
బెజవాడ ముద్దుగుమ్మ...
బెజవాడ అందం అమెరికాలో విరిసింది..మెరిసింది. చదువులమ్మ ఇంట సౌందర్యం గుబాళించింది. కూచిపూడి నృత్యం, భారతీయ వినయం, తెలుగుదనపు చురుకుదనం, సంప్రదాయపు సరళత్వం, సహజత్వం.. వెరసి మిస్ అమెరికా కిరీటం బెజవాడ అమ్మాయి నీనా దావులూరి తలమానికమైంది. విజయవాడ పేరుప్రతిష్ఠలు అంతర్జాతీయంగా మరోమారు మార్మోగాయి.
విజయవాడ, న్యూస్‌లైన్ : అమెరికాలో తెలుగువారి తేజం మరోమారు మెరిసింది. ప్రపంచ పెద్దన్న అమెరికాలో అసాధారణ ప్రజ్ఞ, అవిరళకృషితో వ్యాపార, సాఫ్ట్‌వేర్ రంగాల్లో మన వారెందరో రాణిస్తున్నారు. ఇప్పుడు సౌందర్యంలో తామెవరికీ తీసిబోమని చాటారు నీనా దావులూరి. మిస్ అమెరికా పోటీల్లో ఈ అమ్మాయి విజేతగా నిలిచి విజయవాడ ఘనతను మరోమారు చాటింది. న్యూజెర్సీలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో పదిహేను మందితో తలపడిన నీనా మిస్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలు కూడా ఆమే. నీనా తల్లి షీలారంజని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, తండ్రి దావులూరి చౌదరి డాక్టరు. ఆమె అమెరికాలోనే పుట్టినా ఈ నేలమీదనే నడక, నడత నేర్చుకుంది. మాట, మర్యాద, మన్నన అలవర్చుకుంది.
విజయవాడ నగరంలో విద్యారంగంలో తనకంటూ ఓ స్థానం సముపార్జించిన మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వేగే కోటేశ్వరమ్మ మనవరాలే నీనా. అమ్మమ్మ ఆశీస్సులు, పెద్దమ్మ డాక్టర్ అవిర్నేని శశిబాల పెంపకం, నరనరాన జీర్ణించుకున్న తెలుగుదనం, రక్తగతమైన ఈ సంప్రదాయ విలువలే నీనాను విజేతగా నిలిపాయి. ఆమె విజయంలో నీనా చేసిన బ్యాలీ నృత్యం, ప్లాస్టిక్ సర్జరీపై అడిగిన ప్రశ్నకు సహజత్వానికి మించిన సౌందర్యం లేదంటూ ఓ భారతీయ స్త్రీ ఆచరించే నిరాడంబరతలే అందాల కిరీటాన్ని ఆమె పరం చేశాయి. ఇదంతా చిన్నప్పుడు ఇక్కడ పెరగడం వల్ల అబ్బిన లక్షణాలు, మూర్తిమత్వం ఫలితమేననడంలో అతిశయోక్తి లేదు.
తమ చేతిలో పెరిగి, తమ కళ్ల ముందు తప్పటడుగులు వేసి, చిట్టిపొట్టి మాటలు నేర్చుకున్న చిన్నితల్లి నేడింతటి ఘన విజయం సాధించడం తమకు ఎంతో సంతోషం, గర్వంగా ఉందంటూ కోటేశ్వరమ్మ, శశిబాల కుటుంబ సభ్యులు వేడుక చేసుకుంటున్నారు. చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉండే నీనా చదువుతోపాటు కూచిపూడి, ఇతర శాస్త్రీయ నృత్యాలను ఇక్కడే నేర్చుకుందని, ఏటా నగరానికి వస్తుందని ఆమె పెద్దమ్మ డాక్టర్ అవిర్నేని శశిబాల చెబుతున్నారు. నీనా మిస్ అమెరికాగా ఎంపికైన వార్త విన్న తర్వాత తాము అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించినట్లు ఆమె తెలిపారు. ఆ కుటుంబాలు పొందిన మధురానుభూతులు వారి మాటల్లోనే...
మాటల్లో చెప్పలేని ఆనందం : డాక్టర్ అవిర్నేని శశిబాల, నీనా పెద్దమ్మ
ఉదయం ఎనిమిది గంటల సమయంలో టీవీల్లో తెలుగమ్మాయి మిస్ అమెరికాగా ఎంపికైనట్లు వార్తలు చూశాం. ఆ తర్వాత కొద్దిసేపటికే మా చెల్లెలు షీలారంజని కూతురు నీనా మిస్ అమెరికాగా ఎంపికైనట్లు తెలిసిన వారు ఫోన్ చేసి చెప్పారు. దీంతో మాటల్లో చెప్పలేని ఆనందం పొందాం. నీనా పుట్టిన తర్వాత రెండున్నర సంవత్సరాల వరకూ నా వద్దే పెరిగింది. ప్రతి సంవత్సరం నగరానికి వస్తుంటుంది. ఇక్కడే కూచిపూడి, క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు పియానో కూడా చేర్చుకుంది. 2006లో టీన్ అమెరికా పోటీల్లో రన్నర్‌గా నిలిచిన నీనా మిస్ అమెరికా పోటీల కోసం ఆరు నెలలుగా ఎంతో కష్టపడింది. అందులో భాగంగానే సెరిక్యూజ్ పట్టణం నుంచి ఎంపికైన నీనా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచి మిస్ అమెరికా పోటీల్లో పాల్గొంది. ఆమె మిస్ అమెరికాగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా పోటీల ప్రాసెస్ ముగియక పోవడంతో నీనాతో మాట్లాడలేక పోయా. ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఎదురు చూస్తున్నా...
ఆశించిన లక్ష్యాన్ని సాధించింది : డాక్టర్ వి.కోటేశ్వరమ్మ, మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత, నీనా అమ్మమ్మ
నీనా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పోటీల్లో విజయం సాధించకపోతే నిరుత్సాహానికి గురవుతుందేమోనని భయపడ్డా. ఆమె అనుకున్నది సాధించడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇటీవల నీనా పాల్గొన్న పోటీల వీడియో క్లిప్పింగ్ చూశా. దానిలో ఆమె మాట్లాడిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అసలు నా మనమరాలు అన్ని అంశాల్లో ఇలా అనర్గళంగా మాట్లాడటం చూసి నేనే ఆశ్చర్యపోయా.. చిన్నప్పటి నుంచి ప్రతి అంశంలోనూ చాలా పట్టుదలతో కృషి చేస్తుంది. పాఠశాల స్థాయిలోనూ మొదటి స్థానంలో నిలిచేది. ప్రస్తుతం బీఎస్ పూర్తి చేసింది. డాక్టర్ కావాలని కోరుకుంటోంది. కార్డియాలజిస్ట్‌గా సేవలు అందించాలని భావిస్తోంది. ఆమె ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నా.