
ప్రభాస్ అంటే ఇష్టం: నీనా దావులూరి
తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని మిస్ అమెరికా కిరీటం సొంతం చేసుకున్న ప్రవాస తెలుగు యువతి నీనా దావులూరి చెప్పారు. 2007లో తాను 'వర్షం' సినిమా చూశానని వెల్లడించారు. ప్రభాస్ అంటే తనకెంతో అభిమానమని, ఆయన నటనను ఇష్టపడతానని తెలిపారు. భవిష్యత్లో కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నానని చెప్పారు. తానెంతో ఇష్టపడి నేర్చుకున్న భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను వదలబోనని స్పష్టం చేశారు.
మిస్ అమెరికా కిరీటం గెలుపొందడం నిజంగా తనకు దక్కిన గొప్ప గౌరవమని ఏబీసీ చానల్ గుడ్‌మార్నింగ్ అమెరికా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మాట్లాడుతూ నీనా దావులూరి చెప్పారు. సోషల్ మీడియాలో తనపై కొందరు జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడంపై స్పందిస్తూ... తానెప్పుడూ ముందుగా అమెరికన్‌ననే భావనతోనే ఉండేదాన్నని చెప్పారు. తన భారతీయ వారసత్వంపై వచ్చిన విమర్శలతో కలతకు గురికాలేదన్నారు.
ఇలావుండగా ఇది ప్రతి ప్రవాసభారతీయుడు గర్వించదగ్గ క్షణమని అమెరికా చట్టసభ (కాంగ్రెస్) సభ్యురాలు గ్రేస్ మెంగ్ చెప్పారు. నీనా సాధించిన ఈ ఘనత 1945లో యూదులు గర్వించినప్పటి క్షణం లాంటిదని ఆమె అభివర్ణించారు. 1945లో మిస్ అమెరికా కిరీటం పొందిన బెస్ మియర్సన్ ఆ ఘనత సాధించిన తొలి యూదు మహిళగా వినుతికెక్కారు.