన్ ప్రాంతానికి చెందిన ఎమిలి షా 130 పోటీదారులను అధిగమించి మిస్ న్యూజెర్సీగా ఎంపికయింది. మిస్ అమెరికా, మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె పాల్గొననుంది. మిస్ టీన్ వరల్డ్ 2012 పోటీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. పలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనూ ఆమె నటించింది. ఎమిలి షా తండ్రి ప్రశాంత్ షాకు బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. -
ఒబామాను కలిసిన నీనా దావులూరి
వాషింగ్టన్: మిస్ అమెరికా కిరీటాన్ని ఇటీవల దక్కించుకున్న తెలుగమ్మాయి నీనా దావులూరి బుధవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకున్నారు. ఓవల్ ఆఫీసులో కొద్దిసేపు ఒబామాతో ముచ్చటించారు. చిల్డ్రన్ మిరకిల్ నెట్వర్క్ హాస్పిట్ చాంపియన్స్ గౌరవార్థం ఒబామాతో కలసి ఒక గ్రూప్ ఫొటో తీయించుకున్నారు. అధ్యక్షుడు ఒబామాతో తన భేటీపై నీనా దావులూరి ‘ట్విట్టర్’ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. -
బ్రేక్ అడిగింది...ఓకే అన్నారు..!
ప్రపంచంలో చాలా దేశాలకు... అమెరికా నచ్చదు, అందాలపోటీలూ నచ్చవు. దెన్, ‘మిస్ అమెరికా’ నీనా మాత్రం ఎందుకు నచ్చాలి? నచ్చాలి. నచ్చింది కూడా! ఎందుకంటే - నీనా... మన అమ్మాయి అని కాదు. నీనా... అమెరికా అమ్మాయిల్ని బీట్ చేసిందని కాదు. నీనా... పోటీల కోసం బరువు తగ్గిందని కాదు. పాశ్చాత్య అందాల వేదికపై - తనను కాకుండా, తన దేశ సౌందర్యాన్ని ప్రదర్శించింది నీనా! తనకు కాకుండా, భారతీయ సంస్కృతికి, భారతీయ తత్వజ్ఞతకు... కిరీటం పెట్టించుకుంది నీనా! కథక్ డాన్సర్‌గా... ఆమె ఇచ్చిన రెండిషన్కు క్వశ్చన్‌కు ఆన్సర్‌గా... ఆమె ఇచ్చిన డెఫినిషన్కుఅమెరికా ఫ్లాట్ అయిపోయింది. పాతికేళ్లయినా లేని ఈ అంతస్సౌందర్యరాశికి ఇంతటి పరిణతి ఎక్కడిది? ఆమెను మలిచిన పెంపకం ఎలాంటిది? ఇదే ఈవారం మన ‘లాలిపాఠం’. అందానికి నిర్వచనం ఏమిటి? అమెరికా వేదిక మీద నీనా దావులూరి చెప్పిన సమాధానమే అసలైన అందం. అందాన్ని కొలిచే కొలమానం ఉందా? ఉందనే అనుకుంటున్నాయి ఈ పోటీలను నిర్వహించే సంస్థలు. అంతటితో ఆగకుండా గీటుపెట్టి నిర్ణయిస్తామంటూ ప్రశ్నావళిని కూడా తయారుచేశాయి. మానసిక స్థయిర్యం, కృషి, పట్టుదల, విశాలదృక్పథం, సమయస్ఫూర్తి, మాటతీరు, మానసిక వికాసం... ఇలా ఎన్నో అంశాల సుమహారమే అసలైన అందం అన్నారు నిర్వహకులు. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయంటూ ముందడుగు వేసింది నీనా దావులూరి. భారతీయ మూలాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని కొనసాగిస్తూ పాశ్చాత్య భావజాలం మధ్య పెరిగిన అమ్మాయి నీనా. ఆమెలో ఆత్మవిశ్వాసం ఉండాల్సినంత ఉంది. ఇందుకు మిస్ అమెరికా పోటీలో అందాన్ని విశ్లేషిస్తూ ఆమె చెప్పిన సమాధానమే గీటురాయి. ఈ అమ్మాయిని ఎలా తీర్చిదిద్ది ఉంటారు ఆ అమ్మానాన్నలు? నీనా అమ్మ షీలారంజని, నాన్న ధనకోటేశ్వరచౌదరి పిల్లల పెంపకంలో పాటించిన విలువలేంటి? ఈ వివరాలను విజయవాడలో ఉన్న నీనా అమ్మమ్మ కోటేశ్వరమ్మ, పెద్దమ్మ డాక్టర్ శశిబాల ఇలా చెప్తున్నారు. మా చెల్లి కోరినట్లే..! ‘‘మా చెల్లి, మరిది గారు అమెరికాలో స్థిరపడ్డారు. నీనా అమెరికాలోనే పుట్టింది. అయితే రెండవ నెల నుంచి రెండేళ్లు నా దగ్గరే ఇండియాలో పెరిగింది. మా చెల్లెలు పిల్లల పెంపకం విషయంలో కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. పిల్లల్ని ఏటా ఇండియాకి