అమెరికా అందాల రాణి నీనా దావులూరి | Nina davuluri wins miss america title | Sakshi
Sakshi News home page

అమెరికా అందాల రాణి నీనా దావులూరి

Published Tue, Sep 17 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

అమెరికా అందాల రాణి నీనా దావులూరి

అమెరికా అందాల రాణి నీనా దావులూరి

ప్రతిష్టాత్మక పోటీలో గెలిచిన తొలి భారత సంతతి యువతి
స్థూలకాయాన్ని అధిగమించి మరీ అందాల కిరీటం సొంతం
విజయవాడ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన నీనా కుటుంబం
విజయవాడలో కూచిపూడి అభ్యాసం

న్యూజెర్సీ/విజయవాడ, సాక్షి:

ప్రతిష్టాత్మకమైన మిస్ అమెరికా పోటీలో ప్రవాసాంధ్ర సంతతికి చెందిన నీనా దావులూరి గెలుపొంది చరిత్ర సృష్టించారు. అమెరికా సుందరిగా ఒక భారత సంతతి యువతి గెలుపొందటం ఇదే తొలిసారి. అంతేకాదు.. స్థూలకాయంతో బాధపడుతూ దానిని అధిగమించి మరీ అమెరికా సుందరి కిరీటాన్ని కైవసం చేసుకోవటం 24 ఏళ్ల నీనా సాధించిన మరో ఘనవిజయం. న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో సోమవారం జరిగిన మిస్ అమెరికా పోటీలో.. 53 రాష్ట్రాల నుంచి 53 మంది సుందరీమణులు పాల్గొనగా.. మిస్ న్యూయార్క్‌గా నీనా బరిలోకి దిగారు. తమ కుటుంబ స్వస్థలమైన కృష్ణా జిల్లాలో చిన్నప్పటి నుంచీ అభ్యసించిన కూచిపూడి నృత్యం, బాలీవుడ్ నృత్యాన్ని మేళవించి ప్రదర్శన ఇచ్చిన నీనా న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని అమెరికా సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం ద్వారా ఆమెకు దాదాపు 50,000 డాలర్ల (సుమారు 35 లక్షల రూపాయలు) మేర స్కాలర్‌షిప్‌ల రూపంలో అందనున్నాయి. నీనా తండ్రి దావులూరి ధనకోటేశ్వర చౌదరి అమెరికాలో సెయింట్ జోసెఫ్స్ ఆస్పత్రిలో ప్రసూతి వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి షీలారంజని వెబ్ డిజైనర్. నీనా అమ్మమ్మ వేగె కోటేశ్వరమ్మ విజయవాడలో ప్రముఖ విద్యావేత్త, మాంటిస్సోరీ విద్యాసంస్థల అధినేత. డాక్టర్ చౌదరి కుటుంబం 1970లలోనే అమెరికాలో ప్రవాసం వెళ్లి అక్కడ స్థిరపడింది. నీనా 1989 ఏప్రిల్ 20న అమెరికాలోని సెర్క్యూస్‌లో జన్మించారు. నాలుగేళ్ల వయసులో వారి కుటుంబం ఓక్లహామాకు నివాసం వచ్చింది. నీనాకు పదేళ్ల వయసులో మిచిగన్‌కు మకాం మార్చారు. ఆరేళ్ల కిందట ఆమె కుటుంబం ఫయెటెవిలేకు నివాసం మారింది.
 
 విజయవాడలో కూచిపూడి అభ్యాసం...
 నీనా పుట్టింది అమెరికాలోనే అయినా విజయవాడతో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. పుట్టిన నెలన్నర వయస్సులోనే నీనాను ఆమె పెద్దమ్మ డాక్టర్ శశిబాల విజయవాడ తీసుకువచ్చారు. ఆ తర్వాత నీనా రెండున్నర ఏళ్లు ఆమె వద్దే పెరిగారు. అప్పటి నుంచీ ప్రతి ఏటా కనీసం మూడు నెలల కాలం విజయవాడ వచ్చి అక్కడే ఉంటూ కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ నుంచి మెదడు ప్రవర్తన, అభిజ్ఞశాస్త్రం (బ్రెయిన్ బిహేవియర్ అండ్ కాగ్నిటివ్ సైన్స్)లో నీనా డిగ్రీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచి అన్ని రంగాల్లో ముందంజలో ఉండే నీనా, అమె సోదరి మీనా స్కూల్ విద్యను అభ్యసించే సమయంలోనే మిస్ సెయింట్ జోగా ఎన్నికయ్యారు. 2006లో టీన్ అమెరికాపీజెంట్‌లో పాల్గొన్న నీనా రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది తన డిగ్రీ పూర్తి చేసుకుని మిస్ అమెరికా పోటీలపై దృష్టి పెట్టారు.
 
