
ఒబామా, మన్మోహన్‌ల విందుకు నీనా దావులూరి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 27న శ్వేతసౌధంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఇస్తున్న విందుకు మిస్ అమెరికా కిరీటం గెలుచుకున్న ప్రవాస తెలుగు అందగత్తె నీనా దావులూరి(24)ని ఆహ్వానించే అవకాశం ఉందని మాజీ దౌత్యాధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల కృషికి గుర్తింపుగా నీనాకు అవకాశం దక్కనుంది. మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న తొలి భారతీయ అమెరికన్ యువతిగా నీనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
‘అమెరికా పురోగతిలో ప్రవాస భారతీయులు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. అమెరికా స్పెల్లింగ్ బీ అవార్డును చాలాసార్లు సాధించారు. ఇప్పుడు మిస్ అమెరికా కిరీటాన్ని కూడా. నీనా బాలీవుడ్ తరహా నృత్యాలను అమెరికాకు పరిచయం చేశారు’ అని ఆ అధికారి తెలిపారు. మన్మోహన్‌సింగ్ ఈనెల 27న వాషింగ్టన్‌లో ఒబామాతో సమావేశం కానున్నారు. అనంతరం విందు ఏర్పాటుకానుంది. మరోవైపు నీనా ఇంటర్వ్యూ కోసం గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయ మీడియా నుంచి అభ్యర్థనలు అందుతున్నట్లు మిస్ అమెరికా పోటీ నిర్వాహకులు తెలిపారు. కొద్ది నెలల్లో నీనా భారత్‌లో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.