పంపిస్తూ ‘వీళ్లకు ఈ వెకేషన్లో కూచిపూడి, భరతనాట్యం వంటివి నేర్పించు, మన నేటివిటీ తెలిసేలా చెయ్యి’ అని చెప్పేది. తాను కోరినట్లే పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి నేర్పించాం’’ అని శశిబాల చెప్తుండగా కోటేశ్వరమ్మగారు మాట్లాడుతూ ‘‘ఇక్కడ మొదలు పెట్టిన డాన్సుని ఇక్కడితోనే వదిలేయలేదు మా మనుమరాళ్లు. అమెరికా వెళ్లి అక్కడ స్కూల్ ప్రోగ్రాముల్లో లంబాడీ డాన్సు వంటివి ప్రదర్శించారు. మా చిన్నమ్మాయి పిల్లల్ని సాయంత్రం డాన్సు క్లాసులకు తీసుకెళ్లేది. తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదయ్యేది. పిల్లలిద్దరూ అమెరికాలోనే పియానో, క్లారినెట్ కూడా నేర్చుకున్నారు. గుజరాతీ వాళ్ల దగ్గర కథక్ కూడా నేర్చుకుంది నీనా. మిస్ అమెరికా పోటీల్లో వేదిక మీద ప్రదర్శించింది కథక్ బాణీనే. మనవాళ్ల పెళ్లిళ్లలో నాట్యం చేసేది. నీనాకి డాన్సంటే అంత ఇష్టం. మిస్ అమెరికా పోటీల్లో ఇష్టమైన కళ ఏదంటే డాన్స్ అనే చెప్పింది. అందుకే నాట్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చారు’’ అన్నారు. ఒక్క ఏడాది టైమిస్తే..! ఈ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. ఈ నేపథ్యంలో పిల్లలకు నేర్పిన విలువల గురించి శశిబాల మాట్లాడుతూ... ‘‘చిన్నప్పటినుంచి మీనా, నీనా ఇద్దరికీ పుస్తకాలు చదివే అలవాటు చేశాం. ఏ విషయాన్ని అయినా నిశితంగా, లోతుగా అధ్యయనం చేస్తారు. వీళ్లలో తాము తెలుసుకున్న విషయాన్ని చక్కగా ఆచరణలో పెట్టగలిగిన నేర్పు కూడా ఉంది. వాళ్లతో ఏ టాపిక్ చర్చించినా పరిణితితో మాట్లాడుతారు. పెద్దమ్మాయి మీనాకి ఎంతటి భూతదయ అంటే... ‘ఒక ప్రాణిని చంపే హక్కు ఎవరిచ్చారు’ అంటుంది, మాంసాహారం తినదు. పిల్లల్ని ఇలా తీర్చిదిద్దడంలో మా చెల్లి పాత్ర ఎక్కువనిపిస్తుంది నాకు. చిన్నప్పుడు మా చెల్లి కూడా చాలా చురుగ్గా ఉండేది. అదే పిల్లలకూ వచ్చింది. దానికి తోడుగా వాళ్లు పెరిగిన పెద్ద ప్రపంచం చాలా దోహదం చేసింది. ఒక వ్యక్తిలో పరిణతి, వ్యక్తిత్వ వికాసం వంటివి వారి పరిసరాలు, ఎక్స్పోజర్ను మీద ఆధారపడి ఉంటాయి. అమెరికాలో స్కూళ్లలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ. ప్రతి విద్యార్థీ పాల్గొనేటట్లు చేస్తారు. మీనా కూడా పీజంట్ పోటీల్లో పాల్గొని గెలిచింది. తర్వాత తను పూర్తిగా చదువులోనే నిమగ్నమైంది. నీనా మాత్రం ఒక ఏడాది టైమిస్తే ఈ పోటీల్లో పాల్గొని ఆ తర్వాత మెడిసిన్ చేస్తానని అడిగింది వాళ్ల అమ్మానాన్నల్ని. సరదా పడుతోంది కదా అని సరేనన్నారు మా చెల్లి, మరిదిగారు’’ అన్నారు. తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ! పాశ్చాత్య సమాజంలో పిల్లల్ని తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర, తల్లిదండ్రుల నడవడి గురించి చెబుతూ ‘‘అక్కడ పేరెంట్స్ మీట్‌కి పేరెంట్స్ తప్పనిసరిగా హాజరవుతారు. చదువు, విద్యేతర కార్యక్రమం గురించి ‘ఫలానా వస్తువు పంపించాల’ంటే పంపించి తీరుతారు. అంత క్రమశిక్షణ పాటిస్తారు తల్లిదండ్రులు. అదే పిల్లలకూ అలవాటవుతుంది’’ అన్నారు కోటేశ్వరమ్మ. కుటుంబం ప్రభావమే ఎక్కువ! పిల్లలు ఏ సమాజంలో పెరిగినా మొదటగా ప్రభావం చూపించేది కుటుంబమేనంటారు కోటేశ్వరమ్మ. ‘‘అమెరికాలో ఉన్న భారతీయులు ప్రార్థనలు, సత్సంగాలు నిర్వహిస్తుంటారు. మా చిన్నమ్మాయి ఆ కార్యక్రమాలకు పిల్లల్ని కూడా తీసుకెళ్లేది. వీళ్లంతా అనాథలకోసం భోజనం తీసుకెళ్లి ఇచ్చేవారు. ఓల్డేజ్ హోమ్స్‌కి వెళ్లి పాటలు పాడి వాళ్లకు వినోదాన్ని పంచడం కూడా అలాగే అలవాటైంది నీనాకి. అలాగని ఆధ్యాత్మికమే జీవితంగా పెరిగారని కాదు. డైలీ రొటీన్ అక్కడి సమాజంలో ఉన్నట్లే’’ అన్నారామె. నీనా మిస్ అమెరికా పోటీ కోసం ఆహారపు అలవాట్లు మార్చుకోవడాన్ని చెప్తూ ‘‘బరువు తగ్గిన మాట వాస్తవమే కానీ విపరీతమైన లావు లేదు. నీనాకు చాక్లెట్లు చాలా ఇష్టం. బరువు తగ్గడం కోసం పట్టుబట్టి మరీ చాక్లెట్లు మానేసింది. వాళ్ల అమ్మ కూడా బరువు పెరగనివ్వని వంటలనే చేసేది’’ అన్నారు కోటేశ్వరమ్మ. తనకు తానుగానే..! మిస్ అమెరికా పోటీలలో గెలవడానికి నీనా తనకు తానే అన్నీ సమకూర్చుకున్నదంటారు శశిబాల. ‘‘డ్రస్‌లు డిజైన్ చేసుకోవడంలో వాళ్ల అమ్మ, అక్క సహాయం చేశారు. పేరెంట్స్ చేసిందల్లా నీనాకి కావల్సిన వనరులు సమకూర్చడం, మోరల్ సపోర్టుతో ప్రోత్సహించడమే. అభిరుచిని కూడా క్రమశిక్షణతో చేయాలనుకోవడమే నీనా విజయరహస్యం’’ అన్నారు శశిబాల. ఇరవై నాలుగేళ్ల అమ్మాయి... ‘సౌందర్యం అంటే పై మెరుగులతో వచ్చేది కాదు, పుట్టుకతో వచ్చిన దానిని యథాతథంగా స్వీకరించడమే అని, అంతర్లీనంగా ఉన్న మానసిక పరిణితే అసలైన సౌందర్యం’ అనీ న్యాయనిర్ణేతలకు చెప్పింది. పదాలు వేరైనా ఇదే భావాన్ని మన జ్ఞానులు చెప్పారు. డాక్టర్ శశిబాల, కోటేశ్వరమ్మ చెప్పిన మాటలు వింటే భారతీయ తత్వజ్ఞానాన్ని అగ్రవేదిక మీద ప్రకటించగలిగిన ఆత్మవిశ్వాసం నీనాకు తల్లిదండ్రుల పెంపకంలోనే వచ్చిందనిపించింది. - వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి ఫొటోలు: ఎం. ఆర్. మోహన్, విజయవాడ నీనా గురించి...మిస్ అమెరికా అంతకుముందు... మిస్ న్యూయార్క్, మిస్ సెరిక్యూజ్. మిస్ అమెరికా అవుట్‌స్టాండింగ్ టీన్ - 2007 పోటీలో రెండవస్థానం -
ఒబామా, మన్మోహన్‌ల విందుకు నీనా దావులూరి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 27న శ్వేతసౌధంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఇస్తున్న విందుకు మిస్ అమెరికా కిరీటం గెలుచుకున్న ప్రవాస తెలుగు అందగత్తె నీనా దావులూరి(24)ని ఆహ్వానించే అవకాశం ఉందని మాజీ దౌత్యాధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల కృషికి గుర్తింపుగా నీనాకు అవకాశం దక్కనుంది. మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న తొలి భారతీయ అమెరికన్ యువతిగా నీనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ‘అమెరికా పురోగతిలో ప్రవాస భారతీయులు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. అమెరికా స్పెల్లింగ్ బీ అవార్డును చాలాసార్లు సాధించారు. ఇప్పుడు మిస్ అమెరికా కిరీటాన్ని కూడా. నీనా బాలీవుడ్ తరహా నృత్యాలను అమెరికాకు పరిచయం చేశారు’ అని ఆ అధికారి తెలిపారు. మన్మోహన్సింగ్ ఈనెల 27న వాషింగ్టన్లో ఒబామాతో సమావేశం కానున్నారు. అనంతరం విందు ఏర్పాటుకానుంది. మరోవైపు నీనా ఇంటర్వ్యూ కోసం గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయ మీడియా నుంచి అభ్యర్థనలు అందుతున్నట్లు మిస్ అమెరికా పోటీ నిర్వాహకులు తెలిపారు. కొద్ది నెలల్లో నీనా భారత్‌లో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. -
ప్రభాస్ అంటే ఇష్టం: నీనా దావులూరి
తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని మిస్ అమెరికా కిరీటం సొంతం చేసుకున్న ప్రవాస తెలుగు యువతి నీనా దావులూరి చెప్పారు. 2007లో తాను 'వర్షం' సినిమా చూశానని వెల్లడించారు. ప్రభాస్ అంటే తనకెంతో అభిమానమని, ఆయన నటనను ఇష్టపడతానని తెలిపారు. భవిష్యత్‌లో కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నానని చెప్పారు. తానెంతో ఇష్టపడి నేర్చుకున్న భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను వదలబోనని స్పష్టం చేశారు. మిస్ అమెరికా కిరీటం గెలుపొందడం నిజంగా తనకు దక్కిన గొప్ప గౌరవమని ఏబీసీ చానల్ గుడ్‌మార్నింగ్ అమెరికా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మాట్లాడుతూ నీనా దావులూరి చెప్పారు. సోషల్ మీడియాలో తనపై కొందరు జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడంపై స్పందిస్తూ... తానెప్పుడూ ముందుగా అమెరికన్ననే భావనతోనే ఉండేదాన్నని చెప్పారు. తన భారతీయ వారసత్వంపై వచ్చిన విమర్శలతో కలతకు గురికాలేదన్నారు. ఇలావుండగా ఇది ప్రతి ప్రవాసభారతీయుడు గర్వించదగ్గ క్షణమని అమెరికా చట్టసభ (కాంగ్రెస్) సభ్యురాలు గ్రేస్ మెంగ్ చెప్పారు. నీనా సాధించిన ఈ ఘనత 1945లో యూదులు గర్వించినప్పటి క్షణం లాంటిదని ఆమె అభివర్ణించారు. 1945లో మిస్ అమెరికా కిరీటం పొందిన బెస్ మియర్సన్ ఆ ఘనత సాధించిన తొలి యూదు మహిళగా వినుతికెక్కారు. -
నా మనవరాలేనా!
నీనా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పోటీల్లో విజయం సాధించకపోతే నిరుత్సాహానికి గురవుతుందేమోనని భయపడ్డా. ఆమె అనుకున్నది సాధించడం మా అందరికీ చాలా గర్వంగా ఉందని నూజెర్సీలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో పదిహేను మందితో తలపడిన మిస్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకున్న నీనా దావులూరి అమ్మమ్మ, మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. కోటేశ్వరమ్మ అన్నారు. విజయవాడ నగరంలో విద్యారంగంలో తనకంటూ ఓ స్థానం సముపార్జించిన మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వేగే కోటేశ్వరమ్మ మనవరాలే నీనా. తమ చేతిలో పెరిగి, తమ కళ్ల ముందు తప్పటడుగులు వేసి, చిట్టిపొట్టి మాటలు నేర్చుకున్న చిన్నితల్లి నేడింతటి ఘన విజయం సాధించడం తమకు ఎంతో సంతోషం, గర్వంగా ఉందంటూ కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులు వేడుక చేసుకున్నారు. చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉండే నీనా చదువుతోపాటు కూచిపూడి, ఇతర శాస్త్రీయ నృత్యాలను ఇక్కడే నేర్చుకుందని, ఏటా నగరానికి వస్తుందని ఆమె పెద్దమ్మ డాక్టర్ అవిర్నేని శశిబాల చెబుతున్నారు. నీనా మిస్ అమెరికాగా ఎంపికైన వార్త విన్న తర్వాత తాము అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించినట్లు ఆమె తెలిపారు. ఆ కుటుంబాలు పొందిన మధురానుభూతులు కోటేశ్వరమ్మ మాటల్లో వింటే.... ఇటీవల నీనా పాల్గొన్న పోటీల వీడియో క్లిప్పింగ్ చూశా. దానిలో నీనా మాట్లాడిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అసలు నా మనవరాలు అన్ని అంశాల్లో ఇలా అనర్గళంగా మాట్లాడటం చూసి నేనే ఆశ్చర్యపోయా.. చిన్నప్పటి నుంచి ప్రతి అంశంలోనూ చాలా పట్టుదలతో కృషి చేస్తుంది. పాఠశాల స్థాయిలోనూ మొదటి స్థానంలో నిలిచేది. ప్రస్తుతం బీఎస్ పూర్తి చేసింది. డాక్టర్ కావాలని కోరుకుంటోంది. కార్డియాలజిస్ట్‌గా సేవలు అందించాలని భావిస్తోంది. ఆమె ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అమెరికాలోనే పుట్టినా ఈ నేలమీదనే నడక, నడత నేర్చుకుంది. మాట, మర్యాద, మన్నన అలవర్చుకుంది. అమ్మమ్మ ఆశీస్సులు, పెద్దమ్మ డాక్టర్ అవిర్నేని శశిబాల పెంపకం, నరనరాన జీర్ణించుకున్న తెలుగుదనం, రక్తగతమైన ఈ సంప్రదాయ విలువలే నీనాను విజేతగా నిలిపాయి. ఆమె విజయంలో నీనా చేసిన బ్యాలీ నృత్యం, ప్లాస్టిక్ సర్జరీపై అడిగిన ప్రశ్నకు సహజత్వానికి మించిన సౌందర్యం లేదంటూ ఓ భారతీయ స్త్రీ ఆచరించే నిరాడంబరతలే అందాల కిరీటాన్ని ఆమె పరం చేశాయి. ఇదంతా చిన్నప్పుడు ఇక్కడ పెరగడం వల్ల అబ్బిన లక్షణాలు, మూర్తిమత్వం ఫలితమేననడంలో అతిశయోక్తి లేదు. మిచిగాన్ విశ్వవిద్యాలయం గ్యాడ్యుయేట్ అయిన నీనా వైద్య వృత్తిలో కొనసాగాలని కోరుకుంటోంది. -
అమెరికా అందాల రాణి నీనా దావులూరి
ప్రతిష్టాత్మక పోటీలో గెలిచిన తొలి భారత సంతతి యువతి స్థూలకాయాన్ని అధిగమించి మరీ అందాల కిరీటం సొంతం విజయవాడ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన నీనా కుటుంబం విజయవాడలో కూచిపూడి అభ్యాసం న్యూజెర్సీ/విజయవాడ, సాక్షి: ప్రతిష్టాత్మకమైన మిస్ అమెరికా పోటీలో ప్రవాసాంధ్ర సంతతికి చెందిన నీనా దావులూరి గెలుపొంది చరిత్ర సృష్టించారు. అమెరికా సుందరిగా ఒక భారత సంతతి యువతి గెలుపొందటం ఇదే తొలిసారి. అంతేకాదు.. స్థూలకాయంతో బాధపడుతూ దానిని అధిగమించి మరీ అమెరికా సుందరి కిరీటాన్ని కైవసం చేసుకోవటం 24 ఏళ్ల నీనా సాధించిన మరో ఘనవిజయం. న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో సోమవారం జరిగిన మిస్ అమెరికా పోటీలో.. 53 రాష్ట్రాల నుంచి 53 మంది సుందరీమణులు పాల్గొనగా.. మిస్ న్యూయార్క్‌గా నీనా బరిలోకి దిగారు. తమ కుటుంబ స్వస్థలమైన కృష్ణా జిల్లాలో చిన్నప్పటి నుంచీ అభ్యసించిన కూచిపూడి నృత్యం, బాలీవుడ్ నృత్యాన్ని మేళవించి ప్రదర్శన ఇచ్చిన నీనా న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని అమెరికా సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం ద్వారా ఆమెకు దాదాపు 50,000 డాలర్ల (సుమారు 35 లక్షల రూపాయలు) మేర స్కాలర్‌షిప్‌ల రూపంలో అందనున్నాయి. నీనా తండ్రి దావులూరి ధనకోటేశ్వర చౌదరి అమెరికాలో సెయింట్ జోసెఫ్స్ ఆస్పత్రిలో ప్రసూతి వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి షీలారంజని వెబ్ డిజైనర్. నీనా అమ్మమ్మ వేగె కోటేశ్వరమ్మ విజయవాడలో ప్రముఖ విద్యావేత్త, మాంటిస్సోరీ విద్యాసంస్థల అధినేత. డాక్టర్ చౌదరి కుటుంబం 1970లలోనే అమెరికాలో ప్రవాసం వెళ్లి అక్కడ స్థిరపడింది. నీనా 1989 ఏప్రిల్ 20న అమెరికాలోని సెర్క్యూస్లో జన్మించారు. నాలుగేళ్ల వయసులో వారి కుటుంబం ఓక్లహామాకు నివాసం వచ్చింది. నీనాకు పదేళ్ల వయసులో మిచిగన్‌కు మకాం మార్చారు. ఆరేళ్ల కిందట ఆమె కుటుంబం ఫయెటెవిలేకు నివాసం మారింది. విజయవాడలో కూచిపూడి అభ్యాసం... నీనా పుట్టింది అమెరికాలోనే అయినా విజయవాడతో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. పుట్టిన నెలన్నర వయస్సులోనే నీనాను ఆమె పెద్దమ్మ డాక్టర్ శశిబాల విజయవాడ తీసుకువచ్చారు. ఆ తర్వాత నీనా రెండున్నర ఏళ్లు ఆమె వద్దే పెరిగారు. అప్పటి నుంచీ ప్రతి ఏటా కనీసం మూడు నెలల కాలం విజయవాడ వచ్చి అక్కడే ఉంటూ కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ నుంచి మెదడు ప్రవర్తన, అభిజ్ఞశాస్త్రం (బ్రెయిన్ బిహేవియర్ అండ్ కాగ్నిటివ్ సైన్స్)లో నీనా డిగ్రీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచి అన్ని రంగాల్లో ముందంజలో ఉండే నీనా, అమె సోదరి మీనా స్కూల్ విద్యను అభ్యసించే సమయంలోనే మిస్ సెయింట్ జోగా ఎన్నికయ్యారు. 2006లో టీన్ అమెరికాపీజెంట్లో పాల్గొన్న నీనా రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది తన డిగ్రీ పూర్తి చేసుకుని మిస్ అమెరికా పోటీలపై దృష్టి పెట్టారు. స్థూలకాయాన్ని అధిగమించి మరీ... మొదట తాను నివసించే ప్రాంతం నుంచి మిస్ సెర్క్యూస్గా, ఆ తర్వాత మిస్ న్యూయార్క్‌గా గెలుపొందారు. న్యూయార్క్ సుందరిగా గెలవటానికి ముందు అధికంగా ఆహారం తీసుకోవటం (బ్యులీమియా), అధిక బరువు సమస్యలతో బాధపడిన నీనా.. ఆ పోటీలో గెలవటం కోసం 60 పౌండ్ల (దాదాపు 30 కిలోలు) బరువు తగ్గినట్లు చెప్పారు. మిస్ అమెరికా కిరీటం గెలుచుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిస్ అమెరికా పోటీలో భిన్నత్వానికి పట్టం కట్టటం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఇన్నేళ్లుగా తన సంస్కృతికి సంబంధించి.. తన కుటుంబమే తనకు పెళ్లి సంబంధం చూస్తుందన్న తరహా దురభిప్రాయాలను ఎన్నిటినో తాను తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాను స్థూలకాయాన్ని అధిగమించానని.. ఎవరైనా సరే, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. తాను తొలి భారతీయ మిస్ న్యూయార్క్నని, అలాగే తొలి భారతీయ మిస్ అమెరికా కావటం తనకెంతో గర్వకారణంగా ఉందని ఆనందబాష్పాలతో చెప్పారు. తండ్రిలాగే తాను కూడా వైద్య వృత్తి చేపడతానని.. అప్స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాలని భావిస్తున్నానని తెలిపారు. మానసిక సౌందర్యమే గొప్పది... మిస్ అమెరికా పోటీదారులను సాయంత్రం ధరించే గౌన్లు, జీవనశైలి/ధారుడ్యం, నైపుణ్యం, వ్యక్తిగత ఇంటర్వ్యూలు, వేదికపై అడిగిన ప్రశ్నలు ప్రాతిపదికగా పరీక్షించి విజేతలను నిర్ణయించారు. ప్లాస్టిక్ సర్జరీ గురించి న్యాయనిర్ణేతలు అడిగిన ఒక ప్రశ్నకు.. జన్మతః వచ్చిన అందంతో పాటు ఏ సర్జరీకి తలొగ్గని మానసిక అందమే గొప్పదని సమాధానం చెప్పి నీనా మిస్ అమెరికా కిరీటాన్ని గెలుచుకున్నారు. రెండో స్థానంలో మిస్ కాలిఫోర్నియా క్రిస్టల్ లీ, మూడో స్థానంలో మిస్ ఓక్లహామా కెస్లీగ్రిస్వాల్డ్ నిలిచారు. ఇదిలావుంటే.. మిస్ న్యూయార్క్‌గా ఉన్న మహిళే మిస్ అమెరికా కిరీటాన్ని వరుసగా రెండోసారి గెలుచుకోవటం విశేషం. గత ఏడాది మిస్ న్యూయార్క్ మలోరీ హేగన్ ఆ ఏడాది మిస్ అమెరికాగా నిలిచారు. ఆమె స్థానంలో ఇప్పుడు నీనా దావులూరి మిస్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యం సాధించింది: డాక్టర్ శశిబాల (పెద్దమ్మ) నీనా మిస్ అమెరికా కిరీటం గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నీనా పుట్టినప్పుడే రెండున్నర సంవత్సరాలు నావద్దే పెరిగింది. అన్ని విషయాల్లో చాలా చురుకుగా ఉండేది. కుటుంబంలో అందరూ డాక్టర్లే ఉన్నారు. తనని కూడా డాక్టర్ చేయమని అడిగినపుడు తనకు మిస్ అమెరికా కావాలన్న గోల్ ఉందని అది పూర్తి అయిన తర్వాత డాక్టర్ చేస్తానని చెప్పింది. తన గోల్‌ను ఎంతో ఆత్మవిశ్వాసంతో సాధించింది. కార్డియాలజిస్ట్‌గా చూడాలని ఉంది: కోటేశ్వరమ్మ (అమ్మమ్మ) నీనా దావులూరిని కార్డియాలజిస్టుగా చూడాలని ఉంది. నీనా అక్క మీనా కూడా మెడిసిన్ చేస్తోంది. నీనా మిస్ అమెరికాగా గెలవడం చాలా ఆనందంగా ఉంది. విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చిన నీనా ఆందాల పోటీలతోనే కాకుండా చదువుల్లో కూడా ముందుండాలని కోరుకుంటున్నా. -
బెజవాడ ముద్దుగుమ్మ...
బెజవాడ అందం అమెరికాలో విరిసింది..మెరిసింది. చదువులమ్మ ఇంట సౌందర్యం గుబాళించింది. కూచిపూడి నృత్యం, భారతీయ వినయం, తెలుగుదనపు చురుకుదనం, సంప్రదాయపు సరళత్వం, సహజత్వం.. వెరసి మిస్ అమెరికా కిరీటం బెజవాడ అమ్మాయి నీనా దావులూరి తలమానికమైంది. విజయవాడ పేరుప్రతిష్ఠలు అంతర్జాతీయంగా మరోమారు మార్మోగాయి. విజయవాడ, న్యూస్‌లైన్ : అమెరికాలో తెలుగువారి తేజం మరోమారు మెరిసింది. ప్రపంచ పెద్దన్న అమెరికాలో అసాధారణ ప్రజ్ఞ, అవిరళకృషితో వ్యాపార, సాఫ్ట్వేర్ రంగాల్లో మన వారెందరో రాణిస్తున్నారు. ఇప్పుడు సౌందర్యంలో తామెవరికీ తీసిబోమని చాటారు నీనా దావులూరి. మిస్ అమెరికా పోటీల్లో ఈ అమ్మాయి విజేతగా నిలిచి విజయవాడ ఘనతను మరోమారు చాటింది. న్యూజెర్సీలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో పదిహేను మందితో తలపడిన నీనా మిస్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలు కూడా ఆమే. నీనా తల్లి షీలారంజని సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, తండ్రి దావులూరి చౌదరి డాక్టరు. ఆమె అమెరికాలోనే పుట్టినా ఈ నేలమీదనే నడక, నడత నేర్చుకుంది. మాట, మర్యాద, మన్నన అలవర్చుకుంది. విజయవాడ నగరంలో విద్యారంగంలో తనకంటూ ఓ స్థానం సముపార్జించిన మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వేగే కోటేశ్వరమ్మ మనవరాలే నీనా. అమ్మమ్మ ఆశీస్సులు, పెద్దమ్మ డాక్టర్ అవిర్నేని శశిబాల పెంపకం, నరనరాన జీర్ణించుకున్న తెలుగుదనం, రక్తగతమైన ఈ సంప్రదాయ విలువలే నీనాను విజేతగా నిలిపాయి. ఆమె విజయంలో నీనా చేసిన బ్యాలీ నృత్యం, ప్లాస్టిక్ సర్జరీపై అడిగిన ప్రశ్నకు సహజత్వానికి మించిన సౌందర్యం లేదంటూ ఓ భారతీయ స్త్రీ ఆచరించే నిరాడంబరతలే అందాల కిరీటాన్ని ఆమె పరం చేశాయి. ఇదంతా చిన్నప్పుడు ఇక్కడ పెరగడం వల్ల అబ్బిన లక్షణాలు, మూర్తిమత్వం ఫలితమేననడంలో అతిశయోక్తి లేదు. తమ చేతిలో పెరిగి, తమ కళ్ల ముందు తప్పటడుగులు వేసి, చిట్టిపొట్టి మాటలు నేర్చుకున్న చిన్నితల్లి నేడింతటి ఘన విజయం సాధించడం తమకు ఎంతో సంతోషం, గర్వంగా ఉందంటూ కోటేశ్వరమ్మ, శశిబాల కుటుంబ సభ్యులు వేడుక చేసుకుంటున్నారు. చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉండే నీనా చదువుతోపాటు కూచిపూడి, ఇతర శాస్త్రీయ నృత్యాలను ఇక్కడే నేర్చుకుందని, ఏటా నగరానికి వస్తుందని ఆమె పెద్దమ్మ డాక్టర్ అవిర్నేని శశిబాల చెబుతున్నారు. నీనా మిస్ అమెరికాగా ఎంపికైన వార్త విన్న తర్వాత తాము అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించినట్లు ఆమె తెలిపారు. ఆ కుటుంబాలు పొందిన మధురానుభూతులు వారి మాటల్లోనే... మాటల్లో చెప్పలేని ఆనందం : డాక్టర్ అవిర్నేని శశిబాల, నీనా పెద్దమ్మ ఉదయం ఎనిమిది గంటల సమయంలో టీవీల్లో తెలుగమ్మాయి మిస్ అమెరికాగా ఎంపికైనట్లు వార్తలు చూశాం. ఆ తర్వాత కొద్దిసేపటికే మా చెల్లెలు షీలారంజని కూతురు నీనా మిస్ అమెరికాగా ఎంపికైనట్లు తెలిసిన వారు ఫోన్ చేసి చెప్పారు. దీంతో మాటల్లో చెప్పలేని ఆనందం పొందాం. నీనా పుట్టిన తర్వాత రెండున్నర సంవత్సరాల వరకూ నా వద్దే పెరిగింది. ప్రతి సంవత్సరం నగరానికి వస్తుంటుంది. ఇక్కడే కూచిపూడి, క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు పియానో కూడా చేర్చుకుంది. 2006లో టీన్ అమెరికా పోటీల్లో రన్నర్‌గా నిలిచిన నీనా మిస్ అమెరికా పోటీల కోసం ఆరు నెలలుగా ఎంతో కష్టపడింది. అందులో భాగంగానే సెరిక్యూజ్ పట్టణం నుంచి ఎంపికైన నీనా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచి మిస్ అమెరికా పోటీల్లో పాల్గొంది. ఆమె మిస్ అమెరికాగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా పోటీల ప్రాసెస్ ముగియక పోవడంతో నీనాతో మాట్లాడలేక పోయా. ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఎదురు చూస్తున్నా... ఆశించిన లక్ష్యాన్ని సాధించింది : డాక్టర్ వి.కోటేశ్వరమ్మ, మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత, నీనా అమ్మమ్మ నీనా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పోటీల్లో విజయం సాధించకపోతే నిరుత్సాహానికి గురవుతుందేమోనని భయపడ్డా. ఆమె అనుకున్నది సాధించడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇటీవల నీనా పాల్గొన్న పోటీల వీడియో క్లిప్పింగ్ చూశా. దానిలో ఆమె మాట్లాడిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అసలు నా మనమరాలు అన్ని అంశాల్లో ఇలా అనర్గళంగా మాట్లాడటం చూసి నేనే ఆశ్చర్యపోయా.. చిన్నప్పటి నుంచి ప్రతి అంశంలోనూ చాలా పట్టుదలతో కృషి చేస్తుంది. పాఠశాల స్థాయిలోనూ మొదటి స్థానంలో నిలిచేది. ప్రస్తుతం బీఎస్ పూర్తి చేసింది. డాక్టర్ కావాలని కోరుకుంటోంది. కార్డియాలజిస్ట్‌గా సేవలు అందించాలని భావిస్తోంది. ఆమె ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నా. -
తెలుగమ్మాయి
-
మిస్ అమెరికాగా కిరీటాన్ని కైవసం చేసుకున్న తెలుగమ్మాయి
అమెరికా అందాల పోటీల్లో ప్రవాస తెలుగు యువతి, మిస్ న్యూయార్క్ నీనా దావులూరి(24) మెరిసింది. మిస్ అమెరికా అందాల పోటీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. అట్లాంటా నగరంలో నిర్వహించిన పోటీలో 15 సెమీ ఫైనలిస్టులను వెనక్కు నెట్టి ఆమె మిస్ అమెరికా కిరీటాన్ని అందుకుంది. బ్రాడ్‌వాక్ హాలులో జరిగిన ఈ పోటీని అమెరికా అంతటా టీవీలో ప్రసారం చేశారు. అంతకుముందు ఈ టైటిల్ అందుకున్న మాజీ మిస్ న్యూయార్క్ మాలోరి హాగన్.. నీనాకు కిరీటం అలంకరించింది. విజేతగా నిలిచిన నీనాకు 50 వేల డాలర్లు ఉపకార వేతనంగా అందుతాయి. -
మిస్ అమెరికా మన అమ్మాయే!
-
అమెరికాలో మెరిసిన తెలుగు అందం
అమెరికా అందాల పోటీల్లో ప్రవాస తెలుగు యువతి, మిస్ న్యూయార్క్ నీనా దావులూరి(24) మెరిసింది. మిస్ అమెరికా అందాల పోటీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. యువతి మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి ప్రవాస భారతీయ యువతిగా ఆమె నిలిచింది. మిస్ న్యూయార్క్‌గా ఎంపికయిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది. అట్లాంటా నగరంలో నిర్వహించిన పోటీలో 15 సెమీ ఫైనలిస్టులను వెనక్కు నెట్టి ఆమె మిస్ అమెరికా కిరీటాన్ని అందుకుంది. బ్రాడ్‌వాక్ హాలులో జరిగిన ఈ పోటీని అమెరికా అంతటా టీవీలో ప్రసారం చేశారు. అంతకుముందు ఈ టైటిల్ అందుకున్న మాజీ మిస్ న్యూయార్క్ మాలోరి హాగన్.. నీనాకు కిరీటం అలంకరించింది. విజేతగా నిలిచిన నీనాకు 50 వేల డాలర్లు ఉపకార వేతనంగా అందుతాయి. టాలెంట్ విభాగంలో ఆమె చేసిన 'బాలీవుడ్' డాన్స్ అలరించింది. ప్లాస్టిక్ సర్జరీపై అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం జడ్జిలను ఆకట్టుకుంది. ప్లాస్టిక్ సర్జరీకి తాను వ్యతిరేకమని, జన్మతః వచ్చిన అందంతో పాటు ఏ సర్జరీకి తలవంచని మానసిక అందమే గొప్పదని ఆమె సమాధానమిచ్చింది. తన తండ్రిలాగే తాను కూడా డాక్టర్ కావాలనుకుంటున్నట్టు చెప్పింది. నీనా దావులూరి తల్లిదండ్రులు కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన వారు.