 స్థూలకాయాన్ని అధిగమించి మరీ...
 మొదట తాను నివసించే ప్రాంతం నుంచి మిస్ సెర్క్యూస్‌గా, ఆ తర్వాత మిస్ న్యూయార్క్‌గా గెలుపొందారు. న్యూయార్క్ సుందరిగా గెలవటానికి ముందు అధికంగా ఆహారం తీసుకోవటం (బ్యులీమియా), అధిక బరువు సమస్యలతో బాధపడిన నీనా.. ఆ పోటీలో గెలవటం కోసం 60 పౌండ్ల (దాదాపు 30 కిలోలు) బరువు తగ్గినట్లు చెప్పారు. మిస్ అమెరికా కిరీటం గెలుచుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిస్ అమెరికా పోటీలో భిన్నత్వానికి పట్టం కట్టటం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఇన్నేళ్లుగా తన సంస్కృతికి సంబంధించి.. తన కుటుంబమే తనకు పెళ్లి సంబంధం చూస్తుందన్న తరహా దురభిప్రాయాలను ఎన్నిటినో తాను తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాను స్థూలకాయాన్ని అధిగమించానని.. ఎవరైనా సరే, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. తాను తొలి భారతీయ మిస్ న్యూయార్క్‌నని, అలాగే తొలి భారతీయ మిస్ అమెరికా కావటం తనకెంతో గర్వకారణంగా ఉందని ఆనందబాష్పాలతో చెప్పారు. తండ్రిలాగే తాను కూడా వైద్య వృత్తి చేపడతానని.. అప్‌స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాలని భావిస్తున్నానని తెలిపారు.
 
 మానసిక సౌందర్యమే గొప్పది...
 మిస్ అమెరికా పోటీదారులను సాయంత్రం ధరించే గౌన్లు, జీవనశైలి/ధారుడ్యం, నైపుణ్యం, వ్యక్తిగత ఇంటర్వ్యూలు, వేదికపై అడిగిన ప్రశ్నలు ప్రాతిపదికగా పరీక్షించి విజేతలను నిర్ణయించారు. ప్లాస్టిక్ సర్జరీ గురించి న్యాయనిర్ణేతలు అడిగిన ఒక ప్రశ్నకు.. జన్మతః వచ్చిన అందంతో పాటు ఏ సర్జరీకి తలొగ్గని మానసిక అందమే గొప్పదని సమాధానం చెప్పి నీనా మిస్ అమెరికా కిరీటాన్ని గెలుచుకున్నారు. రెండో స్థానంలో మిస్ కాలిఫోర్నియా క్రిస్టల్ లీ, మూడో స్థానంలో మిస్ ఓక్లహామా కెస్లీగ్రిస్వాల్డ్ నిలిచారు. ఇదిలావుంటే.. మిస్ న్యూయార్క్‌గా ఉన్న మహిళే మిస్ అమెరికా కిరీటాన్ని వరుసగా రెండోసారి గెలుచుకోవటం విశేషం. గత ఏడాది మిస్ న్యూయార్క్ మలోరీ హేగన్ ఆ ఏడాది మిస్ అమెరికాగా నిలిచారు. ఆమె స్థానంలో ఇప్పుడు నీనా దావులూరి మిస్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
 
 ఆత్మవిశ్వాసంతో లక్ష్యం సాధించింది: డాక్టర్ శశిబాల (పెద్దమ్మ)
 నీనా మిస్ అమెరికా కిరీటం గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నీనా పుట్టినప్పుడే రెండున్నర సంవత్సరాలు నావద్దే పెరిగింది. అన్ని విషయాల్లో చాలా చురుకుగా ఉండేది. కుటుంబంలో అందరూ డాక్టర్లే ఉన్నారు. తనని కూడా డాక్టర్ చేయమని అడిగినపుడు తనకు మిస్ అమెరికా కావాలన్న గోల్ ఉందని అది పూర్తి అయిన తర్వాత డాక్టర్ చేస్తానని చెప్పింది. తన గోల్‌ను ఎంతో ఆత్మవిశ్వాసంతో సాధించింది.
 
 కార్డియాలజిస్ట్‌గా చూడాలని ఉంది: కోటేశ్వరమ్మ (అమ్మమ్మ)
 నీనా దావులూరిని కార్డియాలజిస్టుగా చూడాలని ఉంది. నీనా అక్క మీనా కూడా మెడిసిన్ చేస్తోంది. నీనా మిస్ అమెరికాగా గెలవడం చాలా ఆనందంగా ఉంది. విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చిన నీనా ఆందాల పోటీలతోనే కాకుండా చదువుల్లో కూడా ముందుండాలని కోరుకుంటున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement