
నా మనవరాలేనా!
నీనా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పోటీల్లో విజయం సాధించకపోతే నిరుత్సాహానికి గురవుతుందేమోనని భయపడ్డా. ఆమె అనుకున్నది సాధించడం మా అందరికీ చాలా గర్వంగా ఉందని నూజెర్సీలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో పదిహేను మందితో తలపడిన మిస్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకున్న నీనా దావులూరి అమ్మమ్మ, మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. కోటేశ్వరమ్మ అన్నారు. విజయవాడ నగరంలో విద్యారంగంలో తనకంటూ ఓ స్థానం సముపార్జించిన మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వేగే కోటేశ్వరమ్మ మనవరాలే నీనా.
తమ చేతిలో పెరిగి, తమ కళ్ల ముందు తప్పటడుగులు వేసి, చిట్టిపొట్టి మాటలు నేర్చుకున్న చిన్నితల్లి నేడింతటి ఘన విజయం సాధించడం తమకు ఎంతో సంతోషం, గర్వంగా ఉందంటూ కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులు వేడుక చేసుకున్నారు. చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉండే నీనా చదువుతోపాటు కూచిపూడి, ఇతర శాస్త్రీయ నృత్యాలను ఇక్కడే నేర్చుకుందని, ఏటా నగరానికి వస్తుందని ఆమె పెద్దమ్మ డాక్టర్ అవిర్నేని శశిబాల చెబుతున్నారు. నీనా మిస్ అమెరికాగా ఎంపికైన వార్త విన్న తర్వాత తాము అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించినట్లు ఆమె తెలిపారు. ఆ కుటుంబాలు పొందిన మధురానుభూతులు కోటేశ్వరమ్మ మాటల్లో వింటే....
ఇటీవల నీనా పాల్గొన్న పోటీల వీడియో క్లిప్పింగ్ చూశా. దానిలో నీనా మాట్లాడిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అసలు నా మనవరాలు అన్ని అంశాల్లో ఇలా అనర్గళంగా మాట్లాడటం చూసి నేనే ఆశ్చర్యపోయా.. చిన్నప్పటి నుంచి ప్రతి అంశంలోనూ చాలా పట్టుదలతో కృషి చేస్తుంది. పాఠశాల స్థాయిలోనూ మొదటి స్థానంలో నిలిచేది. ప్రస్తుతం బీఎస్ పూర్తి చేసింది. డాక్టర్ కావాలని కోరుకుంటోంది. కార్డియాలజిస్ట్‌గా సేవలు అందించాలని భావిస్తోంది. ఆమె ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అమెరికాలోనే పుట్టినా ఈ నేలమీదనే నడక, నడత నేర్చుకుంది. మాట, మర్యాద, మన్నన అలవర్చుకుంది. అమ్మమ్మ ఆశీస్సులు, పెద్దమ్మ డాక్టర్ అవిర్నేని శశిబాల పెంపకం, నరనరాన జీర్ణించుకున్న తెలుగుదనం, రక్తగతమైన ఈ సంప్రదాయ విలువలే నీనాను విజేతగా నిలిపాయి. ఆమె విజయంలో నీనా చేసిన బ్యాలీ నృత్యం, ప్లాస్టిక్ సర్జరీపై అడిగిన ప్రశ్నకు సహజత్వానికి మించిన సౌందర్యం లేదంటూ ఓ భారతీయ స్త్రీ ఆచరించే నిరాడంబరతలే అందాల కిరీటాన్ని ఆమె పరం చేశాయి. ఇదంతా చిన్నప్పుడు ఇక్కడ పెరగడం వల్ల అబ్బిన లక్షణాలు, మూర్తిమత్వం ఫలితమేననడంలో అతిశయోక్తి లేదు. మిచిగాన్ విశ్వవిద్యాలయం గ్యాడ్యుయేట్ అయిన నీనా వైద్య వృత్తిలో కొనసాగాలని కోరుకుంటోంది.